ప్రాణం తీసిన పెద్ద మనుషుల తీర్పు


* చేయని అప్పును చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో మనస్తాపం

* కుమారుడికి అన్యాయం జరిగిందని తండ్రి ఆత్మహత్య


మొరిపిరాల(రాయపర్తి) : పెద్దమనుషుల తీర్పు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ మహిళ డబ్బులు ఇవ్వకున్నా.. ఇచ్చినట్లు ఓ వ్యక్తిపై పెద్దమనుషులకు ఫిర్యాదు చేయగా.. వారు ఎలాంటి ఆధారాలు చూడకుండానే సదరు వ్యక్తి డబ్బులు ఇవ్వాల్సిందేనని తీర్మానం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన అతడి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మొరిపిరాల గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.



ఎస్సై భరత్‌సుమన్ కథనం ప్రకారం... మొరిపిరాల గ్రామానికి చెందిన పెందోట సోమనాథం(55) కుమారుడు వెంకటేశ్వర్లు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో కొంతకాలం క్రితం వరకు సన్నిహితంగా ఉండేవాడు. వారికి ఇటీవల గొడవ జరగడంతో మాట్లాడుకోవడం లేదు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సదరు మహిళ వెంకటేశ్వర్లుకు రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చానని, పలుమార్లు అడిగినా ఇవ్వడం లేదని స్థానిక పెద్దమనుషులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు పంచాయితీ నిర్వహించి రూ.6 లక్షలు చెల్లించాలని తీర్మానం చేశారు.



తాము డబ్బులు తీసుకోలేదని, రూ.10 లక్షలు అప్పు ఇచ్చినట్లు గ్రామపెద్దలకు ఫిర్యాదు చేయడం సరైంది కాదని చెప్పినా పెద్దమనుషులు వినలేదు. అంతా అంతా ఒక్కటై కుటుంబంపై ఒత్తిడి తీసుకురావడంతో తీవ్ర మనోవేదనకు గురైన సోమనాథం శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటికి వెళ్లిన అతడి భార్య ఇంట్లోకి వచ్చి చూసేసరికి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 

పెద్దమనుషులపై కేసు..

తమ తీర్పుతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన పెద్దమనుషులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై భరత్‌సుమన్ తెలిపారు. పెద్దమనుషులు పి. సుధాకర్‌రెడ్డి, పి సత్యనారాయణ, సీహెచ్ వెంకటయ్య, నాగపురి అశోక్, వెంకటేశ్వర్లు, కడియం వెంకటయ్య, ఎన్. సోమయ్య, చెడుపాక వీరయ్య, కన్నెగంటి కృష్ణారెడ్డి, రాంధాన్, పి సోమిరెడ్డి, యాదయ్య, మోహన్‌రెడ్డి, సోమసత్యాచారి తదితర పెద్దమనుషులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top