తెలంగాణలో టాటా కొత్త ప్రాజెక్టులు

తెలంగాణలో టాటా కొత్త ప్రాజెక్టులు


* ఆసక్తి చూపిన టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ

* మిస్త్రీని కలసిన మంత్రులు కేటీఆర్, జూపల్లి

* జూన్ 12న టీఎస్ ఐపాస్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం


 

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టాటా గ్రూపు కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపింది. తెలంగాణ రాష్ట్రానికి టాటాల హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ పేర్కొన్నారు. ముంబైలో బుధవారం సైరస్ మిస్త్రీతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో టాటా గ్రూపు చేపట్టేందుకు వీలున్న అనేక అవకాశాలను మిస్త్రీకి వివరించారు. ప్రభుత్వం జూన్ 12న లాంఛనంగా ప్రారంభించబోతున్న టీఎస్ ఐపాస్ కార్యక్రమానికి హాజరు కావాలని మిస్త్రీని ఆహ్వానించారు. టీఎస్ ఐపాస్ విధానంలో ఉన్న అనేక అంశాలను మంత్రులు వెల్లడించారు. ముఖ్యంగా పారిశ్రామిక వర్గాలు సెల్ఫ్ డిక్లరేషన్ విధానం ద్వారా అనుమతులు పొందేందుకు రూపొందించిన నిబంధనలు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అనుమతులు పొందే హక్కును కల్పించేలా ఏర్పాటుచేసిన పలు అంశాలను వారు మిస్త్రీకి వివరించారు.

 

 తమ ప్రభుత్వం గత ఏడాది కాలంలోనే చేపట్టిన అనేక కార్యక్రమాలను గురించి మంత్రి కేటీఆర్ మిస్త్రీకి వివరించారు. టీ హబ్, టాస్క్ కార్యక్రమాల్లో టాటా గ్రూపు భాగస్వామి కావాలని కోరారు. దీంతోపాటు తాము ఏర్పాటు చేయబోయే టీ హబ్ ఇన్నోవేషన్ ఫండ్‌లో టాటా కేపిటల్ భాగాస్వామ్యాన్ని కోరారు. వీటిపై మిస్త్రీ స్పందిస్తూ భవిష్యత్తులో చేపట్టబోయే నూతన ప్రాజెక్టులను తెలంగాణలో చేపట్టేందుకు ఆసక్తి కనబరిచారు. దీంతోపాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వ్యవస్థాపకులు కోహ్లి స్మారకార్థం హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో కొత్త బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top