రూ. 23 వేల కోట్ల గ్రాంట్ ఇవ్వండి

రూ. 23 వేల కోట్ల గ్రాంట్ ఇవ్వండి - Sakshi

14వ ఆర్థిక సంఘాన్ని కోరనున్న రాష్ర్ట ప్రభుత్వం

  నేడు సంఘం సభ్యులతో భేటీ కానున్న కేసీఆర్ బృందం

  రాష్ర్టంలో చేపట్టిన పథకాలకు సాయం చేయాలని విజ్ఞప్తి

  పలు కార్యాచరణ ప్రణాళికలను వివరించనున్న సీఎం

 

సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదేళ్ల కాలానికి గ్రాంట్ల రూపంలో తెలంగాణకు రూ. 23 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని 14వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు సమాచారం. శుక్రవారంనాడు ఓ స్టార్ హోటల్‌లో ఆర్థిక సంఘం చైర్మన్ వై.వేణుగోపాల్‌రెడ్డితోపాటు సంఘం సభ్యులు, అధికారులతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బృందం సమావేశంకానుంది. పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ఆర్థిక సంఘానికి నివేదికలు ఇవ్వనున్నారు. ముందుగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం వినూత్న పంథాలో చేపడుతున్న కార్యక్రమాలను కేసీఆర్ వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల పరిస్థితులను కేంద్ర సంఘం ముందుంచనున్నారు. ప్రభుత్వం చేపట్టే నిర్దిష్ట కార్యక్రమాలను వెల్లడించడంతో పాటు కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా వాటిని అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలను కూడా సీఎం వివరిస్తారు. 

 

ఆర్థిక సంఘం నుంచి రూ. 23 వేల కోట్లను గ్రాంట్లుగా ఇవ్వాలని, అలాగే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటాను ప్రస్తుతమున్న 32 శాతం నుంచి మరింత పెంచాలని కోరనున్నారు. అయితే మిగిలిన రాష్ట్రాలు కోరుతున్నట్లుగా 50 శాతం వాటా ఇవ్వాలని అడగాలా? లేక వాస్తవిక కోణంలో ఆలోచించి 40 శాతం కోరాలా అన్న అంశంపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 32 శాతం వాటా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన నిధుల వాటా మొత్తం పన్నుల్లో 6.75 శాతంగా ఉంది. ఇందులో తెలంగాణ వాటా 2.87 శాతమే. ఈ నేపథ్యంలో పన్నుల వాటాను పెంచాలని రాష్ర్ట ప్రభుత్వం కోరనుంది. గ్రాంట్ల రూపంలో ప్రభుత్వం కోరనున్న నిధుల్లో 70 శాతం నిధులు ప్రధానంగా స్థానిక సంస్థలకు వెళ్తాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 

 

ఇవి కాకుండా తాగునీటి గ్రిడ్, చిన్ననీటి పారుదల, అంతర్గత భద్రత, పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ, గ్రామీణ రహదారులు, గిరిజన సంక్షేమానికి అధిక నిధులు ఇవ్వాలని కోరనుంది, అలాగే తలసరి ఆదాయం ఆధారంగా నిధుల కేటాయింపునకు ఇచ్చే వెయిటేజీని 47.5 శాతం నుంచి తగ్గించాలని కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా డిమాండ్ చేయనుంది. మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా గ్రామాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకోవాలని, వయబుల్ గ్యాప్ ఫండ్(వీజీఎఫ్)గా తగిన నిధులు ఇవ్వాలని కోరనుంది. విద్య, విత్తనాభివృద్ధి, గ్రీన్‌హౌస్ ప్రాజెక్టులకూ నిధులు కేటాయించాలని, ప్రణాళిక శాఖ పరిధిలోని జిల్లాల వినూత్న నిధి, పర్యవేక్షణ, మదింపు ప్రాధికార సంస్థకు నిధులు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయనుంది.  

 

 ఆర్థిక సంఘం సభ్యులకు గవర్నర్ విందు

పాల్గొన్న సీఎం, ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులు

రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశమయ్యేందుకు గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న 14వ ఆర్థిక సంఘం బృందానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రాత్రి విందు ఇచ్చారు. ఆర్థిక సంఘం చైర్మన్ వై. వేణుగోపాల్‌రెడ్డి, పద్నాలుగు మంది సభ్యులతో పాటు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. దాదాపు గంట పాటు విందు కొనసాగింది. ఆర్థిక సంఘం సభ్యులంతా మధ్యాహ్నమే నగరానికి రాగా.. చైర్మన్ మాత్రం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి ఈటెల రాజేందర్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top