నేను ఎవరి బిడ్డని!

నేను ఎవరి బిడ్డని!


మలుపు తిరిగిన సరోగసీ అమ్మ వివాదం

ఆ బిడ్డ మా బిడ్డ కాదంటున్న గుంటూరు దంపతులు

వారి బిడ్డనే మోశానంటున్న శిశువుకు జన్మనిచ్చిన తల్లి

డీఎన్‌ఏ పరీక్షల ద్వారానే వివాదం తేల్చాల్సిన పరిస్థితి  




సాక్షి, హైదరాబాద్‌

అద్దె గర్భం(సరోగసీ) ద్వారా జన్మించిన ఆ శిశువు ఇప్పటి వరకు కన్నతల్లి మురిపాలకు నోచుకోలేదు. పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ముఖాన్ని ఆ తల్లి చూడనేలేదు. అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా పుట్టిన ఆ బిడ్డ ఓ అనాథలా నిలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. ‘సరోగసీ’ ద్వారా బిడ్డను కనాలనుకున్న తల్లిదండ్రులు, ఇందుకు పురమాయించిన వైద్యుల చేతిలో మోసపోయి నాలుగు రోజులుగా పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. సరోగసి ద్వారానే బిడ్డకు జన్మనిచ్చినట్లు బాధితురాలు చెపుతుంటే.. అసలు ఆ బిడ్డకు తమకూ ఎలాంటి సంబంధం లేదని గుంటూరుకు చెందిన దంపతులు చెపుతుండటంతో ఈ అంశం మరింత క్లిష్టంగా మారింది. దీంతో డీఎన్‌ఏ పరీక్షల ద్వారానే ఎవరి బిడ్డ అనేది తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, తన భార్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలి భర్త లక్ష్మణ్‌ తెలిపారు.



ఆ బిడ్డకు, మాకూ ఎలాంటి సబంధం లేదు: సుధారాణి, సరోగసీ ద్వారా బిడ్డ కావాలనుకున్న మహిళ పిల్లలపై ఉన్న మమకారంతో రాజ్‌భవన్‌ రోడ్డులోని ఓ ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌కు వెళ్లాం. అక్కడ అనిత అనే మధ్యవర్తి ద్వారా బాధితురాలు పరిచయమైంది. అద్దె గర్భం ద్వారా శిశువుకు జన్మనిచ్చేందుకు అంగీకరించింది. ఆ మేరకు ఇరువురి మధ్యా ఒప్పందం కుదిరింది. రెగ్యులర్‌ చెకప్‌ కోసం ఎస్‌ఆర్‌ నగర్‌లోని జేజే ఆస్పత్రికి తీసుకెళ్లాం. సరోగసీ ప్రక్రియ ద్వారా ఆమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి ఏడో నెల వరకు నెలవారీ వైద్య పరీక్షలు సహా కడుపులోని బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పౌష్టికాహారం ఇలా అన్నీ మేమే సమకూర్చాం. ఏమైందో ఏమో ఏడో నెల తర్వాత బాధితురాలు అకస్మాత్తుగా ఫాలోఅప్‌ చికిత్సకు నిరాకరించింది. అనేకసార్లు ఫోన్‌ చేసినా ఆమె నుంచి కనీస స్పందన లేదు. నిజానికి బాధితురాలికి జన్మించిన బిడ్డకు మాకూ ఎలాంటి సంబంధం లేదు. పిల్లలు లేని లోటు తీర్చుకునేందుకు మానవతా ధృక్ఫథంతో మేమే ముందుకు వచ్చాం. బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష చేస్తే అసలు తల్లిదండ్రులు ఎవరో తెలుస్తుంది. ఒకవేళ ఆమెకు జన్మించిన బిడ్డ జన్యువు మా దంపతుల జన్యువుతో పోలి ఉంటే తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం.



వాళ్ల బిడ్డనే మోసాను:

వెంకటమ్మ, సరోగసీ ద్వారా శిశువుకు జన్మనిచ్చిన తల్లి నవమాసాలు మోసి కన్నబిడ్డ పుట్టుక గురించి ఏ తల్లీ అబద్ధం చెప్పదు. ఇప్పటికే ఒక బాబుకు జన్మనిచ్చి పెంచుతున్న తల్లిని నేను. నిజానికి పేదరికం వల్ల డబ్బుకు ఆశపడి ఈ ప్రక్రియకు అంగీకరించాను. తొలుత ఈ విషయం నా భర్తకు కూడా తెలియదు. ఏడో నెల తర్వాత గుంటూరు దంపతులు నన్ను జేజే ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్‌ చేయించారు. స్కానింగ్‌ చేసిన డాక్టర్‌ కడుపులో పెరుగుతోంది ఆడబిడ్డ అని చెప్పింది. అప్పటి వరకు అన్నీ తామై వ్యవహరించిన ఆ దంపతులు ఆడబిడ్డ అని తెలిసి ముఖం చాటేశారు. అనేకసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. ఒకవేళ నాకు, నా భర్తకే ఈ బిడ్డ పుట్టి ఉంటే.. సాదుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. నన్ను మోసం చేసిన దంపతులు, వైద్యులపై చర్యలు తీసుకుని పుట్టిన బిడ్డకు న్యాయం చేయాలి.



అలా నిర్థారించడం నేరం:డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, డీఎంఈ

కడుపులో పెరుగుతుంది ఆడో, మగో నిర్థారించడం చట్టరీత్యా నేరం. అలా చేసిన డయాగ్నోస్టిక్‌పైనే కాదు సంబంధిత వైద్యులపైనా కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవచ్చు. నిజానికి దేశంలో సరోగసీ విధానంపై స్పష్టమైన నిబంధనలు లేవు. కొంతమంది వైద్యులు దీన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ కేసును పోలీసులే తేల్చాలి.



నేను ఐవీఎఫ్‌ చేయను: డాక్టర్‌ జయంతి, గైనకాలజిస్ట్, జేజే ఆస్పత్రి

మా ఆస్పత్రిలో బేసిక్‌ ఇన్‌ఫెర్టిలిటీ చికిత్సలు, సాధారణ, సిజేరియన్‌ ప్రసవాలు, ఇతర గైనిక్‌ సంబంధిత చికిత్సలు తప్ప.. ఐవీఎఫ్, సరోగసీ వంటి చికిత్సలు లేవు. బాధితులు ఆరోపిస్తున్నట్లు మా ఆస్పత్రిలో ఎలాంటి లింగనిర్థారణ పరీక్షలు చేయలేదు. అసలు వారెవరో కూడా మాకు తెలియదు. పుట్టిన బిడ్డకు, ఆ ఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top