కాల్పుల బాధ్యులను సస్పెండ్ చేయాలి


పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వి.రఘునాధ్

చర్ల: చట్ట విరుద్ధంగా కాల్పులు జరిపి, దోశిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు కారం నర్సింహారావు మృతికి కారకులైన ఎస్సై, సీఐ, ఏఎస్పీ, సీఆర్‌పీఎఫ్ డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయూలని, వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయూలని, ఈ ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ర్ట సంయుక్త కార్యదర్శి వి.రఘునాధ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దోశిళ్లపల్లి గ్రామాన్ని శనివారం పౌర హక్కుల సంఘం ప్రతినిధులు సందర్శించారు.



నరసింహారావు భార్య సుశీల, కాల్పుల నుంచి ప్రాణాలతో బయటపడిన కనితి సత్తిబాబుతోపాటు స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, చర్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో కారం నర్సింహారావు మృతిచెందాడంటూ కట్టుకథలు అల్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోనే మృతదేహానికి పోస్ట్‌మార్టం జరపకుండా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చేయించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. కాల్పుల ఘటనపై ఐపీసీ 301, 201 సెక్షన్ల కింద కాకుండా కేవలం ఐపీసీ 147, 148, 307 సెక్షన్లతోనే కేసు నమోదు చేసి సరిపెట్టుకున్నారని విమర్శించారు.



దీనినిబట్టి, ఈ కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమవుతోందన్నారు. దీనిని ప్రశ్నించిన విలేకరులతో... ‘విలేకరులే కాల్చి చంపారు’ అంటూ కొత్తగూడేనికి చెందిన ఆర్‌ఎస్‌ఐ శ్రీధర్  దురహంకారంగా మాట్లాడారని అన్నారు. దీనిని సుమోటోగా స్వీకరించి, ఆర్‌ఎస్‌ఐపై కూడా కేసు నమోదు చేయాలని మానవ హక్కుల సంఘాన్ని కోరారు. ఏజెన్సీలో గ్రీన్ హంట్ ఆపరేషన్‌నునిలిపివేయాలని, అమాయక ఆదివాసీలపై బైండోవర్ కేసులకు స్వస్తి చెప్పాలని ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. కాల్పుల ఘటనపై స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలతోపాటు హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కాల్పుల ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, హైకోర్టులో పిటిషన్ వేస్తామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.తిరుమలరావు, జిల్లా అధ్యక్షుడు కె.రవి, కార్యదర్శి పి.విప్లవ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు ఉన్నారు.

 

పోలీసుల దమనకాండకు నిదర్శనం

జిల్లాలో పోలీసుల దమనకాండకు దోశిళ్లపల్లి కాల్పుల ఘటనే నిదర్శనమని మావోయిస్టు పార్టీ వెంకటాపురం ఏరియా కార్యదర్శి సునీత పేర్కొన్నారు. ఈ కాల్పులకు బాధ్యులైన ఎస్సై మొదలు ఎస్పీ వరకు అందరినీ వెంటనే సస్పెండ్ చేయాలంటూ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేయాలని కోరారు. ఈ మేరకు, ఆమె పేరిట శనివారం రాత్రి పత్రికలకు లేఖలు అందాయి. కాల్పుల ఘటనను కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాల్పుల ఘటనకు బాధులైన చర్ల ఎస్సై సంతోష్,  వెంటాపురం సీఐ అల్లం నరేందర్, భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఎస్పీ  షానవాజ్ ఖాసింను సస్పెండ్ చేయాలంటూ పార్టీలు, ప్రజలు డిమాండ్ చేయాలని ఆమె కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top