పరిశ్రమకు పండుగ


* మెగా ప్రాజెక్టులకు 15 రోజుల్లోనే అన్ని అనుమతులు

* మిగతావాటికి నెల రోజుల్లోగా గ్రీన్‌సిగ్నల్

* అసెంబ్లీ ముందుకు కొత్త పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్-2014

* శాసనసభలో బిల్లును పెట్టిన హరీశ్‌రావు

* సత్వర అనుమతులకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు

* సహాయ సహకారాలకు నోడల్ ఏజెన్సీల ఏర్పాటు

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పెట్టుబడి సదుపాయాల బోర్డు

* దరఖాస్తుదారులకు అండగా ‘టీఎస్‌ఐపాస్ అనుమతుల హక్కు’

* అనుమతుల్లో జాప్యం, దరఖాస్తుల తిరస్కరణకు కారణాల వెల్లడి

* ఏ స్థాయిలో తప్పు జరిగినా బాధ్యులందరికీ శిక్ష



సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకు నూతన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. రాష్ర్టంలో పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం సృష్టించి, భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే తన లక్ష్యమని అసెంబ్లీలో ప్రకటించింది. ‘తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు ఆమోదం, స్వీయ ధ్రువీకరణ(టీఎస్‌ఐపాస్) చట్టం-2014’ పేరుతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశాల మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ కొత్త విధానాన్ని మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు ఈ బిల్లును సభ ముందుంచారు.



దీని ప్రకారం రాష్ర్ట, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి, కంపెనీలు పెట్టడానికి ముందుకువచ్చే పారిశ్రామికవేత్తల దరఖాస్తులను ఆ కమిటీల ద్వారా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో రాష్ర్ట, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే నోడల్ ఏజెన్సీలు కూడా సహాయసహకారాలను అందిస్తాయి. మెగా ప్రాజెక్టులకు 15 రోజుల్లో, మిగతా వాటికి 30 రోజుల్లోగా ఒకే చోట అన్ని అనుమతులు ఇవ్వాలన్నది ఈ విధానం లక్ష్యం. దరఖాస్తుల సమయంలోనే పారిశ్రామికవేత్తలు సమర్పించే స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని ప్రభుత్వ కమిటీలన్నీ ప్రామాణికంగా తీసుకుంటాయి.



ఈ ప్రక్రియలో ఏ స్థాయిలో మోసం జరిగినా, ఏమాత్రం నిబంధనలను ఉల్లంఘించినా అందుకు బాధ్యులైనవారంతా శిక్షార్హులవుతారని బిల్లులో పేర్కొన్నారు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరణకు గురైనా, అనుమతుల్లో జాప్యం జరిగినా అందుకు కారణాలను కూడా ‘టీఎస్‌ఐపాస్ అనుమతుల హక్కు’ కింద పారిశ్రామికవేత్తలు తెలుసుకోవచ్చు. అసెంబ్లీలో ఆమోదం లభించి ఈ కొత్త చట్టం అమల్లోకి రాగానే రాష్ర్టంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సింగిల్ విండో క్లియరెన్స్ చట్టం-2002 రద్దుకానుంది. టీఎస్‌ఐపాస్(తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం)లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.



* రాష్ట్ర స్థాయిలో స్టేట్ టీఎస్‌ఐపాస్ కమిటీ ఏర్పాటవుతుంది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, పరిశ్రమల శాఖ కమిషనర్ సభ్య కార్యదర్శిగా వ్యవ హరిస్తారు. సంబంధిత విభాగాల అధిపతులు సభ్యులుగా ఉంటారు.



* జిల్లా స్థాయిలోనూ టీఎస్‌ఐపాస్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా ఉంటారు. సంబంధిత శాఖల జిల్లా, ప్రాంతీయ స్థాయి అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.



* జిల్లా పరిధిలో పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా కమిటీ స్వీకరిస్తుంది. 30 రోజుల్లో అనుమతులు జారీ చేస్తుంది. జిల్లా పరిధిలోకి రాని ప్రాజెక్టులను రాష్ట్ర కమిటీకి చేరవేస్తుంది.



* దరఖాస్తుల పురోగతి, ఎప్పటిలోగా అనుమతి మంజూరవుతుందనే తేదీల సమాచారాన్ని సంబంధిత శాఖలు, కమిటీలు దరఖాస్తుదారులకు తెలియపరచాలి.



సంబంధిత శాఖల్లో దరఖాస్తుల పురోగతిని కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. శాఖలతో సంబంధం లేకుండానే దరఖాస్తుదారుని స్వీయ ధ్రువీకరణను ఆధారం చేసుకుని జిల్లా కమిటీ ఆమోదం తెలుపుతుంది.



* రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ అదనపు డెరైక్టర్ హోదాకు తక్కువ కాని అధికారి సారధ్యంలో పర్యవేక్షక సిబ్బంది ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా పారిశ్రామిక కేంద్రాన్ని నోడల్ ఏజెన్సీగా పరిగణిస్తారు.



* ఈ నోడల్ ఏజెన్సీలు జిల్లా కమిటీలకు, రాష్ట్ర కమిటీకి సహాయ సహకారాలను అందిస్తాయి. కమిటీలకు అందిన దరఖాస్తులన్నింటికీ రశీదులు అందజేస్తాయి. మూడు రోజుల వ్యవధిలో సంబంధిత విభాగాలకు పంపిస్తాయి. దరఖాస్తుల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తాయి.



* నోడల్ ఏజెన్సీ రశీదు జారీ చేయకముందే పరిశ్రమలకు సంబంధించిన దరఖాస్తులను రాష్ట్ర కమిటీ క్షుణ్నంగా పరిశీలిస్తుంది. పెట్టుబడిదారులకు మార్గదర్శకంగా, సహాయకారిగా ఉండేందుకు వారంలో రెండుసార్లు ఈ పరిశీలన చేపడుతుంది.



* మెగా ప్రాజెక్టుల అనుమతులకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పెట్టుబడి సదుపాయాల బోర్డు(తెలంగాణ స్టేట్ వైడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ బోర్డు-టీస్విప్ట్)ను ఏర్పాటు చేస్తారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి దీనికి మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. స్వీయ ధ్రువీకరణ దరఖాస్తు మేరకు ఈ ప్రాజెక్టులకు 15 రోజుల వ్యవధిలోనే బోర్డు తాత్కాలిక ఆమోదం తెలుపుతుంది. పరిశ్రమలు వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభించకముందే నోడల్ ఆఫీసర్ ద్వారా సంబంధిత శాఖల నుంచి తుది అనుమతుల జారీ అంశాన్ని కూడా బోర్డు పరిశీలిస్తుంది.



టీ స్విప్ట్ బోర్డు జారీ చేసిన అనుమతులు అంతిమమైనవి. అన్ని శాఖలు అందుకు కట్టుబడి ఉంటాయి.

* జిల్లా కమిటీకి తనంతట తానుగా దరఖాస్తులను, అనుమతులను సైతం తిరస్కరించే అధికారముంటుంది. సంబంధిత శాఖలు జారీ చేసిన ఉత్తర్వులను పరీక్షిస్తుంది. తాము తీసుకున్న నిర్ణయాలు, మార్పులు చేర్పులకు సహేతుకమైన కారణాలున్నాయని జిల్లా కమిటీ భావిస్తే.. ఆ కేసును రాష్ట్ర కమిటీ నిర్ణయానికి పంపిస్తుంది. తుది నిర్ణయం అక్కడే జరుగుతుంది. రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలను జిల్లా కమిటీలు విధిగా అమలు చేయాలి.



* రాష్ట్ర కమిటీ తనంతట తానుగా దరఖాస్తులు, అనుమతులను తిరస్కరించవచ్చు. మార్పులతో ఆమోదించే ఉత్తర్వులేమైనా ఉంటే తగిన ఆధారాలతో నివేదికను ప్రభుత్వానికి పంపించాలి.



* కంపెనీల పెట్టుబడుల పరిమితిని బట్టి రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు వేటికి అనుమతులు జారీ చేయాలో ప్రభుత్వం నిర్దేశిస్తుంది.

* నోడల్ ఏజెన్సీలకు ఇచ్చిన స్వీయ ధ్రువీకరణలో పొందుపరిచిన షరతులు, రాతపూర్వక హామీలు పాటించడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విఫలమైతే ప్రభుత్వం వారికి జరిమానా విధిస్తుంది.



* అనుమతుల జారీలో జాప్యానికి కారణాలు, జరిమానా విధింపునకు కారణాలను ‘టీఎస్‌ఐపాస్ అనుమతుల హక్కు’ కింద దరఖాస్తుదారులు తెలుసుకోవచ్చు.



* ఈ ప్రక్రియలో దరఖాస్తుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి, ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ‘ఇబ్బందుల నివారణ యంత్రాంగా’న్ని ఏర్పాటు చేస్తుంది.



* ఏదైనా కంపెనీ అపరాధానికి పాల్పడితే కం పెనీతో పాటు దాని వ్యాపార నిర్వహణలో ఉన్న ప్రతి వ్యక్తి శిక్షార్హులవుతారు. తనకు తెలియకుం డా అపరాధం జరిగినట్లు రుజువు చేస్తేనే శిక్ష పడ దు. సంబంధిత కంపెనీల డెరైక్టర్, మేనేజర్, కార్యదర్శి లేదా ఇతర అధికారుల సమ్మతి లేదా నిర్లక్ష్యం లేదా వారి కనుసన్నల్లోనే అపరాధం జరిగినట్లు తేలితే వారందరూ శిక్షర్హులవుతారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top