వెన్నుపోట్లు

వెన్నుపోట్లు - Sakshi


 


  •  గ్రేటర్ టీడీపీలో ముసలం

  •      సొంత పార్టీ నుంచే కుట్రలు

  •      అంతర్గత కుమ్ములాటలు

  •      ఓటమి భయంతో అభ్యర్థులు..


 సాక్షి, సిటీబ్యూరో: కుట్రలు.. కుమ్ములాటలు.. వెన్నుపోట్లు.. అసంతృప్తి.. అసమ్మతి.. వెరసి గ్రేటర్ టీడీపీలో ముసలం మొదలైంది. సిటీలో ఇప్పటికే చావుతప్పి కన్నులొట్టబోయినట్లున్న తెలుగుదేశంలో తాజా పరిణామాలు ఆ పార్టీ మనుగడకే ప్రమాదం కలిగించేలా ఉన్నాయి. క్యాడర్ ఉండి.. అంతో ఇంతో బలం ఉండి గెలిచేందుకు అవకాశమున్న నియోజకవర్గాల్లో కొన్నింటిని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా.. మిగిలిన స్థానాల్లోని టీడీపీ అభ్యర్థులకు సొంతపార్టీ నుంచే పెనుముప్పు పొంచి ఉంది.

 

 బీజేపీతో పొత్తు వల్ల తమకు సీట్లు రాకుండా పోయాయని కలత చెందుతున్న తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుంది. అసమ్మతి పెచ్చరిల్లుతోంది. పైకి కనిపించకపోయినప్పటికీ.. తమను కాదన్న వారికి తగిన గుణపాఠం చెప్పేం దుకు వారు పోలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.



కేవలం వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు తమను బలిపశువులను చేశారనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో ఉంది. వారి స్వార్థం వల్లే తమకు టికెట్లు రాకుండా బీజేపీకి కేటాయించారనే అభిప్రాయాలున్నాయి. మరోవైపు పోటీ చేస్తున్న సొంతపార్టీ అభ్యర్థులే ఒకరినొకరు ఓడించుకునేందుకు ఎత్తులు వేస్తూ వ్యూహాలు పన్నుతున్నారు.



గత (2009) అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన తలసాని శ్రీనివాస్‌యాదవ్, సనత్‌నగర్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఓడిపోయిన పద్మారావుల మధ్య స్నేహసంబంధాలున్నాయి. దీన్ని వినియోగించుకొని గెలిచేందుకుగాను వీరిద్దరూ ఈసారి నియోజకవర్గాలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు. పార్టీలో చేరినప్పటి నుంచీ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తూ వచ్చిన తల సాని.. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ చేతిలో అనూహ్యంగా ఓడిపోయారు.

 

డివిజన్ల మార్పుతో కొన్ని డివిజన్లు సనత్‌నగర్‌లో కలవడం కూడా ఇందుకు ఒక కారణం. సికింద్రాబాద్‌లో ఈసారీ అదే పరిస్థితి పునరావృతం కానుందని అనుమానించిన తలసాని సనత్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకుగాను ఆయన చేయని ప్రయత్నం లేదు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఇంకేముంది సనత్‌నగర్‌లో గెలిచేం దుకు ఆ నియోజకవర్గానికి చెందిన వారికే తెలుగుమహిళ, తెలుగుయువత అధ్యక్షుల పదవులు అప్పగించారు. జిల్లా అధ్యక్షుని హోదాను ఆ రకంగా వినియోగించుకున్నారు. కాగా గతంలో సనత్‌నగర్ నుంచి పోటీచేసిన పద్మారావుకు సనత్‌నగర్ నియోజకవర్గంలో తగినంత బలం ఉంది.

 

ఆ బలాన్ని తన కోసం వినియోగిస్తే.. సికింద్రాబాద్‌లో పద్మారావు గెలుపు కోసం తన సేనల్ని వినియోగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. పార్టీలోని కొందరికి ఈ విషయం తెలుసు. కేవలం తను గెలిచేందుకు తమ పార్టీకే చెందిన కూన వెంకటే శ్‌గౌడ్ విజయావకాశాలను దెబ్బతీసేందుకూ సిద్ధమయ్యారని వినికిడి. ఇది తలసాని వ్యూహం కాగా, సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్న కూన వెంకటేశ్ గౌడ్ సైతం ఈ వ్యూహాన్ని పసిగట్టి తన  ప్రతివ్యూహాల్లో తానున్నారు.



