రద్దుపై న్యాయ సలహా కోరిన సర్కారు!

రద్దుపై న్యాయ సలహా కోరిన సర్కారు!


న్యాయ నిపుణులతో సంప్రదింపులు



హైదరాబాద్:
ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో మళ్లీ పరీక్ష నిర్వహించాలా, లీకేజీకి బాధ్యులైన వారిని పక్కనపెట్టి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలా అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. న్యాయ నిపుణుల ప్రాథమిక సూచనల మేరకు ఎంసెట్-2ను రద్దు చేయడమే పరిష్కారమని ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రశ్నపత్రం ఒకరికి లీకైనా చట్ట ప్రకారం రద్దు చేయాల్సిందేనని అంటున్నాయి. దీనిపై శుక్రవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఎంసెట్-2 రద్దు చేయవద్దని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.



ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏమిటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మాల్‌ప్రాక్టీస్ నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రం లీకయిందని నిర్ధారణ అయితే ఆ పరీక్ష రద్దు తప్పదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ చెప్పారు.‘‘మాల్‌ప్రాక్టీస్ నిబంధనల ప్రకారం లీకేజీ వ్యవహారాన్ని సానుభూతితో చూడలేం. రద్దు చేయక తప్పదు. లేకుంటే ప్రభుత్వం అందరికీ నచ్చే ప్రత్యామ్నాయం వెతకాల్సి ఉంటుంది..’’ అని మరో అధికారి పేర్కొన్నారు. ఏదేమైనా న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ‘ఎంసెట్-2 లీకేజీ కచ్చితంగా ప్రభుత్వానికి అప్రదిష్టే. దానికి సంబంధిత మంత్రులు, అధికారులు బాధ్యత వహించాల్సిందే. లేకుంటే ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోతుంది..’ అని మరో సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.



ఎంసెట్-3 నిర్వహించాల్సి వస్తే..:

మెడికల్ ప్రవేశాల కోసం ఎంసెట్-3 నిర్వహించాల్సి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నత విద్యామండలికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ ప్రవేశాలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలన్నది ఎంసీఐ నిబంధన అని స్పష్టం చేశారు. ఎంసెట్-3 నిర్వహిస్తే ఆగస్టు నెలాఖరులోగా పరీక్ష పూర్తి చేసి ర్యాంకులు ప్రకటించాలి. తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పది రోజులు పడుతుంది. తర్వాత మూడు విడతల కౌన్సెలింగ్‌కు మరో 20 రోజులు పడుతుంది. ఒకవేళ సమయం సరిపోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లి మరో పది రోజులు అదనపు సమయం కోరాల్సి ఉంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top