‘ఫాస్ట్’గా వాపస్


పాత పద్ధతిలోనే విద్యార్థుల ఫీజు చెల్లింపు

ఫాస్ట్ పథకాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగింపు

విడతలవారీగా నిధులు చెల్లిస్తాం: ముఖ్యమంత్రి కేసీఆర్

స్థానికత నిర్ధారణకు ‘371డి’ పాటిస్తామని వెల్లడి

ఛాతీ ఆస్పత్రి స్థలంలో 150 కోట్లతో కొత్త సచివాలయం, ఏడాదిలో నిర్మాణాలు పూర్తి

వెంకన్నసహా దేవుళ్లకు తెలంగాణ మొక్కులు

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణలో వెసులుబాటు

ఏడు గంటల సుదీర్ఘ కేబినెట్ భేటీలో నిర్ణయాలు




సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఫీజుల చెల్లింపు కోసం తీసుకొచ్చిన ‘ఫాస్ట్’ పథకాన్ని రాష్ర్ట ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్నే కొనసాగిస్తామని ప్రకటించింది. పేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఉదారంగా వ్యవహరించాలని భావించి.. కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఈ ఏడాదికి సంబంధించిన ఫీజులను విడతలవారీగా విడుదల చేస్తామని, త్వరలోనే కొన్ని నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన పని లేదని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.



‘గత ప్రభుత్వం నాలుగేళ్ల బకాయిలను మా నెత్తిన పెట్టి వెళ్లిపోయింది. దాదాపు రూ. 1800 కోట్ల బకాయిలున్నాయి. ఇప్పటికే కొంత చెల్లించాం. ఇప్పటికే రూ. 862 కోట్ల బకాయిలున్నాయి. వాటిని వెంటనే విడుదల చేస్తున్నాం. పాత బకాయిలన్నీ కడిగేసినం’ అని కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఏడు గంటలకుపైగా ఈ భేటీ జరిగింది. అనంతరం కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్ స్వయంగా వెల్లడించారు.



డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. వివాదాలకు తావులేకుండా చూసేందుకే ‘ఫాస్ట్’ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో విద్యార్థుల స్థానికత నిర్థారణ కోసం 371డీ నిబంధనను మాత్రం పాటిస్తామన్నారు. అందులో ఎలాంటి వివాదం లేదన్నారు.



మరింత చేరువగా క్రమబద్ధీకరణ

‘నిరుపేదలతో పాటు మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన క్రమబద్ధీకరణ విషయంలో మరింత వెసులుబాటు ఇచ్చాం. 125 గజాల వరకు ఉచితంగా పట్టాలిచ్చేందుకు జారీ చేసిన జీవో నెంబర్ 58 కింద దాదాపు 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జీవో 59 కింద తక్కువ సంఖ్యలో వచ్చాయి. దాదాపు రూ. 60 కోట్ల ఆదాయం వచ్చింది. 125 గజాల కంటే కొంత విస్తీర్ణం ఎక్కువగా ఉన్న నిరుపేదలు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఐదు, పది గజాలు ఎక్కువ ఉన్నంత మాత్రాన వారేం ధనవంతులైపోరు. ఈ పరిధిని 150 గజాల వరకు పెంచాం. 125 గజాల వరకు ఉచితంగానే పట్టాలిస్తాం. అంతకు మించి ఉన్న స్థలానికి మాత్రమే మురికివాడల్లో అయితే 10 శాతం, లేకపోతే 25 శాతం విలువ చెల్లించాలి.



దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియనుంది. కానీ మరో రెండు మూడు రోజులు అవకాశమిస్తాం. ఫిబ్రవరి 20 నుంచి పట్టాల పంపిణీ ప్రారంభిస్తాం. మార్చి 10లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. జీవో 59కు సంబంధించి రేటు ఎక్కువగా ఉందని మధ్యతరగతి వర్గాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. అందుకే ఈ రాయితీలో వెసులుబాటు ఇచ్చాం. కొత్త మార్పుల ప్రకారం 250 గజాల వరకు 25 శాతం, 500 గజాల వరకు 50 శాతం, అంతకుమించి 75 శాతం భూముల విలువ చెల్లించాల్సి ఉంటుంది. వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు ఇచ్చాం. ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులకు గడువు ఉంది. ఏప్రిల్ నెలాఖరులోగా వాయిదాలన్నీ చెల్లించాల్సి ఉంటుంది’ అని కేసీఆర్ వెల్లడించారు.



దేవుళ్లకు తెలంగాణ మొక్కులు

‘తెలంగాణ రాష్ట్ర సాధనకు మేం ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు. పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు మొక్కులు మొక్కుకున్నాం. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి రూ.5 కోట్లతో ఆభరణాలు చేయిస్తామని మొక్కినం. వాటిని చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. వాటిని నేనే స్వయంగా వెళ్లి స్వామి వారికి సమర్పిస్తాం. అజ్మీర్ షరీఫ్ దర్గాలో కూడా మొక్కినం. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే అజ్మీర్ యూత్రికులకు రూ.5 కోట్లతో వసతి గృహం ఏర్పాటు చేస్తామన్నాం. అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించగానే అక్కడ హైదరాబాద్ భవన్‌ను నిర్మిస్తాం.



