బదిలీ చేయండి.. వెళ్లిపోతాం...


- సొంత ప్రాంతానికి బదిలీ కోరుతున్న 148 మంది ఏపీ టీచర్లు

- ఇప్పటికే పలుమార్లు మంత్రులను కలిసి వినతుల సమర్పణ

- స్పష్టత ఇవ్వని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు  

- మాటలతో సరిపెడుతున్న వైనం.. చేతలు శూన్యం

సాక్షి, రంగారెడ్డి జిల్లా:
‘మా రాష్ట్రానికి బదిలీ చేయండి.. వెంటనే వెళ్లిపోతాం’.. అంటూ తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత టీచర్లు వేడుకుంటున్నా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి. రాష్ట్ర విభజన జరగడంతో.. అప్పట్లో ఉన్న విద్యాశాఖ నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియతో సొంత జిల్లాకు వెళ్లే అవకాశం ఉండేది. ప్రస్తుతం రాష్ట్రం విడిపోవడంతో.. ఓపెన్ కేటగిరీలో జిల్లాలో నియమితులైన పలువురు టీచర్లు ఇక్కడే పనిచేస్తున్న వారు సొంత రాష్ట్రానికి బదిలీ అయ్యే అవకాశం లేదు.



‘స్థానిక’ అవకాశాలకు విఘాతం..

హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉండటం, మరోవైపు హైదరాబాద్‌లో స్థానిక సంస్థల పాఠశాలలు లేకపోవడంతో అంతర్ జిల్లా బదిలీల కింద వచ్చే వారంతా జిల్లానే ఎంచుకున్నారు. దాదాపు పదిహేనేళ్లుగా అంతర్ జిల్లా బదిలీల పరంపర కొనసాగింది. దీంతో జిల్లాలో స్థానికేతర టీచర్ల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు ఓపెన్ కేటగిరీ నియామకాల్లోనూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే అధికంగా ఉన్నారు.



దీంతో జిల్లాలో స్థానిక, స్థానికేతర నిష్పత్తిలో వ్యత్యాసం అధికమైంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయంటూ అటు విద్యార్థిసంఘాలు, ఇటు ఉపాధ్యాయ, రాజకీయ వర్గాలు ఆందోళన కార్యక్రమాలు సైతం చేపట్టాయి. అంతర్ జిల్లా బదిలీల నిలుపుదలతో పాటు నియామకాలన్నీ స్థానికులతోనే భర్తీ చేయాలనే డిమాండ్ తెరపైకి తెచ్చాయి.



అయితే ఇవన్నీ ఆచరణసాధ్యం కాలేదు. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన టీచర్లు స్వచ్ఛందంగా బదిలీ అయ్యేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా జిల్లాలో 148 మంది టీచర్లు సొంత ప్రాంతానికి బదిలీకి సుముఖత వ్యక్తం చేశారు. వీరంతా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారే. గత వారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని రెండు దఫాలుగా కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని కూడా కలిసి పరిస్థితిని వివరించారు.



బదిలీలపై స్పష్టత కరువు..

సొంత ప్రాంతాలకు స్వచ్ఛంద బదిలీ కోరుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఉపాధ్యాయులకు అక్కడినుంచి ఇప్పటివరకు స్పష్టత రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపితేనే పరిస్థితి కొలిక్కి వస్తుంది. అందుకు ప్రభుత్వ స్థాయిలో చర్చలు నిర్వహించాలి. కానీ ఈ అంశంపై ఇరు ప్రభుత్వాలు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం.



దాదాపు ఆర్నెల్లుగా ఆయా టీచర్లు ఈ విషయంపై స్పష్టత రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం స్వచ్ఛంద బదిలీలను ప్రభుత్వం ఆమోదిస్తే జిల్లాలో 148 టీచర్‌పోస్టులు ఖాళీ కానున్నాయి. వీటి భర్తీలో స్థానిక నిరుద్యోగులకే ఎక్కువ అవకాశం కలగనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top