ఉపాధ్యాయ నియామక పరీక్షకు సర్వంసిద్ధం


హైదరాబాద్: లక్షలాది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న టీచర్ నియామక పరీక్షలు (డీఎస్సీ-2014) మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 10,313 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చే శామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు. మంగళవారం ఆమె సాక్షి’తో మాట్లాడుతూ.. మాస్ కాపీయింగ్, హైటెక్ కాపీయింగ్ వంటి అక్రమాలను నిరోధించేందుకు ప్రశ్నపత్రాల పంపిణీలో జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాం.





సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా, గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయిస్తున్నాం. 10,313 పోస్టులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వీటిలో స్కూల్ అసిస్టెంటు (ఎస్‌ఏ-లాంగ్వేజ్, నాన్‌లాంగ్వేజ్) పోస్టులు 2,033, భాషా పండిత్ 1,026, పీఈటీ 197, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) 7,055, స్పెషల్ టీచర్లు పోస్టులు 2 ఉన్నాయి. వీటికోసం 4,20,713 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 61,489 మంది ఎస్జీటీలు, 56,497 మంది భాషాపండిత్‌లు, 8,878 మంది పీఈటీలు, 60,476 మంది ఎస్‌ఏ(లాంగ్వేజెస్), 2,33,362 మంది ఎస్‌ఏ(నాన్ లాంగ్వేజెస్)లున్నారు.





ఇప్పటికే 3,33,641 మంది హాల్‌టిక్కెట్లను ఆన్‌లైన్లో డౌన్‌లోడ్ చేసుకున్నారు. కొంతమంది దరఖాస్తులను ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేయడంలో ఫొటోలు సరిగా స్కాన్ చేయలేకపోయారు. వారికి ఫొటోలు అప్‌లోడ్ చేసుకొని మరోసారి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాం. అభ్యర్దులందరికీ ఎస్సెమ్మెస్‌ల ద్వారా సమాచారాన్ని పంపించాం. పరీక్షల నిర్వహణ కు ఇన్విజిలేటర్లుగా విద్యాశాఖేతర విభాగాల సిబ్బందిని నియమిస్తున్నాం.





ప్రశ్నపత్రాలను ఏబీసీడీ సెట్లుగా చేసి జంబ్లింగ్ విధానంలో పంపిణీ చేయిస్తున్నాం. భద్రత ఏర్పాట్లుపై పోలీసు అధికారులతో మాట్లాడాం. వైద్య సేవలకు ఏఎన్‌ఎంలను నియమిస్తున్నాం. మధ్యాహ్న పరీక్ష వేళలను రెండు గంటలకు బదులు మూడు గంటలకు మార్పు చేశాం. వేర్వేరు పోస్టులకు దరఖాస్తు చేసిన వారు రాతపరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ఈ మార్పు చేశాం. అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. సమయం దాటాక వచ్చే వారిని లోపలకు అనుమతించం’ అని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top