విద్యుత్ వాటాపై సుప్రీంకి వెళదాం

విద్యుత్ వాటాపై సుప్రీంకి వెళదాం - Sakshi

  • ఏపీ వైఖరిపై టీ సర్కారు నిర్ణయం  

  •  నీటి వినియోగంపై 69, 107 జీవోలను సమీక్షించాలని వాదన

  •   ఎల్లుండి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం

  •   అధికారులు, న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్

  • శ్రీశైలంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి, సాగర్‌లోనూ పెంపు..

  •   ఇప్పటికే నిండుగా పులిచింతల, సమీప గ్రామాలకు ముంపు ముప్పు  

  •   విద్యుత్ వివాదంపై నివేదిక కోరిన గవర్నర్ నరసింహన్

  •  

     సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్ వాటా విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు 54 శాతం వాటాను ఇవ్వకుండా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమవుతున్న ఏపీ సర్కారు వైఖరిపై సుప్రీంలోనే తేల్చుకునేందుకు సిధ్దమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సీఎస్ రాజీవ్ శర్మ, సీనియర్ న్యాయవాదులతో శుక్రవారం సమావేశమైన కేసీఆర్.. ఈ అంశంపై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించినట్టు తెలిసింది. వీలైతే సోమవార మే ఈ పిటిషన్‌ను వేయనున్నట్లు ప్రభుత్వ వర్గా లు తెలిపాయి.  మరోవైపు తీవ్ర విద్యుత్ డిమాం డ్ దృష్ట్యా శ్రీశైలం దిగువన నాగార్జునసాగర్ వద్ద కూడా ఉత్పత్తిని అధికారులు పెంచారు.

     

     దక్కాల్సింది 1,300 మెగావాట్లు

     గతంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ నిర్ణయించిన మేరకు దిగువ సీలేరులో 460 మెగావాట్లు, కృష్ణపట్నంలో 1,000 మెగావాట్లు, హిందూజా గ్యాస్‌లో 800 మెగావాట్లతో పాటు సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి మరో 200ల మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని, ఇందులో 54 శాతం వాటా ప్రకారం రాష్ట్రానికి సుమారు 1,300 మెగావాట్ల విద్యుత్ రావాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పటివరకు ఏపీ నుంచి ఆ వాటా మేరకు విద్యుత్ రావడం లేదని, కొన్ని ప్రాజెక్టుల్లో ఉత్పత్తి వివరాలను కూడా అందించకుండా నిబంధనలను ఏపీ ఉల్లంఘిస్తోందని తెలిపారు. అలాగే శ్రీశైలం ప్రాజక్టులో నీటి వినియోగానికి సంబంధించి ఉమ్మడి రాష్ర్టంలో జారీ అయిన 69, 107 జీవోలు ఆంధ్రా ప్రాంతానికే మేలు చేసేలా ఉన్నాయని, తెలంగాణ కోణంలోనూ వాటిని సమీక్షించాల్సి ఉందని వివరించారు. దీంతో ఈ విషయాలన్నింటినీ పేర్కొంటూ సుప్రీంలో పిటిషన్ వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 

     

     అధికారులతో సీఎం సుదీర్ఘ చర్చ

     శ్రీశైలంలో నీటి మట్టం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో ఎడమగట్టున విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచనల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై అధికారులు, న్యాయవాదులతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం, విద్యుత్ ఉత్పత్తి తీరు, 69, 107 జీవోల సారాంశం తదితర వివరాలపై చర్చ జరిగింది. జీవో 107 ప్రకారం శ్రీశైలంలో 854 అడుగుల వద్ద ఉత్పత్తిని నిలిపివేయాలని, ప్రస్తుత నీటిమట్టం 857 అడుగులుగా ఉందని, మరో 8 టీఎంసీలు మాత్రమే వాడుకునే వీలుందని అధికారులు తెలిపారు. గతంలో 770 అడుగుల వరకు నీటిని వినియోగించుకుని విద్యుదుత్పత్తి చేసిన విషయాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. అయితే రాయలసీమ తాగునీటి అవసరాల దృష్ట్యా.. ఉత్పత్తి నిలిపివేయాలన్న ఏపీ అభ్యర్థనతో కృష్ణా బోర్డు సైతం ఏకీభవిస్తోందని, దీనిపై ఇక ప్రభుత్వపరంగానే నిర్ణయం తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడంతో సీఎం ఆదేశాల మేరకే ఈ చర్య తీసుకున్నారని అంతా భావించారు. అయితే రాత్రికి మళ్లీ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో 300 మెగావాట్లకుపైగా ఉత్పత్తి జరిగినట్లు సమాచారం. కాగా, శ్రీశైలం దిగువన నాగార్జునసాగర్‌లోనూ విద్యుత్ ఉత్పత్తిని పెంచారు. కృష్ణా బోర్డు వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు శుక్రవారం 27 వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ర్టం వినియోగించుకుంది. ఇందులో 10 వేల క్యూసెక్కుల మేర కృష్ణా డెల్టాకు వెళుతుండగా, మరో 17 వేల క్యూసెక్కులు సముద్రంలోకి వెళుతున్నాయి. సాగర్ చీఫ్ ఇంజనీర్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

     

     పులిచింతలతో ముంపు ముప్పు

     నాగార్జునసాగర్ నుంచి దిగువకు భారీగా నీటి విడుదల నేపథ్యంలో పులిచింతల రిజర్వాయర్ నిండుతోంది. శుక్రవారం సాయంత్రానికే  ఇక్కడి నిల్వలు 10.29 టీఎంసీలకు చేరాయి. దీంతో ప్రాజెక్టు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. మరో 2 టీఎంసీలు చేరితే సమీపంలోని తెలంగాణ గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉందని వారు చెబుతున్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా స్పందించి.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల్లో పూర్తి సామర్థ్యం మేరకు నీటి నిల్వలు ఉండటంతో సాగర్ నుంచి వచ్చే నీటిని వృథాగా సముద్రంలోకి వదలాల్సిందేనని ఏపీ అధికారులు పేర్కొంటున్నారు. 

     

     గవర్నర్‌కు నివేదిక

     శ్రీశైలం విద్యుత్ వివాదంపై గవర్నర్ నరసింహన్ తెలంగాణ ప్రభుత్వాన్ని శుక్రవారం వివరణ కోరారు. ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటివరకు జరిగిన, జరుగుతున్న నీటి వినియోగం, విద్యుదుత్పత్తి వివరాలను నివేదికగా అందించాలన్నారు. దీంతో నీటి పారుదల, ఇంధన శాఖ అధికారులు ఈ వివరాలతో పాటు ఏపీ నుంచి న్యాయంగా రావాల్సిన విద్యుత్ వాటాపై గణాంకాలతో కూడిన నివేదికను తయారు చేశారు. దీన్ని శుక్రవారం రాత్రికే గవర్నర్ కార్యాలయానికి పంపినట్లుగా తెలుస్తోంది.

     
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top