‘సూపర్’ పోలీస్


కరీంనగర్ క్రైం : జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 25 మంది ఎస్సైలను హైదరాబాద్‌ కు బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. ఈ మేరకు సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారని తెలిసింది. సిటీ పోలీస్ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో ప్రతి జిల్లా నుంచి సమర్థులైన ఎస్సైలను హైదరాబాద్‌కు బదిలీ చేయడానికి నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా జిల్లా నుంచి సుమారు 15 నుంచి 25 మందిని బదిలీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఎవరెవరిని బదిలీ చేయాలి..? ఇందులో సీనియర్లు, జూనియర్లు ఎంత మంది ఉండాలి..? అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ బదిలీలతో ఇప్పటికే పోస్టింగ్ విషయంలో రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వారి నుంచి కొంత ఒత్తిడి తగ్గుతుందని కూడా అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. పనిలోపనిగా జిల్లాలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినీ బదిలీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి బదిలీ అయిన ఎస్సైలను సూపర్ పోలీస్‌గా నియమించడానికి గల అవకాశాలు పరిశీలిస్తున్నారని, వీరి కోసం సూపర్ న్యూమరిక్ పోస్టులు సృష్టించనున్నారని సమాచారం.

 

 వారం రోజుల్లోనే బదిలీ?

 ప్రస్తుతం జిల్లాలో వివిధ విభాగాల్లో కలిపి 170 మంది ఎస్సైలు పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 68 పోలీస్‌స్టేషన్లలో 90 మంది ఎస్సైలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలామంది వివిధ రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టౌన్ పోలీస్‌స్టేషన్లలో ఎక్కువగా యువకులే ఎస్సైలుగా ఉన్నారు. వీరి సర్వీసు రెండేళ్లు దగ్గరపడుతుండడంతో వారం రోజుల్లో బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం. 2005, 2007, 2012 బ్యాచ్‌లకు చెందిన పలువురు ఎస్సైలు కొంతకాలంగా లూప్‌లైన్ పోస్టింగ్‌ల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరికి జనరల్ పోస్టింగ్ ఇవ్వడం తప్పనిసరిగా మారింది.

 

 ఈ క్రమంలో వారు పోస్టింగ్ కోసం ఇప్పటికే అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో మంచి అధికారులను నియమించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఎస్సైల బదిలీ తప్పనిసరికానుంది. 2012 బ్యాచ్‌కు చెందిన పలువురు ఎస్సైలపై ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతోపాటు ఇప్పటికే మానవహక్కుల సంఘాలు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వీరిలో సుమారు 20 మంది వరకూ ఎస్సైలను మార్చనున్నారని సమాచారం. ఇప్పటికే బదిలీల జాబితా సిద్ధమైందని... తుదిమెరుగులు దిద్దుకుని ఈ వారం చివరిలోగా బదిలీలు చేయనున్నట్లు సమాచారం.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top