కేసీఆర్‌ స్కోరు 98, హరీష్‌ స్కోరు?

కేసీఆర్‌ స్కోరు 98, హరీష్‌ స్కోరు? - Sakshi


హైదరాబాద్‌: 2019 ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీకే అధికారం ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని ఆయన తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు.


మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 111 సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని సర్వేలో తేలిందని కేసీఆర్‌ వెల్లడించారు. మిగతా స్థానాల్లో రెండు కాంగ్రెస్‌కు, ఆరు ఎంఐఎం దక్కించుకుంటుందని వివరించారు. కాంగ్రెస్‌ గెలుచుకునే రెండు స్థానాలు ఖమ్మం జిల్లా మధిరతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి అని వెల్లడించారు. ఎంఐఎం గెలుచుకునే నియోజకవర్గాలన్నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనివని తెలిపారు.



త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉంటామని ప్రకటించారు. అలాగే, పనితీరు ఆధారంగా సీఎం కేసీఆర్‌ స్కోరు 98 శాతం, ఐటీశాఖ, మున్సిపల్‌ వ్యవహారాల శాఖమంత్రి కేటీఆర్‌ 91శాతం సాధించగా, భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావుకు 88 శాతం వచ్చింది.



అదేవిధంగా పార్టీ పరంగా, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వేర్వేరుగా జరిపిన సర్వేలో మరోరకమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. దీని ప్రకారం పార్టీ పనితీరు కంటే వ్యక్తిగతంగా చూస్తే రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మొదటి స్థానంలో నిలిచారు.



అలాగే పార్టీ పరంగా చూస్తే మంథని ఎమ్మెల్యే పుట్టా మధు ప్రథమంగా నిలిచారు. ఈ ఫలితాల వివరాలను ముఖ్యమంత్రి...ఎమ్మెల్యేలకు అందజేశారు. కష్టపడితే  గెలుపు టీఆర్‌ఎస్‌దేనని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండని ఆయన ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను కోరారు. పది రోజులకోసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని, చర్చించుకోవాలని అలా చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో నరేంద్ర మోదీ హవా అడ్డుకోవచ్చని కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top