టీఆర్‌ఎస్‌లోకి తీగల!

టీఆర్‌ఎస్‌లోకి తీగల! - Sakshi


ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో భేటీ.. బాబు బుజ్జగించినా మారని మనసు

కృష్ణారెడ్డి బాటలో మరికొందరు కూడా.. దసరా తర్వాత ముహూర్తం

తీగలకు హెచ్‌ఎండీఏ చైర్మన్ పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి హామీ




 హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహేశ్వరం శాసనసభ్యుడు, హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపుగా ఖరారైంది. దసరా తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అధికార పార్టీలో చేరనున్నట్లు సమాచారం. పార్టీలో చేరిన వెంటనే తీగలకు హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. పది రోజుల క్రితం సీఎంతో తీగల భేటీ కావడంతోనే పార్టీ మారుతున్నారన్న ప్రచారం మొదలైంది.


 


తీగలతోపాటు ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని వార్తలు వచ్చాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలందరినీ పిలిచి ముఖాముఖి చర్చలు జరిపారు. దీంతో కొంత స్తబ్ధత ఏర్పడింది. అయితే సోమవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్‌ను మరోసారి కలవడంతో కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారనే ప్రచారం తెరపైకొచ్చింది. దానికి అనుగుణంగానే తీగల కృష్ణారెడ్డి సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపారు.


 


దీంతో చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం మరోసారి తీగలను పిలిపించి మాట్లాడారు. పార్టీ మారే ఆలోచన మానుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. అయితే, నియోజకవర్గంలో కార్యకర్తల ఒత్తిడి తీవ్రంగా ఉందని, వారితో మాట్లాడి నిర్ణయం చెబుతానని బాబుకు చెప్పి వచ్చిన తీగల.. వెంటనే మీర్‌పేటలోని కేటీఆర్ కళాశాలలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మెజారిటీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా ఆయనకు సూచించినట్లు తెలిసింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితుల్లో భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా టీఆర్‌ఎస్‌లో చేరడమే మేలని వారు అభిప్రాయపడినట్టు సమాచారం.



ప్రకాశ్ గౌడ్, మంచిరెడ్డి, కృష్ణారావు?



సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరడం ఇక లాంఛనమే. ఆయన బాటలోనే తీగల కృష్ణారెడ్డి పయనిస్తుండగా, వీరికి మరో ముగ్గురు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు తోడయ్యే అవకాశం ఉంది. పదిరోజుల క్రితం బాబుతో సమావేశానికి హాజరు కాని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి) కూడా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), చల్లా ధర్మారెడ్డి (పరకాల) టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరిగినా.. ఈ విషయంలో స్తబ్ధత కొనసాగుతోంది.



కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం: తీగల



టీఆర్‌ఎస్‌లో చేరే విషయంలో మంతనాలు సాగుతున్న విషయాన్ని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, కార్యకర్తల మనోభీష్టం మేరకు నిర్ణయం ఉంటుందని చెప్పారు. మరోసారి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి తన నిర్ణయం వెల్లడిస్తానని పేర్కొన్నారు. చంద్రబాబుతో సమావేశమైనప్పుడు కూడా ఇదే విషయం చెప్పానని వెల్లడించారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top