బాబు పేరు చెప్పొద్దు

బాబు పేరు చెప్పొద్దు - Sakshi


రేవంత్‌కు బాబు దూతల హితవు



చంచల్‌గూడ జైలులో పయ్యావుల, ధూళిపాళ్ల ములాఖత్

బాబు సీఎంగా ఉంటేనే నీకు మేలు జరుగుతుందని ప్రబోధం

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందని సూచన

నేడు బాబుతో రేవంత్ సోదరుడి భేటీకి ఏర్పాటు

స్పష్టమైన హామీలు ఇప్పిస్తామని భరోసా


 

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు కొనుగోలు వ్యవహారంలో తన పేరు బయటకు రాకుండా ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వజూపి అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. ఏసీబీ విచారణలో ఎక్కడ వాస్తవాలు వెల్లడిస్తారోనని ఆయన భయపడుతున్నారు. దీంతో రేవంత్‌ను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తనకు    అత్యంత సన్నిహితులైన పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ వంటి వారిని మంగళవారం చంచల్‌గూడ జైలుకు పంపించారు. ములాఖత్‌లో భాగంగా రేవంత్‌ను కలిసిన నేతలు.. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడాలంటూ ఆయనకు సూచించారు. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉన్నందున నోరు జారవద్దని నచ్చజెప్పారు. చంద్రబాబు పేరు బయటకు వస్తే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని, అదే జరిగితే అసలుకే మోసం వస్తుందని వివరించారు.



చంద్రబాబు సీఎంగా ఉంటే అన్ని విధాలా సాయపడుతాడని, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రావని రేవంత్‌కు భరోసా ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారం టీడీపీకి ఇబ్బందిగా మారిందని, అందువల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందని కూడా సూచించారు. అయితే దీనికి రేవంత్ ససేమిరా అన్నారు. ఎమ్మెల్యే పదవికి తానెందుకు రాజీనామా చేయాలంటూ నిలదీసినట్లు సమాచారం. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న సూచనను రేవంత్ పట్టించుకోలేదని తెలిసింది. అయితే, చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీలు పొందేందుకు ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిని బుధవారం సమావేశపరుస్తామని బాబు దూతలు హామీ ఇచ్చారు.

 

రేవంత్ అరెస్ట్ కేసీఆర్ కుట్ర: ఎల్.రమణ

 సీఎం కేసీఆర్ పథకం ప్రకారమే కుట్ర చేసి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. జైలు ములాఖత్ సమయంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆపరేషన్ బ్లూస్టార్‌లో భాగంగా రేవంత్‌రెడ్డిని అక్రమంగా కేసులో ఇరికించారని ధ్వజమెత్తారు. 63 మంది ఎమ్మెల్యేలున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురిని నిలబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమ కేసులపై టీడీపీ న్యాయపోరాటం చేస్తుందన్నారు. కేసీఆర్ రాజకీయ కుట్రలను దీటుగా తిప్పికొడతామన్నారు. కాగా, పలువురు టీడీపీ నేతలు కూడా రేవంత్‌ను కలిశారు.

 

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top