రంగారెడ్డి జిల్లా సారధి ఎవరు?

రంగారెడ్డి జిల్లా సారధి ఎవరు? - Sakshi


 డీసీసీ కూర్పుపై హైకమాండ్ తర్జనభర్జన

 కొత్త సారథి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్

 ఆశావహులందరికీ పీసీసీలో చోటు

 నాయకత్వలేమితో పార్టీ కార్యక్రమాలపై ప్రభావం




రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రంగారెడ్డి  జిల్లా కాంగ్రెస్ సారథి నియామకంపై ఊగిసలాట కొనసాగుతోంది. డీసీసీ పగ్గాలు అప్పగించే అంశంపై ఆ పార్టీ నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. పాతకాపుకే మళ్లీ పీఠం వేయాలనే సీనియర్ల సూచనను పరిగణనలోకి తీసుకోని హైకమాండ్.. కొత్త సారథిని కూడా ప్రకటించకుండా సస్పెన్స్ కొనసాగిస్తోంది. హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ డీసీసీ అధ్యక్ష పదవికి క్యామ మల్లేశ్ రాజీనామా చేశారు. అంతకుమునుపే గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్ రాజీనామా చేసిన నేపథ్యంలో మల్లేశ్ కూడా రాజీనామా చేయాలని అధినాయకత్వం ఒత్తిడి చేసింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన డీసీసీ కుర్చీని వదులుకున్నారు. అయితే రాజీనామాను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టింది. అదేసమయంలో ఆయన కొనసాగింపుపైనా స్పష్టతనివ్వలేదు.


ఈ క్రమంలోనే మల్లేశ్‌కు వ్యతిరేకంగా కొందరు నాయకులు పావులు కదిపారు. మరో వైపు రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా క్యామ కొనసాగింపును అయిష్టంగా ఉన్న విషయాన్ని పసిగట్టిన వైరివర్గం.. డీసీసీ పగ్గాలను మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్‌కు అప్పగించాలని ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసింది. ఈ ఎత్తుగడను అంచనా వేసిన మరోవర్గంమాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ పేరు ను తెరపైకి తెచ్చింది. సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటే.. పార్టీ భావజాలం తెలియని చంద్రశేఖర్ కన్న ప్రసాద్ మేలనే సూచించింది. సీనియర్ల అభిప్రాయబేధాలు.. హస్తిన స్థాయిలో ఇరువర్గాలు మంత్రాంగం నెరపడంతో ఇరకాటంలో పడ్డ హస్తం పార్టీ డీసీసీ సారథి నియామకాన్ని వాయిదా వేసింది.



 ఎవరినీ కాదని..!

 జిల్లా సారథి ఎంపికపై సీనియర్ల మధ్య అభిప్రాయబేధాలు పొడచూపిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్టీ పగ్గాలు ఆశించిన వారందరికీ పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించడం ద్వారా డీసీసీ రేసు నుంచి తప్పించింది. తద్వారా కొత్త నేతకు నాయకత్వం అప్పగిస్తామని సంకేతాలిచ్చింది. మాజీ మంత్రుల సబిత, ప్రసాద్, చంద్రశేఖర్, మల్లేశ్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ సహా అందరికి రాష్ట్ర కమిటీలో పదవులు కట్టబెట్టింది. ఈ పరిణామాలతో డీసీసీ కథ మొదటికొచ్చినట్లయింది. నెలరోజుల క్రితం పదవులను వడ్డించిన ఏఐసీసీ జిల్లా కమిటీ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది.


మల్లేశ్‌నే కొనసాగించాలనే సీనియర్ల వాదనను తోసిపుచ్చిన నాయకత్వం.. కొత్త సారథి ఎవరనే అంశంపై ఉత్కంఠను కొనసాగిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన కాంగ్రెస్‌కు జిల్లా అధ్యక్షుడు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటీవల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల వద్ద నిరసనలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అయితే, జిల్లాలో మాత్రం పరిగి మినహా మరెక్కడ నిరసన కార్యక్రమాలు జరగలేదు. మరోవైపు పార్టీ శ్రేణులు, దిగువ శ్రేణి నాయకుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని సొమ్ము చేసుకునే దిశగా అధికారపార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే చాలా మండలాల్లో క్రియాశీల నేతలకు ఎర వేయడం కాంగ్రెస్‌ను ఖాళీ చేయిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top