5 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

5 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు - Sakshi

  • దాదాపు నెల రోజుల పాటు అసెంబ్లీ

  •   వెయ్యి ఎకరాల్లో పాలీ హౌజ్‌ల కోసం 252 కోట్లు

  •   విజయా డైరీ పాల సేకరణలో లీటరుకు రూ. 4 ప్రోత్సాహం.. 

  •  నెల రోజుల పాటు అసెంబ్లీ  తెలంగాణ రాష్ర్ట కేబినెట్ భేటీలో నిర్ణయం

  •  

     సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట తొలి బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 5 నుంచి నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు మంత్రిమండలి నిర్ణయించినట్లు చెప్పారు. శుక్రవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పూర్తిస్థాయిలో దాదాపు నెల పాటు నిర్వహిస్తామని, ఈ సమాచారాన్ని గవర్నర్‌కు పంపిస్తున్నామని కేసీఆర్ వివరించారు. రాష్ర్టంలో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు రూ.300 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 

     

    ‘‘డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ దళితులు/గిరిజనులకు వంద శాతం సబ్సిడీతో... చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, మిగిలిన రైతులకు 80 శాతం సబ్సిడీతో పరికరాలు అందించనున్నాం. తొలి విడతలో హైదరాబాద్ చుట్టుపక్కల వెయ్యి ఎకరాల్లో పాలీహౌజ్ సేద్యాన్ని ప్రోత్సహిస్తాం. ఇందుకు రూ. 252 కోట్లు మంజూరు చేశాం. ప్రతి రైతుకూ వెయ్యి మీటర్ల నుంచి మూడు ఎకరాల వరకు ఈ సేద్యం చేయడానికి అనుమతిస్తాం. అందులో 75 శాతం మేరకు సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 200 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఈ పరికరాలను 50 శాతం సబ్సిడీతో ఇస్తాం. విజయా డెయిరీకి పాలు విక్రయించే రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకంగా ఇవ్వనున్నాం’’ అన్నారు.

     

     రేషన్‌కార్డులపై మరోసారి అధ్యయనం...

     రేషన్‌కార్డుల జారీ, బియ్యం కోటా పెంపు, పెన్షన్ల జారీ అంశాలపై మరోసారి అధ్యయనం చేసి, వీలైనంత త్వరగా అమలు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం వివిధ సంస్థలకు ఇచ్చిన భూములు మూడేళ్లలో వినియోగించుకోని పక్షంలో.. తిరిగి వాటిని తీసుకోవడంతోపాటు ఏ విధంగా వినియోగించుకోవాలన్న అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. భూదానబోర్డు భూములను పూర్తిస్థాయిలో సర్వే చేయాలని నిర్ణయింది. బోర్డు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలతో నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికారులను మంత్రిమండలి ఆదేశించింది. ప్రస్తుతమున్న రిజిస్ట్రేషన్ చట్టాన్ని మార్పులు చేసి మరింత కఠినతరం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వ భూముల కబ్జాతో వివిధ సమస్యలు వస్తున్నందున కబ్జాదారులపై వెంటనే 420 ఐసీపీ కింద కేసులు నమోదు చేయాలని అభిప్రాయపడింది. అలాగే చంద్రబాబుపై ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు ఎక్కడికక్కడ దాడి ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని సమాచారం. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top