నిఘా నేత్రం


  • నగరంలో 50 వేల సీసీ కెమెరాలు

  • సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నేరాలు నిరోధించే దిశగా జీహెచ్‌ఎంసీ మరో అడుగు ముందుకేస్తోంది. గ్రేటర్‌లోని వివిధ మార్గాల్లో రాబోయే వంద రోజుల్లో 50 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక ను జీహెచ్‌సీ స్టాండింగ్ కమిటీ ఆమోదానికి పంపించనున్నారు. అనంతరం రెండు వారాల్లోగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు.



    దీనికి సుమారు రూ.400- 450 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. తొలిదశలో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రధాన రహదారులు, మెట్రో రైలు మార్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ అంశంపై  జీహెచ్‌ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్, కమిషనర్ సోమేశ్‌కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిలు గురువారం సమావేశమయ్యారు.



    అనంతరం విలేకరులతో మేయర్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ మొత్తం వంద రోజుల్లో పూర్తి కాగలదని చెప్పారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో తొలుత వీటిని ఏర్పాటు చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులకు సూచించారు. తద్వారా నేరాలు తగ్గించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రజాభద్రత బాధ్యత మొత్తం పోలీసులదే కాదని, అన్ని విభాగాల సహాయ సహకారాలు అవసరమని గుర్తు చేశారు. ప్రజాభద్రత చట్టం వల్ల నేరాలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడ్డారు.



    వీలైనంత త్వరగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అందుకు కార్పొరేటర్ల పూర్తి సహకారం ఉంటుందని అధికారులకు చెప్పారు. హైదరాబాద్ గ్లోబల్‌సిటీగా మారే తరుణంలో ప్రజలకు భద్రత కల్పించడం అత్యావశ్యకమన్నారు. సీసీకెమెరాల ప్రాజెక్టుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ మాజిద్‌హుస్సేన్ ప్రకటించారు. భారీ స్థాయిలో వీటిని ఏర్పాటు చేయనుండటం దేశంలో ప్రప్రథమమన్నారు. తొలుత వంద పోలీస్ స్టేషన్ల పరిధిలో, అనంతరం జోన్ల వారీగా వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.



    జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ షాపులు, దుకాణదారులు తమ సంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయాల్సి ఉందన్నారు. ఈ అంశాన్ని ప్రజాభద్రత చట్టంలో పొందుపరిచేం దుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండే భవనాలు, అపార్ట్‌మెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా గట్టిగా చెబుతున్నామన్నారు.



    నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, సీసీ కెమెరాలతో తమకు భద్రత ఉందని ఓ వైపు  ప్రజలకు విశ్వాసం కల్పించడంతో పాటు మరోవైపు నేరాల తీరును తెలుసుకునేందుకు, నిరోధించేం దుకు పోలీసులకు అవకాశం ఉంటుందన్నారు. కెమెరాల ఆధారంగా త్వరితంగా విచారణ జరిపేందుకు వీలవుతుంద ని చెప్పారు. ఇవి మూడో నేత్రాల్లాంటివని, తద్వారా సంఘ విద్రోహులు, దొంగలు నేరాలు చేసేందుకు భయపడతారన్నారు. సీసీ కెమెరాలను జీహెచ్‌ఎంసీ, జలమండలి, ట్రాన్స్‌కో, జెన్‌కోలతోనూ అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top