అర్హుల గుర్తింపులో సాంకేతిక సమస్య

అర్హుల గుర్తింపులో సాంకేతిక సమస్య - Sakshi


 సాక్షి, రంగారెడ్డి జిల్లా: సామాజిక పింఛన్ల పథకం తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈనెల 8వతేదీ నుంచి అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తున్నామంటూ హడావుడిగా ‘ఆసరా’ పథకాన్ని ప్రారంభించిన సర్కారు ప్రస్తుతం నెమ్మదించింది. లబ్ధిదారుల అర్హతలో నెలకొన్న తీవ్ర అయోమయం కారణంగా.. ఒకట్రెండు రోజులు ఉరుకులు, పరుగులు పెట్టిన అధికారులు.. తాజాగా చేతులు ముడుచుకున్నారు. సాంకేతికంగా నెలకొన్న సమస్యను సాకుగా చూపుతున్న ఏకంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియనే నిలిపివేయడం గమనార్హం. దీంతో జిల్లావ్యాప్తంగా మండల కార్యాలయాల వద్ద లబ్ధిదారులు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.



 పంచింది 10వేల లోపే..!

 జిల్లాలో సామాజిక పింఛన్ల కోసం 3,69,118 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మొత్తంగా 2,37,443 మందిని ఆసరా పథకానికి అర్హులుగా నిర్ధారించారు. ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో వివరాల నమోదుకు ఉపక్రమించి.. ఇప్పటివరకు 2,05,940 మంది వివరాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేశారు.



ఎంట్రీ అనంతరం ఈ వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి లాగిన్ ఐడీలోని సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చి.. లబ్ధిదారులకు అర్హత కార్డులను ముద్రించి ఇవ్వాలి. కానీ డాటాఎంట్రీ ప్రక్రియలో తలెత్తిన సమస్యతో వేలాది మంది అర్హుల పేర్లు.. అనర్హులుగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆసరా అర్హులు అంశం మళ్లీ మొదటికొచ్చింది. అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైందనే విషయం చిక్కకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.



ఈనెల 8, 9 తేదీల్లో మండల కేంద్రాల్లో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఒక్కో మండలంలో గరిష్టంగా రెండు వందల మంది చొప్పున.. జిల్లా వ్యాప్తంగా 10వేలలోపు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పూర్తిస్థాయి అర్హుల జాబితా తేలకపోవడం.. సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏకంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియనే నిలిపివేశారు.



 సమన్వయ లోపంతోనే..

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమానికి సంబంధించి వివరాల నమోదు ప్రక్రియ అంతా ఎన్‌ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్) పర్యవేక్షించింది. తాజాగా సామాజిక పింఛన్లకు సంబంధించి అర్హుల డాటా ఎంట్రీ ప్రక్రియను టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేశారు. అయితే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు, దరఖాస్తులను పరిశీలించి అర్హులుగా తేల్చిన లబ్ధిదారుల వివరాలను సరిపోల్చి కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది.



ఈ క్రమంలో రెండు సాఫ్ట్‌వేర్లలో నిక్షిప్తం చేసిన వివరాలు సరిపోలక వేలాది పేర్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో యంత్రాంగంలో అయోమయం నెలకొంది. వాస్తవానికి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన సంస్థల మధ్య సమన్వం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని స్పష్టమవుతోంది.



 కొలిక్కి వచ్చేదెన్నడో..

 మరో 10రోజుల్లో నవంబర్ నెల ముగియనుంది. ఈలోపు అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడంలేదు. ముందుగా సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్యను పరిష్కరించిన తర్వాతే అర్హులపై స్పష్టత రానుంది. కానీ ఈ సమస్య ఇప్పట్లో కొలిక్కివచ్చే అవకాశంలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించాలంటే కనిష్టంగా నెలరోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే పింఛన్ల పంపిణీపై స్పష్టత వస్తుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top