టీచింగ్ ప్రాక్టీస్‌కే పెద్దపీట!

టీచింగ్ ప్రాక్టీస్‌కే పెద్దపీట!


డీఎడ్‌లో ఇక నుంచి ప్రథమ సంవత్సరంలోనూ టీచింగ్ ప్రాక్టీస్

 గ్రామీణ అధ్యయనం, ప్రజలతో మమేకానికి ప్రాధాన్యం

 రెండేళ్ల కోర్సులో టీచింగ్   {పాక్టీస్‌కు 550 మార్కులు

 ఈ ఏడాది నుంచే అమల్లోకి..


 

హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో టీచింగ్ ప్రాక్టీస్‌కు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల మేరకు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో భారీగా మార్పులు తీసుకువస్తోంది. ఇందులో భాగంగా ఇక నుంచి ఈ కోర్సులో ప్రథమ సంవత్సరంలోనూ స్కూల్ ఇంటర్న్‌షిప్, బోధన అభ్యాసం (టీచింగ్ ప్రాక్టీస్), బోధన అభ్యసనకు సంసిద్ధత, రికార్డుల విధానాన్ని ప్రవేశపెడుతోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి ఈ అంశాలకే 800 మార్కులను కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఇందులో ఒక్క టీచింగ్ ప్రాక్టీస్‌కే 550 మార్కులు ఉండేలా మార్పులు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి (జూలై నుంచి) అమల్లోకి తేనున్న ఈ మార్పులను ఇప్పటికే విద్యాశాఖ ఖరారు చేసింది. త్వరలోనే ప్రభుత్వ ఆమోదానికి పంపనుంది.

 

ప్రస్తుతం ఉన్న విధానం..



డీఎడ్‌లో ప్రస్తుతం ప్రథమ సంవత్సరంలో ఐదు పేపర్లు, ద్వితీయ సంవత్సరంలో పది పేపర్ల విధానం ఉంది.  అందులో ఒక్కో పేపరుకు 100 మార్కుల చొప్పున 1000 మార్కులు, రికార్డులకు 500 మార్కులు ఉంటాయి. ఇంటర్నల్స్‌కు, రికార్డులకు 500 కలిపి మొత్తంగా 2 వేల మార్కుల విధానం ఉంది. ఒక్కో సబ్జెక్టులో ఏడు పీరియడ్ల చొప్పున ఒక సబ్జెక్టులో 35 పీరియడ్ల టీచింగ్  ప్రాక్టీస్ ఉంది. ఇలా ఐదు సబ్జెక్టుల్లో మొత్తంగా 175 పీరియడ్ల టీచింగ్ ప్రాక్టీస్ విధానం ఉంది.



అమల్లోకి రానున్న ప్రధాన మార్పులు ఇవే..



  ప్రథమ సంవత్సరంలో 10 సబ్జెక్టులు, ద్వితీయ సంవత్సరంలో 10 సబ్జెక్టులు ఉంటాయి. మొత్తంగా డీఎడ్‌లో ఇక 2,600 మార్కుల విధానం ఉంటుంది.  ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో రాత పరీక్షలకు 1,800 మార్కులు (ఇందులో 16 సబ్జెక్టుల్లో ఒక్కో సబ్జెక్టుకు 60 మార్కులకు రాత పరీక్ష ఉండనుండగా, ఒక్కో సబ్జెక్టులో మిగతా 40 మార్కులు ఇంటర్నల్ ్సకు ఉంటాయి. మరో నాలుగు సబ్జెక్టుల్లో ఒక్కో దానికి 30 మార్కుల చొప్పున రాత పరీక్ష ఉంటుంది. ఒక్కో సబ్జెక్టులో మిగతా 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి) ఇవ్వనుంది. వీటికి అదనంగా స్కూల్ ఇంటర్న్‌షిప్, టీచింగ్ ప్రాక్టీస్, టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధత, రికార్డులకు 800 మార్కులు ఉంటాయి.

 

ప్రథమ సంవత్సరంలో...



ప్రథమ సంవత్సరంలో స్కూల్ ఇంటర్న్‌షిప్, టీచింగ్ ప్రాక్టీస్, టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధత, రికార్డులకు 350 మార్కులు ఉంటాయి. ఇందులో  స్కూల్ ఇంటర్న్‌షిప్, టీచింగ్ ప్రాక్టీస్‌కు 250 మార్కులు ఇవ్వనుండగా, రికార్డులు, టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధతకు 100 మార్కులు కేటాయిస్తారు. టీచింగ్ ప్రాక్టీస్‌కు సంసిద్ధతలో భాగంగా గ్రామీణ అధ్యయనం, వివిధ సంస్థల సందర్శన, పాఠశాల అభివృద్ధి, రికార్డులకు ఒక్కో అంశానికి 25 మార్కుల చొప్పున కేటాయిస్తారు.



ద్వితీయ సంవత్సరంలో..



 ద్వితీయ సంవత్సరంలో ఇంటర్నల్స్‌కు 450 మార్కులు ఉంటాయి. ఇందులో స్కూల్ ఇంటర్న్‌షిప్, టీచింగ్‌ప్రాక్టీస్‌కు 300 మార్కులు ఇవ్వనుండగా, రికార్డులు, టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధతకు 150 మార్కులు ఉంటాయి. టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధతలో భాగంగా ప్రజలతో మమేకం కావడం, విద్యాహక్కు చట్టం అమలు, చైల్డ్ స్టడీ తదితర అంశాలు ఉంటాయి.

 

డీఎడ్‌లో మార్కుల విధానమిదీ..



 సంవత్సరం     రాత పరీక్ష      ఇంటర్న్‌షిప్,       మొత్తం  టీచింగ్ ప్రాక్టీస్    

 ప్రథమ            900                350                     1,250

 ద్వితీయ         900                450                     1,350

 మొత్తం          1,800             800                      2,600

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top