వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ

వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ


* తెలంగాణలో 54 కేసులు నమోదు.. 8 మంది మృతి

* జిల్లాలకు మందుల సరఫరా

* స్వైన్‌ఫ్లూపై కేంద్రానికి నివేదిక

* చీటింగ్ చేస్తే సీజే: రాజయ్య



సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. గడచిన కొద్ది నెలలుగా 54 కేసులు నమోదయ్యాయి. సకాలంలో గుర్తించని కారణంగా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగురు గత రెండు రోజుల్లోనే మృతిచెందడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్వైన్‌ఫ్లూ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో వైద్య ఆరోగ్య యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్నారు.



గుండె, లివర్, కిడ్నీ వంటి వ్యాధులు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి త్వరగా వైరస్ సోకే ప్రమాదముందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారిలో ముగ్గురికి గుండె, షుగర్ వంటి వ్యాధులు ఉన్నాయని... వారికే స్వైన్‌ఫ్లూ సోకిందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చలికాలం కావడంతో వైరస్ సులువుగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని... రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకే ప్రమాదం ఉందని అంటున్నారు.



అందుబాటులో ‘వసాల్టిమీవిర్’ ఔషధం..

రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్ర, ఏరియా ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ మందులను అందుబాటులో ఉంచారు. అవసరాన్ని బట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా పంపాలని వైద్యాధికారులు ఆదేశాలు జారీచేశారు. స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తిస్తే ‘వసాల్టిమీవిర్’ ఔషధం వాడాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డెరైక్టర్ పి.సాంబశివరావు ‘సాక్షి’కి చెప్పారు. ఈ ఔషధం పెద్దలకు మాత్రల రూపంలో, పిల్లలకు చుక్కల రూపంలో అందుబాటులో ఉందన్నారు.



స్వైన్‌ఫ్లూ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారిస్తే ఈ ఔషధాన్ని వారం రోజులు వాడాల్సి ఉంటుందన్నారు. తలనొప్పి, ఒంటినొప్పులు, జలుబు, దగ్గు, జ్వరం ఉంటే అనుమానించి సమీపంలో ఉన్న ఆసుపత్రులకు వెళ్లి చూపించుకోవాలని ఆయన సూచించారు. ప్రధానంగా బలవర్థకమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రజలు ఏమాత్రం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని... మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.



స్వైన్‌ఫ్లూపై కేంద్రానికి నివేదిక..

స్వైన్‌ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి గురువారం నివేదిక సమర్పించింది. కొన్ని నెలలుగా రాష్ట్రంలో 54 కేసులు నమోదు అయ్యాయని, జిల్లాలకు అవసరమైన మందులను సరఫరా చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరునూ ప్రస్తావించారు.



చీటింగ్ చేస్తే సీజే..

డెంగీ, స్వైన్‌ఫ్లూ, ఎబోలా వ్యాధుల పేరుతో రోగులను చీటింగ్ చేసే ఆస్పత్రులను సీజ్ చేయిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య హెచ్చరించారు. ప్రమాదకరమైన వైరస్ సోకిన రోగి ఐసోలేషన్ వార్డులో ఉండకుండా బయట తిరగడంతో వైరస్ వ్యాప్తి చెందుతుందని, అటువంటి రోగులను గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన పర్యవేక్షణ బృందాల జాడే లేదని‘ సాక్షి’ ప్రచురించిన కథనానికి మంత్రి రాజయ్య స్పందించారు.



వ్యాధుల పేరుతో రోగులను చీటింగ్ చేస్తూ చికిత్సల పేరుతో రోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న ఆస్పత్రులపై విజిలెన్స్ దాడులు చేయించి వాటిని సీజ్ చేయిస్తామన్నారు. గాంధీ జనరల్ ఆసుపత్రిలోని స్వైన్‌ఫ్లూ వార్డును గురువారం ఆయన సందర్శించారు. డీఎంఈ పుట్టా శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ధైర్యవాన్, ఇతర వైద్య అధికారులతో స్వైన్‌ఫ్లూపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ఫీవర్ ఆసుపత్రిలో అధునాతనమైన ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top