పొసగని పొత్తు

పొసగని పొత్తు - Sakshi


 సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కుదేలైన స్థితి నుంచి తేరుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వేసిన పొత్తు పాచిక జిల్లాలో పారడం లేదు. బీజేపీతో మైత్రి టీడీపీకి కలిసొచ్చే దాఖలాలు కనిపించడం లేదు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంతో కొంత క్రెడిట్ దక్కించుకున్న కాషాయ దళానికి సైకిల్‌తో పొత్తు వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏమీలేదనే వాదనలు వినిపిస్తున్నారుు.

 

టీడీపీ, బీజేపీకి చెందిన జాతీయ, రాష్ట్రస్థారుు నేతలు ఇటీవలి వరకు పరస్పర విమర్శలు చేసుకున్నారు. తెలంగాణపై ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని కమలనాథులు... మతతత్వ పార్టీ అని ‘సైకిల్’ నాయకులు పరస్పరం ఒకరికొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వేళ పొత్తు పెట్టుకోవడంతో ఇరు పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు,  కార్యకర్తలకు రుచించలేదు. కలిసి నడిచేందుకు ఇరువురూ అరుుష్టత చూపుతున్నారు. టీడీపీతో పొత్తు వల్లే జిల్లాలో బీజేపీ బలహీనపడిందనే అభిప్రాయం కమల శ్రేణుల్లో ఉంది.

 

పదేళ్ల క్రితం వరకు ఉన్న పొత్తుతో ఇబ్బంది పడి... తెలంగాణ ఉద్యమంతో తెచ్చుకున్న పేరు ఆ పార్టీతో కలవడం వల్ల పోయిందని బాహాటంగానే వాపోయూరు. ఇదేక్రమంలో బీజేపీతో పొత్తు వల్ల మైనారిటీలు దూరమవుతున్నారని టీడీపీ అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు.. టీడీపీ అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో తమ్ముళ్లలో అసంతృప్తి నెలకొంది.

 

తాము పోటీ చేస్తే గెలిచే పరిస్థితులు లేకున్నా... బరిలో నిలిచే అవకాశం రాకపోవడం.. ఇది భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండడడం వారిని నైరాశ్యంలో ముంచింది. ఇలా... అపోహలు, అయోమయం, అనుమానాలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగడం ఇరు పార్టీలకు కలిసిరాకుండా పోరుుంది. పొత్తుతో మేలు జరుగుతుందనుకుంటే నష్టం జరిగే పరిస్థితి ఉందని అసెంబ్లీ, పార్లమెంట్ బరిలో ఉన్న ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు.

 

వరంగల్ లోక్‌సభ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన రామగల్ల పరమేశ్వర్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అరుుతే ఏడాది క్రితం నుంచి టీడీపీ తరఫున వరంగల్ ఎంపీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న దొమ్మాటి సాంబయ్యకు ఇక్కడ అవకాశం దక్కలేదు. దీంతో ఆయనకు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పరమేశ్వర్‌కు టీడీపీ శ్రేణులు... సాంబయ్యకు బీజేపీ శ్రేణుల నుంచి ఆశించిన మేర సహకారం అందడంలేదు.

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఇక్కడ టీడీపీ పోటీ చేయడమనేది అరుదుగానే జరిగింది. 1998,  2010 ఉప ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీడీపీ పోటీ చేసింది. పోటీ చేసే అవకాశం ఎప్పుడు రాకపోవడంతో ఇక్కడ ఆ పార్టీ  బలహీనంగా ఉంది. ఉన్న సైకిల్ శ్రేణులు సైతం బీజేపీతో దూరంగానే ఉంటున్నారుు. బీజేపీ అభ్యర్థి మార్తినేని ధర్మారావుతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వేం నరేందర్‌రెడ్డి కలిసి ప్రచారం చేసిన సందర్భాలు శూన్యం.

 

వరంగల్ తూర్పు నియోజకవర్గ స్థానాన్ని సైతం బీజేపీకే కేటాయించారు. జిల్లా కేంద్రంలో రెండు స్థానాలను ఇలా మిత్రపక్షానికి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు డీలా పడిపోయాయి. 2009 ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఇక్కడ టీడీపీకి అవకాశం రాలేదు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు బీజేపీ అభ్యర్థికి సహకరించడంలేదు. ఒకరిద్దరు ముఖ్య నేతలు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నా...  డివిజన్లలోని టీడీపీ నేతలు మాత్రం దూరంగానే ఉంటున్నారు.

 

 జనగామ అసెంబ్లీ స్థానాన్ని సైతం బీజేపీకే ఇ చ్చారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రె డ్డి ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పోటీ చేస్తున్న ఈ నియోజకర్గంలో టీడీపీ పోటీలో లేకపోవడంతో ఇక్కడ తమ్ముళ్లు గుంభనంగా ఉంటున్నారు. బీజేపీ అభ్యర్థికి గ్రామ స్థాయి లో నేతలు కలిసిరావడంలేదు. టీడీపీతో పొ త్తును విభేదించిన ఆ పార్టీ నేత మండలి శ్రీ రాములు మొదట స్వతంత్ర అభ్యర్థిగా బరి లో దిగారు. నామినేషన్ ఉపసంహరించుకుని రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరారు.

 

 భూపాలపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ గండ్ర సత్యనారాయణరావు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన నేత కావడంతో... బీజేపీలోని కింది స్థాయి నేతలు ఇంకా పూర్తి స్థాయిలో సహకరించడంలేదు. అభ్యర్థి టీడీపీ నుంచి వచ్చిన నాయకుడే కావడంతో... ఆ పార్టీ శ్రేణులు మాత్రం సహకరిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top