రాయికల్ ఎస్సై రాములునాయక్‌ సస్పెన్షన్

రాయికల్ ఎస్సై రాములునాయక్‌ సస్పెన్షన్


నిర్మల్ అర్బన్/నిర్మల్ రూరల్ : కరీంనగర్ జిల్లా రాయికల్ ఎస్సై రాములునాయక్‌పై వేటుపడింది. మిస్‌ఫైర్ ఘటనపై విచారణ పూర్తికావడంతో జిల్లా పోలీస్ అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. దీంతో శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఐజీ నుంచి ఆదేశాలు జారీ కాగా, కరీంనగర్ జిల్లా ఎస్పీ శివకుమార్ ఉత్తర్వులు వెలువరించారు.

 

సంచలనం కలిగించిన ‘మిస్‌ఫైర్’ ఘటన..


నిర్మల్ పట్టణంలోని మయూరి ఇన్ లాడ్జీలో ఆదివారం రాత్రి రాయికల్ ఎస్సై రాములునాయక్ సర్వీస్ రివాల్వర్ మిస్‌ఫైర్ ఘటన  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కరీంనగర్ జిల్లకు చెందిన ఎంఈవోలతో కలిసి కుంటాల జలపాతానికి వచ్చిన ఎస్సై విహారయాత్రను ముగించుకుని లాడ్జ్‌లో స్థానిక ప్రభుత్వ ఉద్యోగులతో విందులో పాల్గొన్నారు. విధినిర్వహణలో జాగ్రత్తగా ఉపయోగించాల్సిన సర్వీస్ రివాల్వర్ మిస్‌ఫైర్ అవడం ఆయన విధి నిర్వహణ నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలువడంతో శాఖాపరమైన వేటు తప్పలేదు. రెండు రౌండ్ల కాల్పులు జరగడాన్ని పోలీస్‌శాఖ సీరియస్‌గా పరిగణించింది. పోలీస్ అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్న క్రమంలోనే ఎస్సై ఇలాంటి ఘటనకు పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

 

ఐజీకి చేరిన నివేదికలు..

లాడ్జిలో జరిగిన మిస్‌ఫైర్ ఘటనపై జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ స్వయంగా పరిశీలించారు. విచారణ త్వరితగతిన పూర్తిచేసి నివేదికలు అందజేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణను వేగవంతం చేశారు. రివాల్వర్ పేలిన ఘటనకు బాధ్యుడైన ఎస్సై రాములు నాయక్‌పై కేసు నమోదుచేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అనుచితంగా ప్రవర్తించి ఒకరి గాయాలకు కారణమైనందున ఐపీసీ 337, 286 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.



లాడ్జిలోని 212 గదిలో స్నేహితులతో విందులో పాల్గొన్న ఎస్సై మద్యం మత్తులో రివాల్వర్ మిస్‌ఫైర్ జరగ డంపై రివాల్వర్ ఎలా పేలింది, ఎవరు పేల్చారు అనే కోణంలో దర్యాప్తు చే శారు. ఇందులో భాగంగా లాడ్జిలో ఆధారాలను సేకరించారు. లాడ్జి సిబ్బందిని, ఎస్సైతోపాటు గదిలో ఉన్న ఉద్యోగులను విచారించారు. అనంతరం నివేదికను ఎస్పీకి అందజేశారు. దీంతో ఎస్పీ నుంచి బుధవారం కేసుకు సంబంధించిన నివేదికలు ఐజీకి చేరాయి.

 

ఎస్సై రాములునాయక్ సస్పెన్షన్..

ఐజీకి చేరిన నివేదికలను పరిశీలించిన అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. అయితే దీపావళి పండుగ అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అందరూ భావించినా.. బుధవారం రాత్రే ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఐజీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాములునాయక్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. కరీంనగర్ ఎస్పీ శివకుమార్ సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top