వక్ఫ్‌బోర్డు ద్వారా రూ.2.50 కోట్లతో ఛాదర్ తయారు చేయిస్తున్నాం. నేనే స్వయంగా అక్కడికి తీసుకెళ్తా. వీటితో పాటు వరంగల్‌లో భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటం, కొరివి వీరభద్రస్వామికి బంగారు మీసాలు, విజయవాడ కనక దుర్గమ్మకు ముక్కుపుడక, తిరుపతి పద్మావతి అమ్మవారికి ముక్కుపుడక సమర్పించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ ప్రభుత్వం తరఫున అధికారికంగా సమర్పిస్తాం’ అని సీఎం చెప్పారు.



మార్కెట్లను తీర్చిదిద్దుతాం

‘రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో రూ.100 కోట్లతో కొత్తగా ఆరోగ్యకర వాతావరణంలో శాఖాహార(కూరగాయల), మాంసాహార(మాంసం, చేపల) మార్కెట్లు నిర్మిస్తాం. శాస్త్రీయ విధానంలో కనీసం 3 అడుగుల ఎత్తులో వీటిని ఉంచితే సూక్ష్మ జీవుల వ్యాప్తిని నిరోధించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో సురక్షిత ఆహార పదార్థాల విక్రయాల కేంద్రాలుగా రాష్ట్రంలోని రైతు బజార్లు, మార్కెట్లను తీర్చిదిద్దుతాం. నిజాం నవాబులు నిర్మించిన మోండా మార్కెట్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పటికీ మాంసాహార పదార్థాలపై ఈగ సైతం వాలకుండా అప్పుడు వాడిన జాలీలే ఉన్నాయి.



శనివారం నగరంలోని మంత్రులతో పాటు అధికారులతో కలిసి నేనే మోండా మార్కెట్‌ను పరిశీలిస్తా. అనంతరం సచివాలయంలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం. మెహదీపట్నం రైతు బజార్‌తో పాటు ఇతర మార్కెట్ల అభివృద్ధిపై చర్చిస్తాం. ఇక వరంగల్ కార్పొరేషన్‌కు గ్రేటర్ హోదా కల్పించడంతోపాటు కొత్త పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు నిర్ణయించాం. తెలంగాణ సంసృ్కతికి ప్రచారం కల్పించేందుకు తెలంగాణ సాంసృ్కతిక సారథి విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 558 మంది కళాకారులను నియమిస్తాం. ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలకు గురై పని చేసిన వాళ్లున్నారు. అవసరమైతే అర్హతలపై కొన్ని మినహాయింపులు ఇచ్చి ఈ నియామకాలు చేపడుతాం’ అని కేసీఆర్ వెల్లడించారు.



సచివాలయానికి వాస్తుదోషం

తెలంగాణకు రూ. 150 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని సీఎం ప్రకటిం చారు. సనత్‌నగర్‌లోని ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించి.. అక్కడ నూతన సచివాలయం నిర్మిస్తామన్నారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. పది ఇరవై రోజుల్లోనే ఆసుపత్రిని తరలిస్తామన్నారు. అనంతరం సచివాలయ నిర్మాణాలకు సర్వ మత ప్రార్థనలు చేయించి.. భూమి పూజ చేస్తామన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే అన్ని విభాగాల కార్యాలయాలను ఒకే చోటకు తేవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.



ప్రస్తుతమున్న సచివాలయాన్ని ఏం చేయాలనే విషయంపై తదుపరి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. కాగా, ఇంతకాలం లేని అవసరం ఇప్పుడెందుకు వచ్చిందని విలేకరులు ప్రశ్నించడంతో స్పందించిన సీఎం.. ‘నిజంగా చెప్పాలంటే సచివాలయానికి భయంకరమైన వాస్తుదోషం ఉంది. దీని చరిత్ర కూడా గలీజ్‌గా ఉంది. ఇక్కడున్నోళ్లు ఎవరూ ముందరపడలేదు. తెలంగాణకు అథోగతి పట్టకుండా ఉండాలనే ఈ ఆలోచన చేశాం. ఇప్పటికే ఛాతీ ఆసుపత్రిని మార్చాలని నిర్ణయించాం. స్వచ్ఛమైన గాలి.. కాలుష్యంలేని వాతావరణంలో ఉండాల్సిన క్షయ రోగులకు ఇప్పుడున్న స్థలం శ్రేయస్కరం కాదు.



వికారాబాద్‌లో ఉన్న టీబీ శానిటోరియం పరిస్థితి మరో తీరు. అక్కడ  8 మంది రోగులుంటే... 296 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. అందుకే అక్కడికి ఈ ఆసుపత్రిని తరలించాలని నిర్ణయం తీసుకున్నాం. టీబీ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందికి ఇబ్బంది తలెత్తకుండా.. పీజీ సీట్లు నష్టపోకుండా వారిని ఇక్కడే సర్దుబాటు చేస్తాం. వికారాబాద్‌లో ఉన్న టీబీ శానిటోరియంను అభివృద్ధి చేసేందుకు రూ.7 కోట్లు మంజూరు చేశాం. సెక్రెటరీయట్‌కు స్థలాల పరిశీలన అంశం వచ్చినప్పుడు ఈ ఆసుపత్రి స్థలం అనువుగా ఉంటుందని భావించాం’ అని వివరించారు.



ఫీజులకు 4 వేల కోట్లు!

ఇప్పటివరకూ అమల్లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాన్ని యథాతథంగా అమలుచేస్తే... ఈ ఏడాదికి దాదాపు రూ. 4 వేల కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచనా. కానీ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు రూ. 2,700 కోట్లే. అందులోనూ పాత బకాయిల కిందే సగానికిపైగా నిధులు చెల్లించాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిధిలోకి వచ్చే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగుల విద్యార్థులు మొత్తం 15,67,000 మంది వరకు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top