ఇక యాదాద్రి

ఇక యాదాద్రి - Sakshi


సాక్షి, హైదరాబాద్, భువనగిరి: తిరుమల దివ్యక్షేత్రాన్ని తలపించేలా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృతనిశ్చయంతో ఉన్నారు. ఆలయ పరిసరాలను సకల సౌకర్యాలతో అభివృద్ధి పరచేలా, గుట్టకే కొత్తరూపు తెచ్చేలా బృహత్ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఏడు కొండలవాడుగా తిరుపతి వెంకన్నను కీర్తించినట్టుగా యాదగిరి లక్ష్మీనరసింహుడిని తొమ్మిది కొండలవాడుగా భక్తులకు చేరువ చేసేందుకు భారీ ప్రతిపాదన సిద్ధమవుతోంది. యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న గుట్టలను కూడా దేవాలయానికి అనుబంధంగా మార్చి ఒక్కో గుట్టకు ఒక్కో పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రధాన గుట్టకు యాదాద్రిగా త్రిదండి చినజీయర్ స్వామి నామకరణం చేశారు. గురువారం చినజీయర్ స్వామితో కలసి యాదగిరి క్షేత్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. ప్రభుత్వ ప్రణాళికను కేసీఆర్ ఆయనకు స్వయంగా వివరించి.. అవి ఆగమశాస్త్ర బద్ధంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని కోరారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే కూడా నిర్వహించి తన ఆలోచనలన్నింటినీ జీయర్ స్వామికి ముఖ్యమంత్రి వివరించారు. తర్వాత గుట్టపైన అడుగడుగునా ప్రతిపాదిత పనుల తీరును విడమర్చి చెప్పారు.

 

 

  అన్నింటినీ పరిశీలించిన జీయర్ స్వామి.. యాదగిరి క్షేత్ర అభివృద్ధిపై కేసీఆర్ ఆలోచనలకు ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఆలోచనలున్న ముఖ్యమంత్రి మరెవరూ ఉండరేమోనని ఆయన ప్రస్తుతించారు. ఈ సందర్భంగానే యాదగిరిగుట్టకు యాదాద్రిగా చారిత్రక నామాన్ని జీయర్‌స్వామి ప్రతిపాదించారు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే అంగీకరించారు. గుట్ట చుట్టుపక్కల ప్రస్తుతం ప్రభుత్వ అధీనంలో ఏడు గుట్టలున్నాయి. ప్రైవేటు అధీనంలో మరో రెండుమూడున్నాయి. దీంతో మొత్తంగా తొమ్మిది గుట్టలను ఈ క్షేత్రం పరిధిలోకి తెచ్చి నవగిరులుగా అభివృద్ధి చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. వాటికి కూడా నామకరణం చేయాల్సిందిగా జీయర్‌స్వామిని కోరారు. భక్తులు వెళ్లడానికి వీలుగా వీటన్నింటినీ అనుసంధానిస్తూ భవిష్యత్తులో మోనో రైలు ఏర్పాటు ఆలోచన కూడా ఉందని కేసీఆర్ వెల్లడించారు. కాలుష్య రహిత వాహనాలను గుట్టపైకి అనుమతించాలనే ప్రతిపాదనలో భాగంగా బ్యాటరీ వాహనాల అంశం కూడా చర్చకు వచ్చింది. మోనోరైలు ఏర్పాటు బాగుం టుందని అధికారులు పేర్కొనగా వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదే శించారు.

 

 32 నరసింహుడి రూపాల ఏర్పాటు

 దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ల క్ష్మీనరసింహస్వామి ఆలయాల లెక్క తీయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాథమికంగా 32 ఆలయాలున్నట్టు తేల్చారు. దీంతో ఆయా ఆలయాల్లోని స్వామి రూపాలను ప్రతిబింబించేలా యాదగిరిగుట్టలో విగ్రహాలను ఏర్పాటు చేసి, ఆయా క్షేత్రాల వివరాలను పొందుపరచాలని ఆదేశించారు. ఆంజనేయస్వామి విగ్రహానికి అనుబంధంగా భక్తుల మండల దీక్షల కోసం ఒక ప్రాంగణాన్ని నిర్మించనున్నట్టు సీఎం చెప్పారు. ప్రధాన ఆలయానికి అడ్డుగా ముందుభాగంలో ఎలాంటి నిర్మాణాలు ఉండవని, ఆ  ప్రాంగణాన్ని హరితవనంగా రూపొందించనున్నట్టు తెలిపారు. స్వామి వారికి మహా నైవేద్యం సమర్పించేందుకు సిద్ధం చేసే పదార్థాల తయారీకి ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే వంటశాల ఏర్పాటు చేస్తామన్నారు. గుట్ట పైభాగంలో వంద వాహనాలు నిలపగలిగేలా, కింది భాగంలో ఐదు వేల వాహనాలు నిలిపేలా పార్కింగ్ వసతి ఏర్పాటు చేస్తామన్నారు.