వాస్తవానికి సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన కూన వెంకటేశ్‌గౌడ్ ఎంతోకాలంగా అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. నియోజకవర్గంలో అనుచరులు, అనుయాయులను పెంచుకున్నారు. ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు ప్రణాళిక వేసుకున్న ఆయనకు ఆ సీటు దక్కకుండా చేయడంలో తల సాని విజయం సాధించారు.

 

సికింద్రాబాద్‌తో సంబంధం లేని తనకు ఆ నియోజకవర్గం టికెట్ రావడంతో కూన కష్టాల బాటలో నడుస్తున్నారు. దీనికి సొంతపార్టీ నేతల కుట్రలూ తోడవనున్నాయి. ఇదే పాచికను సనత్‌నగర్‌లోనూ వినియోగించాలనేది కూన యోచనగా ఉంది. సికింద్రాబాద్‌లో టీడీపీ శ్రేణులు తనకు సహకరించని పక్షంలో సనత్‌నగర్‌లోని తన అనుచరగణాన్ని వినియోగించుకొని తలసానికి ధీటుగా సహాయనిరాకరణ చేయాలన్నది ఆయన యోచన. సికింద్రాబాద్‌లో తాను ఓడితే సనత్‌నగర్‌లో తలసానిని ఓడించేందుకూ వెనుకాడరాదన్నది ఆయన వ్యూహంగా ఉంది.

 

సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఒక టీడీపీ కార్పొరేటర్ అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి మర్రిశశిధర్‌రెడ్డితో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారనే ప్రచారం ఉంది. సికింద్రాబాద్ నియోజకవర్గ టికెట్ ను తమకు కాకుండా స్థానికేతరునికిచ్చారని మథన పడుతున్న తెలుగు తమ్ముళ్లూ ఉన్నారు. వీరివల్ల కూడా టీడీపీ అభ్యర్థికి విపత్కర పరిస్థితి. ఇలా వైరి పక్షాల కంటే సొంత పార్టీ నుంచే టీడీపీకి శత్రుత్వం పొంచి ఉంది.  

 

 సర్వత్రా అసంతృప్తే...

జూబ్లీహిల్స్ నియోజకవర్గ టికెట్‌ను మాగంటి గోపీనాథ్ కు ఇవ్వడంతో ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చిన కార్పొరేటర్లలో మురళిగౌడ్ టీఆర్‌ఎస్ తీర్థంతో ఆ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. మరో కార్పొరేటర్ నేడో, రేపో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మరో కార్పొరేటర్ ముభావంగా ఉన్నప్పటికీ, పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చే పరిస్థితి లేదు.

 

ఎల్‌బీనగర్ నియోజకవర్గం నుంచి టికెట్‌ను ఆశించి అది దక్కకపోవడంతో తీవ్ర నిరాశానిట్టూర్పుల్లో ఉన్న నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ఎస్వీ కృష్ణప్రసాద్ ఎల్‌బీనగర్‌లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమానికే హాజరు కాలే దు. మరో నలుగురు కార్పొరేటర్లు సైతం చంద్రబాబు కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. పార్టీ శ్రేణుల్నీ తరలించలేదు. స్థానికేతరుడైన ఆర్ . కృష్ణయ్యను ఎల్‌బీనగర్ నుంచి పోటీకి దింపడంతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకూ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 

 ఆయా నియోజకవర్గాల్లో టికెట్లను ఆశించిన వారిలో కొందరు టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇలాంటి వారిలో ముషీరాబాద్ నుంచి ముఠాగోపాల్, గోషామహల్ నుంచి ప్రేంకుమార్ దూత్, జూబ్లీహిల్స్ నుంచి మురళిగౌడ్ తదితరులున్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్లనప్పటికీ.. తమను కాదని నిలబెట్టిన వారిని ఓడించడం ద్వారా తగిన గుణపాఠం చెప్పాలనే యోచనలో మరికొందరున్నారు. ఇలా సొంతపార్టీ నుంచే వెన్నుపోట్లు.. కుట్రలతో సతమతమవుతున్న దేశం పరిస్థితి ఏం కానుందో ఈ నెల 30 తర్వాత తేలనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top