ఇది బోగస్‌ బడ్జెట్‌: తమ్మినేని

ఇది బోగస్‌ బడ్జెట్‌: తమ్మినేని - Sakshi


భూదాన్‌పోచంపల్లి/చౌటుప్పల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఒక బోగస్‌ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహాజన పాదయాత్రలో భాగంగా సోమవారం యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లి, చిన్నకొండూరులలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వాస్తవా నికి దూరంగా ఉందన్నారు. ఆదాయానికి మించిన బడ్జెట్‌ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎచ్చులకు పోయి ‘మా ఊరి మిర్యాలు తాటి గింజలంత లావు’ అన్న చందంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరు ఉందని ఎద్దేవా చేశారు. గత బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ.10 వేల కోట్లు కేటాయించగా, అందులో రూ.9,800 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు.



ఈసారి ఎస్సీల సంక్షేమానికి కేటాయించిన రూ.14,370 కోట్లు కేవలం వారిని జో కొట్టడానికేనని విమర్శించారు. పంట రుణమాఫీ కోసం కేవలం రూ. 4వేల కోట్లు పెట్టి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. కేరళ లాంటి రాష్ట్రంలో బడ్జెట్‌లో విద్య కోసం 30 శాతం కేటాయింపులు చేస్తూ సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్య కోసం కేటాయించిన రూ. 12 వేల కోట్లు కేటాయించడం ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. జనాభాలో 52శాతం ఉన్న బీసీలకు, జనాభా ప్రతిపాదికన రూ.75వేల కోట్లు కేటాయిస్తే సముచితంగా ఉండేదని, కానీ, కేవలం రూ. 5 వేల కోట్లు పెట్టి మోసం చేసిందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వం వెంట పడుతూనే ఉంటామని హెచ్చరించారు.



మేదర్లను ఆదుకోవాలి: సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడిన మేదరి కులస్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సీపీఎం కోరింది. వారిని ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలకు తగ్గకుండా రుణాలివ్వాలని సీఎం కేసీఆర్‌కు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. యువతకు వృత్తికి సంబంధించిన అధు నాతన పరికరాలను సమకూర్చాలని కోరారు. అర్హులైన పేద మేదరి కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని  కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top