 

 రోడ్లు, చెరువులకు మహర్దశ

 

 యాదగిరిగుట్టకు దారితీసే రాయగిరి, వంగపల్లి, తుర్కపల్లి, రాజాపేట మార్గాలను అద్భుతంగా అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. రాయగిరి, యాదగిరిగుట్ట చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. గుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న రిజర్వు ఫారెస్ట్ భూములను లక్ష్మీనరసింహ అభయారణ్యంగా అభివృద్ధిపరుస్తామన్నారు. జాతీయ రహదారి, రైల్వే మార్గాలున్నందున భక్తులు అత్యంత సులువుగా క్షేత్రానికి వచ్చే అవకాశముందని చినజీయర్ స్వామికి వివరించారు. గుట్ట పైభాగంలో అందుబాటులో ఉన్న పద్నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో ఆరు ఎకరాల్లో ప్రధానాలయాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొంటూ సంబంధిత ప్రణాళికలను స్వామికి చూపించారు. చుట్టూ మాడ వీధులు, ఎత్తయిన భారీ ఆంజనేయ స్వామి విగ్రహం, యాగశాల, ప్రవచనాల శాల, వంటశాల, కల్యాణమంటపం వంటివి ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.

 

 కేసీఆర్‌పై ప్రశంసల జల్లు

 

 ప్రభుత్వం రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనలన్నీ ఆగమశాస్త్రం, వైదిక సంప్రదాయాలకు అనుగుణంగానే ఉన్నాయని జీయర్ స్వామి పేర్కొన్నారు. ఆలయ పవిత్రత, సంప్రదాయం ప్రత్యేకతలు చెక్కుచెదరకుండా సమగ్రాభివృద్ధి దిశగా రూపొందించిన ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఓ దేవాలయం అభివృద్ధికి ఏటా రూ. 100 కోట్లు కేటాయిస్తానని ప్రకటించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆరే అయి ఉంటారని కితాబిచ్చారు. యాదగిరిగుట్టలో 1962లో ఏర్పాటు చేసిన వేద పాఠశాలకు పూర్వవైభవం తేవాలని సీఎంకు సూచించారు. ఈ క్షేత్రం పట్ల అత్యంత శ్రద్ధ చూపుతున్న సీఎం కేసీఆర్‌కు, ఆయన ప్రభుత్వానికి ఆ లక్ష్మీనరసింహుడే రక్షగా ఉంటాడని ఆశీర్వదించారు. ప్రజల సంక్షేమంతో పాటు ఆధ్యాత్మిక భావనలు పెంపొందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించడం అభినందనీయమన్నారు. అభివృద్ధి శరీరం వంటిదైతే ఆత్మ ఆధ్యాత్మికమైనదని చెప్పారు. ఈ సత్యాన్ని గ్రహించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించారని జీయర్‌స్వామి ప్రశంసించారు. యాదగిరిగుట్టలో చాలా ఏళ్ల క్రితం ఆగమ సదస్సు జరిగిందని, దక్షిణ భారత పండితులంతా వచ్చి ఆలయాల్లో అనుసరించాల్సిన నిత్యారాధన, బ్రహ్మోత్సవాలు, అభిషేకాల నిర్వహణ వంటి కార్యక్రమాలకు ఏకరూప విధానాలు, పూజాపద్ధతులు రూపొందించుకున్నారని తెలిపారు. పండితులకు జ్ఞానబోధ చేసిన యాదగిరిగుట్ట నుంచే కేసీఆర్ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించడం గొప్ప విషయమని అన్నారు. గుట్ట అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జీయర్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ బూరనర్సయ్యగౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, గుట్ట అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top