స్వైన్ కేసులు@ 112


స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. వ్యాధి తీవ్రతను అరికట్టి గాడిలో పెట్టాలనుకున్న యంత్రాంగం ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మంగళవారం స్వైన్‌ఫ్లూ ప్రభావంతో జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఘట్‌కేసర్ మండలం నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏదులాబాద్‌కు చెందిన శైలజ, సరూర్‌నగర్ పీహెచ్‌సీ పరిధిలోని చంపాపేటకు చెందిన బ్రహ్మనాయుడు మంగళవారం గాంధీ ఆస్పత్రిలో మృతి చెం దారు. ఇదే రోజు మరో తొమ్మిది మందికి వ్యాధి సోకినట్లు  నివేదికలు రావడం అటు జిల్లా యంత్రాంగాన్ని, ఇటు సామాన్య ప్రజానికాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.



ఇప్పటివరకు 112 మందికి..

జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. రాజధాని చుట్టూ విస్తరించి ఉన్న నేపథ్యంలో జిల్లా నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య సైతం ఎక్కువ. ఇదే వ్యాప్తికి దోహదం చేస్తోందని అధికారులు చెబుతున్నారు. నగర శివారు మండలాల్లోనే వ్యాధి వ్యాప్తి ఎక్కువున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు సైతం చెబుతున్నాయి. జనవరి నెలలో ఇప్పటివరకు జిల్లాలో 112 మందికి ఈ వ్యాధి సోకినట్లు వైద్య శాఖ నిర్దారించింది. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నా.. మెజార్టీ బాధితుల పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు సమాచారం.



నలుగురు చిన్నారులకూ స్వైన్‌ఫ్లూ..

చిన్నా, పెద్దా తేడా లేకుండా స్వైన్‌ఫ్లూ వ్యాప్తిచెందుతోంది. మంగళవారం జిల్లాలో తొమ్మిది కేసులు నమోదు కాగా.. ఇందులో ఒకరు ఆరు నెలల చిన్నారి కాగా, మరొకరు ఏడు నెలల బాలుడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శేరిలింగంపల్లి మండలం మదీనగూడకు చెందిన ఆరు నెలల చిన్నారి, ఘట్‌కేసర్ మండలం నారపల్లికి చెందిన ఏడు నెలల బాలుడు నగరంలోని రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులు నగరంలోని లోటస్, రెయిన్‌బో ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. మిగతా ఐదుగురు నలభైఏళ్లకు పైబడినవారే.



మందులతో మమ అనిపిస్తూ..

జిల్లాలో ప్రజారోగ్యం తీవ్ర ఆందోళనకరంగా  ఉన్నప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ మాత్రం మందులు అందుబాటులో పెట్టామంటూ చేతులు దులిపేసుకుంటుంది. వ్యాధిపై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. జిల్లా వైద్య శాఖ మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు స్వైన్‌ఫ్లూ మాత్రలు పంపించాల్సి ఉండగా.. అధికారులు మాత్రం ఆ మందులను ప్రాంతీయ ఆస్పత్రులకే పరిమితం చేశారు. కొండాపూర్ ప్రాంతీయ ఆస్పత్రిలో 500 క్యాప్సుల్స్, 5 బాటిళ్ల సిరప్ అందుబాటులో ఉంచారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో 100 క్యాప్సుల్స్, 5 బాటిళ్ల సిరప్, వనస్థలిపురం ప్రాంతీయ ఆస్పత్రిలో 100 క్యాప్సుల్స్, 10 బాటిళ్ల సిరప్ అందుబాటులో ఉంచారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో 690 క్యాప్సుల్స్, 35 బాటిళ్ల సిరప్ నిల్వ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top