టీడీపీ నిరసన, రాస్తారోకో


 నల్లగొండ రూరల్ : తమ పార్టీ కార్యాలయానికి నిప్పుపెట్టిన టీఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్,  రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు టీడీపీ కార్యాలయానికి నిప్పుపెట్టడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం క్లాక్‌టవర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీఆర్‌ఎస్ నాయకులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరసన తెలియజేసుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందన్నారు.  ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడలేదన్నారు. పార్టీలకతీతంగా కలిసి వచ్చి టీఆర్‌ఎస్ నాయకులు చేసిన దాడిని ఖండించాలని విజ్ఞఫ్తి చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, బొల్లం మల్లయ్యయాదవ్, నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రజనికుమారీ ఎల్‌వి. యాదవ్ పిల్లి రామరాజులు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ నాయకుల దాడులను నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాస్తారోకో చేస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 

 బంద్‌ను జయప్రదం చేయాలి

 టీడీపీ కార్యాలయంపై టీఆర్‌ఎస్ నాయకులు చేసిన దాడికి నిరసనగా బుధవారం నిర్వహిస్తున్న జిల్లాబంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ కోరారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  దీపావళి పండగ సందర్భంగా బంద్‌లో ఆర్టీసీ బస్సులకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ కావాలనే టీఆర్‌ఎస్ నాయకులతో తమ పార్టీ కార్యాలయాలపైన దాడులు చేయిస్తున్నారని, జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి దాడులకు ఊసిగొల్పారని ఆరోపించారు. తాము తలుచుకుంటే టీఆర్‌ఎస్ జెండాలుండవని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ నాయకులు పార్టీ కార్యాలయంలో ఉన్న మాధవరెడ్డి విగ్రహాన్ని కూడా తగులబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top