‘టీఎస్-ఐపాస్’కు ఓకే

‘టీఎస్-ఐపాస్’కు ఓకే - Sakshi


బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ  

పారిశ్రామిక ప్రగతితోనే రాష్ట్ర అభివృద్ధి: సీఎం కేసీఆర్

అన్నిరకాల మౌలిక సౌకర్యాలు  వాటర్ గ్రిడ్ ద్వారా అందే నీటిలో 10 శాతం ఇస్తాం

అనుమతుల్లో జాప్యం నివారణకు నోడల్ ఏజెన్సీల ఏర్పాటు

విద్యుత్ కోసం ప్రత్యేక డిస్కం

బందర్ పోర్టును వాడుకునేందుకు అవకాశమివ్వాలని ఏపీని కోరుతాం

ఎన్నారైలను ఆహ్వానించి ‘ప్రవాసీ తెలంగాణ దివస్’ నిర్వహిస్తాం


 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని అమలుపర్చేందుకు ఉద్దేశించిన టీఎస్-ఐపాస్ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) చట్టం-2014 బిల్లును శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనసభలో మధ్యాహ్నం భోజన విరామం అనంతరం టీఎస్-ఐపాస్ బిల్లుపై చర్చకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అనుమతించారు. దీనిపై తొలుత సీఎం కేసీఆర్ లేచి.. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురావలసిన ఆవశ్యకతను సభ్యులకు వివరించి, బిల్లును ఆమోదించాల్సిందిగా కోరారు. ఈ బిల్లుకు సంబంధించి ప్రతిపక్షాలు పలు సూచనలు చేస్తూ... టీఎస్- ఐపాస్ చట్టం-2014 బిల్లును ఆమోదిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ సందర్భంగా సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుని, వాటిని కూడా బిల్లులో పొందుపరుస్తామని కేసీఆర్ చెప్పారు. బిల్లును ఆమోదించిన సభ్యులకు, ఆమోదింపజేసిన స్పీకర్‌కు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

 

పారిశ్రామిక ప్రగతితోనే అభివృద్ధి..

 పారిశ్రామిక ప్రగతితోనే అభివృద్ధి సాధ్యమని, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అనుకూలమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు భూమి, నీరు, విద్యుత్ అవసరమని.. వాటిని సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద ని చెప్పారు. రాష్ట్రంలో సాగుకు అనుకూలం కాని భూమి 30 లక్షల ఎకరాలకు పైగా ఉందని, అందులో ప్రస్తుతం 2.35 లక్షల ఎకరాల భూమి పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉందని సీఎం వెల్లడించారు. టీఎస్‌ఐఐసీ వద్ద 15 వేల ఎకరాల నుంచి 20 వేల ఎకరాల వరకు అభివృద్ధి చేసిన భూమి ఉందన్నారు. తెలంగాణకు నీటి సమస్య లేదని, ప్రతిపాదిత వాటర్ గ్రిడ్ ద్వారా వచ్చే నీటిలో 10 శాతం పరిశ్రమలకు కేటాయిస్తామని కేసీఆర్ తెలిపారు.

 

  విద్యుత్‌కు సంబంధించి రాష్ట్రంలో 800 నుంచి 1,200 మెగావాట్ల వరకు లోటు ఉన్నా... వచ్చే 10 మాసాల్లోనే అదనంగా 2వేల మెగావాట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సౌర విద్యుత్‌కు సంబంధించి టెండర్లను ఆహ్వానిం చామని, తద్వారా వెయ్యి మెగావాట్లు వస్తుం దని చెప్పారు. అలాగే ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎం తెలిపారు. అంగుల్ నుంచి పలాస లైన్ నిర్మాణం జరుగుతోందని, అలాగే డిచ్‌పల్లి నుంచి వార్ధా లైన్‌కు టెండర్లు పిలిచారని, మొత్తానికి రాబోయే రోజుల్లో 13 వేల మెగావాట్ల వరకు విద్యుత్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పీజీసీఐఎల్ ద్వారా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని హిం దుజా, కృష్ణపట్నం, ఆర్‌టీపీఎస్-3 ప్రాజెక్టుల ద్వారా 3వేల మెగావాట్లు, తెలంగాణలోని సింగరేణి, భూపాలపల్లి విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 2,100 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమైతే... రెండు రాష్ట్రాలు వాటాలు పంచుకుంటే సమస్యే అసలు ఉండదన్నారు.

