వేటు


21మంది నీలగిరి మున్సిపల్ సిబ్బంది సస్పెన్షన్

 

ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ పరిపాలన శాఖ

వేటు పడిన వారిలో ఓ రెవెన్యూ ఆఫీసర్, నలుగురు

ఆర్‌ఐలు, 16 మంది బిల్ కలెక్టర్లు

రూ.3.32 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు గుర్తింపు

విజిలెన్స్ విచారణకూ ఆదేశం

పురపాలన అక్రమాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’

 

 నల్లగొండ టూటౌన్ : నల్లగొండ మున్సిపాలిటీలో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అక్రమార్కులపై సర్కార్ కొరడా ఝుళిపించింది. 2011 సంవత్సరంలో ప్రత్యేకాధికారుల పాలన నుంచి 2015 మార్చి నెలాఖరు వరకు ఆస్తిపన్నును ఇష్టారాజ్యంగా స్వాహా చేసిన 21 మంది ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు.  ఇందులో ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తోపాటు నలుగురు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, 16 మంది బిల్‌కలెక్టర్‌లున్నారు.



కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగంలో వీరి ప్రమేయాన్ని నిర్ధారిస్తూ వీరిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పురపాలక శాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ జనార్దనరెడ్డి ఆర్‌వోసీ నెం:4599/2015/సీ1 పేరుతో ఈనెల 31న జారీ చేసిన ఉత్తర్వులు మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి అందాయి.  నాలుగు సంవత్సరాల్లో మొత్తం మీద రూ.3.32 కోట్ల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డందుకు గాను వీరిని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆడిట్, స్పెషల్ ఆడిట్ విచారణలు జరిగిన ఈ వ్యవహారంపై మరోమారు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



 అసలేం జరిగింది....

 మున్సిపాలిటీ ఖాతాలో జమచేయాల్సిన ఆస్తిపన్ను, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ఫీజులపై మున్సిపల్ సిబ్బంది కన్నుపడడం ఈ కుంభకోణానికి మూలమైంది. 2011 నుంచి ఈ రెండు విభాగాల్లో వచ్చిన సొమ్మును మున్సిపల్ అకౌంట్‌లో జమ చేయకుండా స్వంత అవసరాలకు వాడుకుంటూ, స్వంత ఖాతాలకు మళ్లించుకున్నారు. ఈ మొత్తం రూ. 3,32,59,133 ఉందని విచారణలో తేలింది. మున్సిపల్ కమిషనర్ ఖాతాలో జమ చేయాల్సిన డబ్బులను ఎంచక్కా పక్కదారి పట్టించి సొంత ఆస్తులను పెంచుకున్న తమకేమీ తెలియనట్టు ఆస్తిపన్ను రశీదు పుస్తకాలను కూడా మాయం చేశారు.



కంప్యూటర్‌లలో నమోదు చేయాల్సిన వివరాలను కూడా తప్పుదోవ పట్టించారు. ఇద్దరు ఉద్యోగులైతే మున్సిపాలిటీకి వచ్చిన సొమ్ము, నల్లా బిల్లులు, భవన నిర్మాణ ఫీజులను ఎత్తుకెళ్లారు. వీరిని ఇప్పటికే సస్పెండ్ చేసి రూ.16లక్షలు రికవరీ కూడా చేశారు. భవన నిర్మాణ ఫీజులు, ఆస్తిపన్నులకు సంబంధించిన రశీదులు కూడా ఇవ్వకుండా జేబులో వేసుకున్నారు. ఏజీ ఆడిట్ బృందం గత ఫిబ్రవరి నెలలో చేపట్టిన ఆడిట్‌లో కొన్ని  అక్రమాలు వెలుగు చూశాయి. జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పెషల్ ఆడిట్, ఏజీ ఆడిట్ చేయించారు.



అదే విదంగా జిల్లా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సైతం ఈ అవినీతి అక్రమాలపై విచారించారు. 2011 నుంచి ఇక్కడ పని చేసిన 21 మంది ఉద్యోగులకు అవినీతి అక్రమాలలో భాగస్వామ్యంతో ఉందని తేలడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్వో, యూడీఆర్‌ఐ, ముగ్గురు రెవెన్యూ ఇన్‌స్పెక్లర్లు, 16 మంది బిల్ కలెక్టర్లు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. కాగా వీరిలో ఇక్కడ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసిన వహిద్ ప్రస్తుతం సూర్యాపేటలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.



