రేవంత్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వండి


 స్పీకర్‌ను కోరిన టీడీపీ శాసనసభా పక్షం

 సాక్షి, హైదరాబాద్: టీడీపీ సభ్యుడు ఎ. రేవంత్‌రెడ్డికి శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించాలని ఆ పార్టీ శాసనసభా పక్షం స్పీకర్ మధుసూదనాచారికి విజ్ఞప్తి చేసింది. సభలో అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ ప్రతి సభ్యుడికీ రాజ్యాంగం కల్పించిందని, రేవంత్‌రెడ్డి మాట్లాడేందుకు ఉపక్రమించగానే అధికార పార్టీ సభ్యులు గొడవ చేయడం ఎంతవరకు సమంజసమని ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సండ్ర వెంకటవీరయ్య, జి. సాయన్న, వివేకానంద స్పీకర్‌ను కలసి ఆవేదన వ్యక్తం చేశారు.

 

 గురువారం బంజారాహిల్స్ సొసైటీ భూముల విషయమై సభలో చర్చ సందర్భంగా రేవంత్‌రెడ్డి మామకు సంబంధించిన స్థలంపైనా ప్రస్తావన వచ్చింది. అందుకు రేవంత్‌రెడ్డి తన వాదన వినిపించేందుకు లేవగానే టీఆర్‌ఎస్ సభ్యులు క్షమాపణ చెప్పాలంటూ గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో ఆవేశానికి గురైన రేవంత్ హెడ్‌సెట్‌ను నేలకేసి కొట్టి ఆందోళన చేయడంతో సభాపతి సభను వాయిదా వేశారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. సభలో సభ్యుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే స్పీకర్ రూలింగ్ ఇవ్వాలి, లేదంటే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మాత్రమే నిబంధనల్లో పొందుపరిచారే తప్ప క్షమాపణ చెప్పాలని ఎక్కడా లేదని ఆయనకు రూల్ పొజిషన్‌ను చూపించారు. కాగా, క్షమాపణ చెప్పేందుకు రేవంత్‌రెడ్డి నిరాకరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top