న్యాయపోరాటానికే మొగ్గు!


సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని రెండు రోజుల్లో నిలిపేయాలన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాలపై న్యాయపోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు, న్యాయ నిఫుణులతో చర్చించింది. బోర్డు నిర్ణయం తెలిసిన తర్వాత ఈ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులతో విడతలవారీగా చర్చలు జరిపారు. శనివారం దీనిపై మరోమారు చర్చించాలని, ఒకట్రెండు రోజుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. న్యాయ నిపుణులతో పూర్తిస్థాయి చర్చల తర్వాతే శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి కొనసాగింపుపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయంలో న్యాయపోరాటానికి సిద్ధమని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు స్వయంగా వెల్లడించారు. అలాగే బోర్డు నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తూ బోర్డుకు రాష్ర్టం తరఫున నీటిపారుదల శాఖ ప్రత్యుత్తరం పంపింది. ఏపీ వ్యవహారంపై తామిచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకుండా, పూర్తి ఏకపక్షంగా, అనైతికంగా నిర్ణయం తీసుకున్నారని లేఖలో ప్రస్తావించినట్లుగా తెలిసింది.

 

 అధికారులతో సీఎం అత్యవసర భేటీ

 

 కృష్ణా బోర్డు నిర్ణయం వెలువడిన వెంటనే అధికారులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌లతో పాటు అడ్వకేట్ జనరల్ హాజరైనట్లు సమాచారం. తెలంగాణ లేవనెత్తిన అంశాలను, అవసరాలను, ప్రయోజనాలను పట్టించుకోకుండా నిర్ణయం తీసుకున్నదని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి కేటాయించిన 34 టీఎంసీలకు మించి అధికారికంగా 62 టీఎంసీలు, అనధికారికంగా 90 టీఎంసీల మేర నీటిని వాడుకున్నారని ఫిర్యాదు చేసినా బోర్డు పట్టించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. చట్టంలో పేర్కొన్న మేరకు విద్యుత్ వాటా ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వని బోర్డు.. తెలంగాణ పంటలకు అవసరమైన రీతిలో, తమకున్న హక్కుల మేరకు విద్యుదుత్పత్తి చేస్తుంటే అడ్డుకోవడం సబబు కాదని అధికారులు వివరించారు. నీటి పంపకాలను నిర్ణయించే హక్కు బోర్డుకు లేదని, కేవలం కేటాయించిన నీటి వాడకాలపై పర్యవేక్షణకే పరిమితమని చట్టంలో పేర్కొన్న అంశాన్ని న్యాయవాదులు కేసీఆర్ దృష్టికి తేగా బోర్డు ఆదేశాలపై న్యాయ పోరాటానికి ఆయన మొగ్గు చూపినట్లు తెలిసింది.

 

 ఒత్తిళ్లకు తలొగ్గిన బోర్డు: హరీశ్

 

 బోర్డు నిర్ణయం ఏకపక్షం, అనైతికమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని, రాష్ర్ట హక్కులు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటించారు. ఆదేశాల విషయంలో కేంద్రం, ఏపీ ఒత్తిళ్లకు బోర్డు తలొగ్గిందని, పరిధిని మించి ప్రవర్తించిందని ఆరోపించారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని కొనసాగించడంపై న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీశైలంలో నీటి నిల్వలను కాపాడాలంటున్న ఏపీ, హంద్రీనీవా ద్వారా ఇప్పటికీ నీటిని తరలిస్తోందని, అసలు కేటాయింపులే లేని చోట నీటిని ఎలా తీసుకుంటందని మంత్రి ప్రశ్నించారు. బోర్డు నిర్ణయంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు ఎంత ఖర్చయినా విద్యుత్ కొనుగోలు చేసి పంటలను కాపాడతామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ బీజేపీ నేతలు తమ వైఖరేంటో వెల్లడించాలని కూడా హరీశ్ డిమాండ్ చేశారు. వారి కేంద్ర నాయకత్వాన్ని నిలదీయాలని సూచించారు. రాష్ర్ట ప్రభుత్వం 30 లేఖలు రాసినా, వంద దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా అలాంటివేమీ లేవంటూ కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్‌గోయల్ వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు.

 

 బోర్డుకు నిరసన లేఖ

 

 బోర్డు ఆదేశాలపై నిరసన తెలియజేస్తూ రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యుత్తరం పంపింది. ఈ మేరకు వెంటనే లేఖ రాయాలని సీఎం ఆదేశించడంతో సమావేశం తర్వాత ముఖ్య కార్యదర్శి జోషి, ఈఎన్‌సీ మురళీ అప్పటికప్పుడు దాన్ని రూపొందించారు. అందులో బోర్డు చర్యలను తీవ్రంగా ఆక్షేపించినట్లు తెలిసింది. అలాగే కేంద్ర జల సంఘం, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసేందుకూ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top