 

 నూతన పారిశ్రామిక విధానం కోసం వార్షిక బడ్జెట్‌లో 1,165.7 కోట్లు కేటాయించామని, గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చింది రూ. 953 కోట్లేనని కేసీఆర్ తెలిపారు. ప్రోత్సాహకాలుగా ఉమ్మడి రాష్ట్రంలో రూ. 522.84కోట్లు కేటాయిస్తే... ఈసారి రూ. 834.74 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. విద్యుత్ సమస్య తీరిన వెంటనే పరిశ్రమలకు విద్యుత్ కోసం ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. సూరత్‌కు దీటుగా వరంగల్‌లో టెక్స్‌టైల్ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, లక్ష పవర్‌లూమ్‌లతో పరిశ్రమ స్థాపించి ఐదు లక్షలకు పెంచుతామని పేర్కొన్నారు. దేశ విదేశాల్లోని ఎన్నారైలను రాష్ట్రానికి ఆహ్వానించి ప్రవాసీ తెలంగాణ దివస్ నిర్వహించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ముం దుకు వచ్చే వారికి అనుమతుల విషయంలో అనవసర జాప్యాన్ని నివారించేందుకు నోడల్ ఏజెన్సీలు ఏర్పాటు చేస్తామని... వాటి ద్వారానే జిల్లా స్థాయిలో 30 రోజుల్లో మెగా ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయిలో 15 రోజుల్లో అనుమతి ఇప్పించే ఏర్పాటు చేస్తామని సీఎం పేర్కొన్నారు.

 

 దుర్వినియోగం కానీయొద్దు: కాంగ్రెస్

 రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితోనే ప్రజలకు ఉపాధి మెరుగవుతుందని కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పారిశ్రామిక విధానాలతో 9.8 సగటు తో ఆర్థిక వృద్ధి, 9.4సగటుతో పారిశ్రామిక వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. ఎస్సీలు నెలకొల్పే పరిశ్రమల్లో భాగస్వాములు కూడా ఎస్సీలే ఉండేలా నిబంధనలు విధించాలని సూచిం చారు. జానారెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమల కోసం దరఖాస్తు చేసిన 15 రోజుల్లో గా అనుమతులు ఇవ్వకుంటే.. ఇక అనుమతి వచ్చినట్లుగా 16వరోజు నుంచే పారిశ్రామికవేత్తలు భావిం చేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ పోర్టును రాష్ర్ట అవసరాల కోసం వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని ఆ రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.

 

 సమతుల్యత పాటించాలి: టీడీపీ

 నూతన పారిశ్రామిక విధానంలో సామాజిక సమతుల్యత పాటించాలని టీడీపీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య సూచించారు.పారిశ్రామిక జోన్లలో దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

 

 వచ్చే బడ్జెట్లో ఆమోదిద్దాం: బీజేపీ

 తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పారిశ్రామిక అభివృద్ధి ఎంతో కీలకం కానుందని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. పరిశ్రమల స్థాపనకు రాయితీలు, సబ్సిడీలు, పన్నులు వంటి ఆర్థిక అంశాలు, భూముల కేటాయింపు, విద్యుత్, రహదారులు వంటి  మౌలిక వసతుల కల్పనపై   దృష్టి సారించాలన్నారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో ఫిక్కీ, ఫ్యాప్సీ వంటి సంస్థల సూచనలు తీసుకోవాలన్నారు.

 

 గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలి: వైఎస్సార్‌సీపీ

 గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ నేత పాయం వెంకటేశ్వర్లు కోరారు. కాగా.. ఎంఐఎం తరఫున అహ్మద్ బలాల, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య బిల్లుకు తమ మద్దతు తెలిపారు.

 

 గీతారెడ్డి సింగిల్ లీడర్

 కేసీఆర్ ప్రశంస, సభలో నవ్వులు

 కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డిని గురువారం శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ‘గీతారెడ్డిగారు వెటరన్ లీడర్ అండ్ సింగిల్ లీడర్..’ అని పొగుడుతూ.. పారిశ్రామిక విధానంపై ఆమె సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తొలుత సభలో సీఎం పారిశ్రామిక విధానం గురించి వివరించిన తరువాత గీతారెడ్డి మాట్లాడుతూ బిల్లుపై పలు సందేహాలు వెలిబుచ్చారు. ‘సుదీర్ఘ కాలం పరిశ్రమల మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెపుతున్నా.

 

 జిల్లాల్లో 30 రోజుల్లో, రాష్ట్రస్థాయిలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఎలా సాధ్యమవుతాయి? గ్రామ సర్పంచ్ సంతకం పెట్టే దగ్గరి నుంచి నీరు, పీసీబీ, పర్యావరణ శాఖ అనుమతులు ఒక్కో అనుమతికే 20 నుంచి 30 రోజుల వరకు అధికారికంగా సమయం పడుతుంది..’ అన్నారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ .. ‘గీతారెడ్డి గారు వెటరన్ లీడర్ అండ్ సింగిల్ లీడర్ కూడా. మీరు ఇచ్చే సలహాలను తీసుకొని నిబంధనలను రూపొందిస్తాం..’ అని పేర్కొన్నారు. అనంతరం గీతారెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమల మంత్రిగా పనిచేసిన తనకు కొత్త పారిశ్రామిక విధానం బిల్లు సమయంలో సభలో ఉండే అవకాశం రావడం, బిల్లుపై మాట్లాడి సూచనలు చేయడం ఆనందంగా ఉందని చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top