30న అసెంబ్లీ, మండలి ప్రత్యేక భేటీ


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఈ నెల 30న ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి రాజ సదారాం గురువారం షెడ్యూల్‌ విడుదల చేశారు. షెడ్యూల్‌ వివరాలను గవర్నర్, ముఖ్యమంత్రుల ప్రిన్సిపల్‌ కార్యదర్శులతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు, సంబంధిత అధికారులకు పంపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు శాసనసభ(7వ సెషన్, మూడో సమావేశం), మధ్యాహ్నం 3 గంటలకు మండలి సమావేశం జరుగుతుందని అందులో పేర్కొన్నారు. సమావేశాలకు ముందు రోజు ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు స్పీకర్‌ మధుసూదనాచారి అధ్యక్షతన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరగనుంది.



ప్రత్యేక సమావేశంలో ఆమోదించే బిల్లులపై విపక్ష పార్టీల నేతలకు బీఏసీలో వివరించి వారి సహకారం కోరే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్‌లో శాసనసభ ఆమోదించిన భూసేకరణ బిల్లులో కేంద్రం సూచించిన సవరణలపై ప్రత్యేక సమావేశంలో చర్చించి మార్పులతో తిరిగి బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపనున్నారు.  దీంతోపాటే నకిలీ విత్తన నిరోధక బిల్లును కూడా శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న నకిలీ విత్తనాల విక్రయంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, దీనికోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురానున్నట్లు సీఎం ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశంలోనే ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top