అనాథలకు అండ

అనాథలకు అండ - Sakshi


ఫుట్‌పాత్ బతుకులకు ప్రభుత్వం అండగా నిలవనుంది. దిక్కూమొక్కూ లేక.. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేక రోడ్ల పక్కన, బస్టాండ్, హోటళ్ల ఎదుట, జంక్షన్లలో ఉంటున్న వారికి నీడ కల్పించేందుకు నిర్ణయించింది. వీరి సంక్షేమం కోసం జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్(ఎన్‌యూఎల్‌ఎం) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వీరిని గుర్తించి సకల సౌకర్యాలు కల్పించనున్నారు.

 

 జగిత్యాల అర్బన్ :

 అర్బన్ ప్రాంతాల్లో ఇల్లు లేకుండా ఉంటున్న ఇలాంటి వారి వివరాలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), మున్సిపాలిటీల ఆధ్వర్యంలో సేకరిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, జగిత్యాల మున్సిపాలిటీల్లో రాత్రి సమయంలో సర్వే చేస్తున్నారు. లక్ష జనాభా దాటిన పట్టణాల్లో ఈ పథకం వర్తింపజేస్తున్నారు. ఈ పథకం ద్వారా గుర్తించిన వారికి ప్రభుత్వం రేషన్, ఆధార్, గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రతీ 50 మందికి ఒక ఆశ్రయం కల్పించి జీవనోపాధి కల్పించనున్నారు.

 గోదావరిఖనిలో సర్వే

 కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థలోని రోడ్లు, ఫుట్‌పాత్‌లు, బస్‌షెల్టర్లు, ఆలయాలు, బస్టాండ్‌ల వద్ద నివసించే యాచకులు, నివాసం లేని నిరుపేదల స్థితిగతులపై శనివారం అర్ధరాత్రి సిబ్బంది సర్వే నిర్వహించారు. రాత్రి 10.30 నుంచి నగరంలోని పలు ప్రాంతాలల్లో శానిటేషన్ విభాగంలోని టీం లీడర్లు సర్వే చేశారు. 13 మంది సిబ్బంది సర్వేలో పాల్గొనగా, ఏసీపీ శ్యాంకుమార్, పీఆర్పీ రాజ్‌కుమార్ పర్యవేక్షించారు. తెల్లవారుజాము వరకు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 37 మంది ఇల్లు లేని నిరుపేదలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

 ఆదుకుంటాం

 కరీంనగర్ అర్బన్ : అనాథలకు వసతి కల్పించేందుకు సరేవ చేస్తున్నట్లు మెప్మా ప్రాజెక్టు డెరైక్టర్ విజయలక్ష్మి అన్నారు. నగరంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట, బస్టాండ్, అంబేద్కర్ స్డేడియం, గీతాభవన్, మంచిర్యాల చౌరస్తా, కోర్టు చౌరస్తా, అపోలో రీచ్ ఏరియా, కార్ఖనాగడ్డ చౌరస్తాల్లో నిద్రిస్తున్న అనాథల వివరాలు సేకరించారు. గూడు లేక ఫుట్‌పాత్‌లను నమ్ముకున్న వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌యూఎల్‌యూ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం ద్వారా గుర్తించిన అనాథలకు రేషన్, ఆధార్, గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రతీ 50 మందికి ఒక ఆశ్రయం కల్పించి, జీవనోపాధి కల్పిస్తామన్నారు. వీధి వ్యాపారులకు గుర్తింపుకార్డులు జారీ చేస్తామని తెలిపారు. వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆమె వెంట తహశీల్దార్ జయచంద్రరెడ్డి, మెప్మా పీఆర్పీలు శ్రీవాణి, అనిత, రజని, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి ఉమాదేవి పాల్గొన్నారు.





 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top