అదే విధంగా నల్లగొండలో బిల్ కలెక్టర్‌గా పనిచేసిన గులాం ఖాదర్ ఖాన్ జూనియర్ అసిస్టెంట్ పదోన్నతితో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నారు. ఎ.సత్యనారాయణ, కె.హన్‌మాన్ ప్రసాద్ మిర్యాలగూడ, పి.భిక్షం సూర్యాపేట మున్సిపాలిటీలలో బిల్ కలెక్టర్‌లుగా పనిచేస్తున్నారు. మిగతా వారంతా ప్రస్తుతం నల్లగొండ మున్సిపాలిటీలోనే పని చేస్తున్నారు. అవినీతికి పాల్పడి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన మున్సిపల్ ఉద్యోగులపై అనేక విచారణల అనంతరం వేటు వేశారు. వీరందరినీ తక్షణమే విధుల నుంచి తొలగించి వారి స్థానంలో ఇతరులను నియమించాలని డీఎంఏ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  



 అక్రమాలపై ‘సాక్షి’ వరుస కథనాలు

 మున్సిపాలిటీలో జరిగిన కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై మొట్టమొదట ‘‘సాక్షి’’ కథనం ప్రచురించింది. మసిపూసి మారేడు కాయ చేయాలనుకుంటున్న వారి లీలలను వెలుగులోనికి తెచ్చింది. అయినా పాలక వర్గం గానీ, మున్సిపల్ అధికారులు గానీ స్పందించకపోవడంతో వరుస కథనాలు ప్రచురించింది. మొట్టమొదట ఏప్రిల్ 9వ తేదీన ‘‘దొంగలు పడ్డారు..?’’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. అదే విధంగా ఏప్రిల్ 18వ తేదీన ‘‘మహా మాయ’’, 21వ తేదీన ‘‘అంతర్యమేమిటి’’..?, 22వ తేదీన ‘నీలగిరి’ అక్రమాలపై సీబీఐ, మే 4వ తేదీన ‘‘అక్రమార్కుల్లో ఆడిట్ వణుకు’’ అనే వరుస కథనాలు ప్రారంభించడంతో ఆడిట్ బృందాలు సమగ్రంగా ఆడిట్ చేసి అవినీతి, అక్రమాలను తెల్చి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీంతో అక్రమార్కుల పాపం పండి సస్పెన్షన్‌కు గురయ్యారు.

 

 సస్పెన్షన్‌కు గురైన మున్సిపల్ ఉద్యోగులు వీరే...

 1.    గులాం ఖాదర్ ఖాన్, బిల్ కలెక్టర్

 2.    ఎ.సత్యనారాయణ, బిల్ కలెక్టర్

 3.    జె.రాజేంద్రచారి, బిల్ కలెక్టర్

 4.    కె.హనుమాన్ ప్రసాద్, బిల్ కలెక్టర్

 5.    ఎస్.శశిధర్, బిల్ కలెక్టర్

 6.    కె.యాదయ్య, బిల్ కలెక్టర్

 7.    సిహెచ్.ఈశ్వర్, బిల్ కలెక్టర్ (ఐ.సీ)

 8.    కె.యల్లయ్య, బిల్ కలెక్టర్

 9.    పి.భిక్షం, బిల్ కలెక్టర్

 10.    ఎం.రాజేందర్, బిల్ కలెక్టర్

 11.    కె.ప్రవీణ్‌కుమార్, బిల్ కలెక్టర్ (ఐ.సీ)

 12.    కె.పృధ్వీరాజ్, బిల్ కలెక్టర్ (ఐ.సీ)

 13.    ఎం.భానుకుమార్‌రెడ్డి, బిల్ కలెక్టర్ (ఐ.సీ)

 14.    వి.జగన్నాధం, బిల్ కలెక్టర్

 15.    కె.సైదులు, బిల్ కలెక్టర్

 16.    వై.సైదులు, బిల్ కలెక్టర్

 17.    ఎంఏ, వహీద్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

 18.    ఎన్.శంకరయ్య, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

 19.    పి.మాధవరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

 20.    సిహెచ్.శ్రావణి, యూడీఆర్‌ఐ

 21.    పి.రాంచంద్రారెడ్డి, రెవెన్యూ ఆఫీసర్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top