సన్నాసులు దద్దమ్మలు అనక ఏమనాలి: తలసాని

సన్నాసులు దద్దమ్మలు అనక ఏమనాలి: తలసాని - Sakshi


హైదరాబాద్‌:

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాంగ్రెస్‌ నేతల గురించి మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్‌ నేతలు ఎందుకు టెన్షన్‌ పడుతున్నారో అర్ధం కావడం లేదు. రెండున్నరేళ్లలో చారిత్రాత్మక పథకాలు, కార్యక్రమాలు ప్రవేశ పెట్టాం. మేమిప్పుడు చేస్తున్నవి మీరెందుకు గతంలో చేయలేదు. 60 ఏళ్లలో చేయనిది మేము రెండున్నరేళ్లలో చేసి చూపించాం. మీ రాజ్యాలు సామ్రాజ్యాలు నడవడం లేదని మీకు భయమా. సమాజంలో బీసీలు 50 శాతం ఉన్నారు. వారి కోసం కేసీఆర్‌ గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందు వల్లే కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుంది. మీ హయాంలో బీసీలను అడుక్కుతినేందుకు పరిమితం చేశారు.



కాంగ్రెస్ నేతాల్లాంటి దిక్కుమాలిన ముఖాలకు కేసీఆర్ లాంటి అభివృద్ధి ఆలోచనలు వచ్చాయా. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్క సీటే గెలిచిన మిమ్మల్ని సన్నాసులు దద్దమ్మలు అనక ఏమనాలి? మా పద్దతిలో మేము పాలిస్తాం. మాకు ప్రజలే రిమోట్ కంట్రోల్‌. మీ రిమోట్ ఢిల్లీ లో ఉంది. కాంగ్రెస్లో నల్లగొండ జిల్లాల కుమ్ములాటలను మాపై రుద్దుతున్నారు. మీ భూస్వామ్య విధానాలకు మేము దూరం. తీర్థం పోసినట్టు అప్పుడప్పుడు కొన్ని పథకాలు అమలు చేయడం కాంగ్రెస్ కు అలవాటు. మేం అలా కాదు. ప్రజలకు అడుక్కునే అవకాశమివ్వం. తీర్థంలా కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి ముందే తీరుస్తున్నాం. నోరు ఉంది కదా అని కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించం. మాకు కూడా వంద నోర్లు ఉన్నాయి. మార్చి 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాలకు మంచిగా సిద్ధమై రండి' అని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top