సస్పెన్షన్ సరిపోదు


అశ్వారావుపేట: అవినీతికి పాల్పడిన అధికారులకు సస్పెన్షన్ పనిష్మెంట్ సరిపోవడం లేదనీ, చర్య చాలా తీవ్రంగా మరెవరూ అవినీతికి పాల్పడకుండా ఉండాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయిల్‌ఫెడ్ జాయింట్ డెరైక్టర్ అచ్యుతరావుకు మంత్రి సూచనలు చేశారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో అధికారుల దోపిడీకి రైతులు బలవుతున్నారన్నారు.



బుధవారం పామాయిల్ ఫ్యాక్టరీలో జరిగిన రైతుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గింజల ఎంపిక, పురుగు మందులు, ఎరువుల కొనుగోలులో రైతులు మోసపోతున్నారన్నారు. ఓసారి నిజామాబాద్ జిల్లాలోని చక్కెర కర్మాగారానికి రాత్రివేళ తాను ఆకస్మికంగా దుప్పటి కప్పుకుని వెళ్లి పరిశీలించగా ఓపైపు గుండా చెరుకురసం బయటకు పోవడాన్ని గుర్తించానన్నారు. ఇదేమిటని సిబ్బందిని ప్రశ్నిస్తే.. తనను గుర్తించకుండా లెక్కలేకుండా మాట్లాడారని.. ఆతర్వాత తెలుసుకుని ప్రథేయపడ్డారన్నారు. ఇదే విధంగా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ఓపైపు గుండా నూనెను బయటకు పంపేయడం జరిగిందంటే ఇక్కడ అధికారులకు ఎంత నిర్లక్ష్యమో.. ఎంత అవినీతికి అలవాటు పడ్డారో అర్థమవుతోందన్నారు.

 

కర్మాగారం ఓ వ్యాపార సంస్థ

కర్మాగారం అనేది ఓ వ్యాపార సంస్థ అని.. ప్రతి కర్మాగారానికి రైతే ముడి వస్తువును సమకూర్చాలన్నారు. ఇక్కడి పామాయిల్ రైతులు గెల లను సరఫరా చేస్తే.. అధికారులు క్రషింగ్ నిర్వహించి దేశానికి చమురును, రైతులకు లాభాలను అందిచాలన్నారు.  అశ్వారావుపేట ఆయి ల్ కర్మాగారం చాలా చిన్నదని, ఇక్కడ 20 శా తం ఆయిల్ రికవరీ తప్పకుండా రావాలని సూచించారు. తాను నాలుగు రోజులు కర్మాగారంలో కూర్చుంటే 20 శాతానికి పైగా రికవరీ సాధిస్తానన్నారు.  అశ్వారావుపేట ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీని ప్రక్షాళన చేసేందుకు ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడతానన్నారు. మహారాష్ట్రలోని చక్కెర ఫ్యాక్టరీని ఒక గంటలో క్లీనింగ్ చేస్తారని.. రోజుకు 8 వేల టన్నుల కెపాసిటీ గల ఫ్యాక్టరీని గంటలో క్లీనింగ్ చే స్తే అశ్వారావుపేట ఫ్యాక్టరీని ఎందుకు కావాలని నెలల తరబడి క్లీనింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు.



కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి: మంత్రి తుమ్మల

దేశంలోనే అత్యధికంగా పామాయిల్ సాగవుతున్న దమ్మపేట, అశ్వారావుపేట మండలాల రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పథకాలను అమలు చేసి ప్రోత్సహించాలని ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఏటా 4 వేల కోట్ల రూపాయలు తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు ఇప్పించాలని కోరారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దమ్మపేట మండలం అప్పారావుపేటలో రెండో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని.. అశ్వారావుపేట మండలానికి పాత ఫ్యాక్టరీ సరిపోతుందన్నారు. ఇలా దశల వారీగా మండలానికో పామాయిల్ ఫ్యాక్టరీ ఉండేలా కృషి చేస్తానన్నారు.

 

కూలీలను పర్మినెంట్ చేయాలి:ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

అశ్వారావుపేట పామాయిల్‌ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలను, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్‌చేయాలని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంత్రులను కోరారు.  బాధ్యతలు పెం చుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెంచితే మోసాలు అరికట్టవచ్చన్నారు. కాంట్రాక్టర్ల ప్రమేయం వల్ల అవినీతి అధికంగా జరుగుతుందన్నారు.



అనంతరం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి రైతు అంకత ఉమామహేశ్వరరావు పొలంలో పండిన 79  కిలోల గుమ్మడికాయను బహుమతిగా అందజేశారు.సమావేశంలో  డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, అశ్వారావుపేట ఎంపీపీ బరగడ కృష్ణారావు, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలా జడ్పీటీసీ సభ్యులు అంకత మల్లిఖార్జునరావు, దొడ్డాకుల సరోజిని, రైతులు ఆలపాటి రామచంద్రప్రసాద్, బండి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top