మా ఖాతాకు భద్రత లేదా?


  ఎవరడిగినా డబ్బులిచ్చేస్తారా..

  ఆర్‌బీఐకి నోటీసులిచ్చిన తెలంగాణ సర్కారు

  ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసిన నిధులు రాబట్టేలా కేంద్రంపై ఒత్తిడి

  ఢిల్లీలోనే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్ర


 

 సాక్షి, హైదరాబాద్: ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసిన రూ.1,274 కోట్లు తిరిగి రాబట్టుకునేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చట్ట విరుద్ధంగా ఈ నిధులను జప్తు చేసిందని ఐటీ శాఖపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..  తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా.. తమ సమ్మతి లేకుండా రాష్ట్ర ఖజానాలో ఉన్న నిధులను ఎలా జప్తు చేస్తారని ప్రశ్నించింది. మరుసటి రోజు ఉదయం లావాదేవీల స్టేట్‌మెంట్ చూసేంత వరకు తమ ఖాతాలో నుంచి ఐటీ శాఖకు నిధులు వెళ్లిన విషయం తమకు తెలియకపోవటం విచారకరమని పేర్కొంది. ‘బ్యాంకులో ఉన్న మా నిధులకు భద్రత లేదా..? ఇదే తరహాలో ఎవరొచ్చినా.. ఎవరు అడిగినా... మా ఖాతాలో ఉన్న నిధులను మళ్లిస్తారా..?  కనీసం మాటమాత్రం సమాచారం ఇవ్వకుండా ఐటీ శాఖకు నిధులెలా మళ్లించారు..?’ అని ప్రశ్నించింది.

 

 జప్తు చేసిన నిధులు ఖాతాలో తిరిగి జమ అయ్యేలా చూడాలని ఆర్‌బీఐని కోరింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్ పూర్తిగా విభజన జరగకుండానే రాష్ట్ర కోటా నుంచి బకాయిలు వసూలు చేయటం సమ్మతం కాదని అందులో పేర్కొంది. అది కోర్టు ధిక్కారమే అవుతుందని అందులో స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆర్‌బీఐకి నోటీసులు పంపించారు. అదే ప్రతిని ఐటీ విభాగానికి పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆర్‌బీఐ, ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చే స్పందనను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ నిధులు తిరిగి ఇప్పించాలని రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. నిధులు జప్తు చేసిన మరునాడే ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా ఐటీ శాఖ వసూలు చేసిన నిధులను తిరిగి ఇప్పించాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్ర 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బెవరేజెస్ కార్పొరేషన్ బకాయిల వ్యవహారాన్ని నివేదించటంతో పాటు ఈ నిధులను తిరిగి ఇప్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు విన్నవించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top