రేపు టెట్‌

రేపు టెట్‌


సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఆదివారం (23న) జరగనుంది. 1,574 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 3,67,912 మంది హాజరవనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపరు–1కు 1,11,647 మంది; మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు జరిగే పేపరు–2కు 2,56,265 మంది హాజరవుతారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.



టెట్‌ నిలుపుదలకు హైకోర్టు తిరస్కృతి

కంటెంట్‌ ఆధారంగా ప్రశ్నలివ్వడంలో తప్పులేదని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యా శాఖ నిర్వ హించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిలుపుదలకు ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించ బోయే వారికి టెట్‌లో సీనియర్‌ సెకండరీ స్కూల్‌ (ఇంటర్‌) కంటెంట్‌ ఆధారంగా ప్రశ్నలు ఇవ్వడం లో తప్పేముందని పిటిషనర్లను ప్రశ్నించింది.ఇటువంటి ప్రశ్నలు ఇవ్వడం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలకు విరుద్ధమేమీ కాదని వ్యాఖ్యానించింది. టెట్‌లో ఇంటర్‌ స్థాయి సిలబస్‌ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయంటూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫి కేషన్‌ను సవాలు చేస్తూ నల్లగొండకు చెందిన జి.సునీత, మరికొందరు వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు విచారణ జరిపారు.



పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ... ఇంటర్‌ స్థాయి ప్రశ్నలు ఇవ్వడం సరికాదని, దీనివల్ల టెట్‌లో అర్హత సాధించడం కష్టతరమవుతుందని తెలిపారు. కనుక టెట్‌ పరీక్షను నిలుపుదల చేస్తూ ఉత్తర్వు లివ్వాలని కోరారు. న్యాయమూర్తి ఇందుకు తిరస్కరించారు. సిలబస్‌ కంటెం ట్‌పై ఎన్‌సీటీఈలో పరిమితులు ఎక్కడున్నాయో చూపాలన్నారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు విషయ పరిజ్ఞానం నిమిత్తమే ప్రభుత్వం ఈ నోటిఫి కేషన్‌ జారీ చేసినట్లుందన్నారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే స్థాయిలో ఉపాధ్యాయులు ఉండాలన్న న్యాయమూర్తి, టెట్‌ నిలుపుదలకు నిరాకరించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.



గ్రూప్‌–1 ఇంటర్వ్యూల నిలిపివేతకు నో...

గ్రూప్‌–1 ఇంటర్వ్యూల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఉమ్మడి రాష్ట్రం లో జారీ చేసిన 2011 నోటిఫికేషన్‌ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ సాగుతుంటే సాంకేతిక కారణాలను చూపుతూ వాటిని నిలిపేయాలని కోరడం సరికాదని వ్యాఖ్యానించింది. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని మరో సారి స్పష్టం చేసింది. గ్రూప్‌–1 రాత పరీక్షల ఆధారంగా తయారు చేసిన తాత్కా లిక జాబితాలో లోపాలున్నాయని, అందువల్ల ఇంటర్వ్యూలను నిలిపేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ జరిపారు. 2011 నోటిఫికేషన్‌ ఆధారంగా ఇప్పుడు పోస్టుల భర్తీ ప్రక్రియ సాగుతోందని గుర్తు చేశారు. ఇప్పుడు సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆ ప్రక్రియను ఆపాలనడం సరికాదంటూ విచారణను వాయిదా వేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top