ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు


యాదగిరిగుట్ట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మూడు రోజుల పాటు జరగనున్న సీపీఐ జిల్లా 20 వ మహాసభలను ఆయన మంగళవారం పట్టణంలోని ఆ పార్టీ  కార్యాలయం ఆవరణలో ప్రారంభించారు. అనంతరం  జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్రం ఒంటెద్దు పోకడలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కష్టాల పాలుచేస్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, కార్మికుల శ్రేయస్సును కాలరాస్తోందన్నారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను అదుపు చేయలేక పోతోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం కూడా పెట్టుబడి దారుల కొమ్ముకాస్తోందని విమర్శించారు.

 

  ఇటీవలి ఢిల్లీ జరిగిన ఎన్నికల్లో ప్రధాని మోదీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. నల్లదనం విదేశాల నుంచి నల్లధనాన్ని స్వదేశానికి రప్పిస్తానని చేసిన ప్రకటనలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. లేనిపోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీఆర్‌ఎస్‌లు నేడు వాటిని మరచిపోయాయన్నారు.  ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే  దేశంలో మతసామరస్యం దెబ్బతింటోందని, మతతత్వ శక్తులు రెచ్చిపోతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం మతతత్వ శక్తులకు అండగా నిలుస్తూ , దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తోందన్నారు.  పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటర్‌రెడ్డి మాట్లాడుతూ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకు ప్రజలు, కార్మికులు, రైతులు సీపీఐకి సహకరించాలని కోరారు.

 

 దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ ర వీంద్రకుమార్ మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం  పేదలకు చేసిందేమీ లేదన్నారు. కేవలం ప్రకటనలు, ప్రచారంతో కేసీఆర్ ప్రభుత్వం కాలం గడుపుతోందని విమర్శించారు.  సభలో  మాజీ ఎమ్మెల్యేలు ఉజ్జిని యాదగిరిరావు, గుర్రం యాదగిరిరెడ్డి, మల్లేపల్లి ఆదిరెడ్డి,  గోద శ్రీరాములు, బొలగాని సత్యనారాయణ,కొల్లూరి రాజ య్య, జైని మల్లయ్య,   గడ్డమీది పాండరి, ఐలి సత్తయ్య, చెక్క వెంకటేశ్ ,బండి జంగమ్మ, రాములు, కొండల్‌రెడ్డి, సిద్దయ్య,పెంటయ్య, నాగయ్య  తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top