అభివృద్ధే లక్ష్యం : మంత్రి తుమ్మల

అభివృద్ధే లక్ష్యం : మంత్రి తుమ్మల - Sakshi


- ‘సాక్షి’తో మంత్రి తుమ్మల

సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తానని రోడ్లు, భవనాలు, స్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

 

 ‘ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాను. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కృషి చేస్తాను. ఏ ప్రాంతం వారు ఏ ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని జిల్లా నలుమూలలా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాను. రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాను. జిల్లాలో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయడానికి తోడ్పడుతాను. జిల్లాలో అన్ని ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తాను. సూర్యాపేట-కాకినాడ వయా ఖమ్మం నాలుగు వరుసల రహదారుల నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తాం. ఖమ్మంలో రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం. భద్రాచలంలో నూతన బ్రిడ్జిల నిర్మాణంపై దృష్టి సారిస్తా. ఏజెన్సీ ప్రజలకు మరిన్ని రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం. పది సంవత్సరాలుగా జిల్లాలో నిలిచిపోయిన అభివృద్ధిని పునరుద్ధరిస్తా.

 

  ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా వేగవంతంగా పనిచేసేలా అప్రమత్తం చేస్తా. ముంపు మండలాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల హక్కులను పరిరక్షిస్తా. ఇందుకు ప్రభుత్వంతో స్వయంగా మాట్లాడుతా. రహదారులు, అభివృద్ధిపరంగా ఖమ్మాన్ని రాష్ట్రస్థాయిలోనే కాదు దేశస్థాయిలోనూ అగ్రగామిగా నిలుపుతా.   కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని వేగవంతం చేయిస్తా. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్‌ను అందించే అరుదైన అవకాశం ఖమ్మం జిల్లాకు రావడం జిల్లా వాసుల అదృష్టం. జిల్లాలో నిర్మించనున్న పవర్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయిస్తా. ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యం. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఊరుకోను’ అన్నారు.

 

18న జిల్లాకు రానున్న తుమ్మల

 రాష్ట్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల నాగేశ్వరరావు తొలిసారిగా 18వ తేదీన భద్రాచలం వస్తారు. ఆయన నేరుగా హెలీకాప్టర్‌లో భద్రాచలం చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుంటారు. భద్రాచలంలో నూతనంగా నిర్మించనున్న స్పెషల్ బ్రిడ్జికి మంత్రి హోదాలో తొలి శంకుస్థాపన చేస్తారు.  19న జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top