వడదెబ్బకు విలవిల


జిల్లాలో 18మంది మృతి

మృతుల్లో చిన్నారి


 

 వనపర్తిటౌన్ : ఎండలు సామాన్యులను వణికిస్తున్నాయి... చిన్నాపెద్ద అనే తేడా లేకుండా వడగాలులకు హడలిపోతున్నారు.. ఈక్రమం లో ఎండవేడిమి తీవ్రతకు తాళలేక మృత్యువాతపడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. బుధవారం జిల్లాలో వేర్వేరుచోట్ల 18మంది మృతిచెందారు. వనపర్తి పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన పద్మ, రాములు కూతురు కావేరి(6)ని ఇంటివద్దే విడిచి తల్లిదండ్రులు కూలీపనులకు వెళ్లారు. ఎండవేడికి వడగాలుల బారిపడి రాత్రి ఇంట్లో వాంతులు, విరేచనాలు చేసుకుంది. ఉదయం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా..పరిస్థితి విషమించడంతో చనిపోయింది.  



 వడదెబ్బతో రైతుమృతి

 దామరగిద్ద: మండలంలోని దేశాయ్‌పల్లి గ్రామానికి చెందిన గుడ్డి బస్సప్ప(50) రెండురోజులు అనారోగ్యానికి గురయ్యాడు. బుధవారం పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. మృతుడికి  భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు ఉన్నారు.

 సర్పంచ్ కొడుకు మృతి

 లింగాల: మండలంలోని కోమటికుంట గ్రామానికి చెందిన సర్పంచ్ చిన్నమ్మ కొడుకు వెంకటస్వామి(35) వడదెబ్బకు గురై మృతిచెందాడు.మంగళవారం గ్రామంలో చెడిపోయిన చేతిపంపులను మరమ్మతు చేసే పనికి వెళ్లాడు. సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో నాగర్‌కర్నూల్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలోనే చనిపోయాడు.  

 ఈరట్వానిపల్లిలో మహిళ

 ఉప్పునుంతల: మండలంలోని ఈరట్వానిపల్లి గ్రామంలో కేతావత్ రాజలీ(50) అనే మహిళ వడదెబ్బకు గురై చనిపోయింది. పొలం వద్దకు వెళ్లిన ఆమె మధ్యాహ్నం ఇంటికొచ్చిన తరువాత అస్వస్థతకు గురై కొద్దిసేపటికే చనిపోయింది.

 పదరలో వృద్ధుడు

 అమ్రాబాద్: తీవ్రమైన ఎండ వేడిమిని తట్టుకోలేక మండలంలోని పదర ఎలిజర్ల ముత్యాలు(82)అనే వృద్ధుడు మృతిచెందాడు. పొలం వద్దకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చి సొమ్మసిల్లి పడిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.



 ‘పేట’లో వృద్ధురాలు

 నారాయణపేట: ‘పేట’ పట్టణంలోని లైన్‌వాడకు చెందిన యశోదబాయి (60) వడదెబ్బ కు గురికావడంతోకుటుంబసభ్యులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చికిత్సనిమిత్తం తరలించా రు.అక్కడచికిత్స పొందుతూ మృతిచెందింది.

 వేముులలో వృద్ధుడు మృతి

 అడ్డాకుల : మండలంలోని వేముల గ్రామానికి చెందిన వృద్ధుడు గోపినాగన్న(71) వడదెబ్బకు గురై మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వారంరోజులుగా తీవ్రమైన ఎండల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నాగన్న తీవ్రఅస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు వదిలాడు.

 తాళ్లకుంటలో వృద్ధుడు

 ఆమనగల్లు: మండలంలోని పోలెపల్లి పంచాయతీ తాళ్లకుంటకు చెందిన గండికోట మల్లయ్య(80)అనే వృద్ధుడు వడదెబ్బకు గురై మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఉదయం వ్యవసాయ పొలానికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగొచ్చాడు. వడదెబ్బకు గురై ఇంట్లో మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని పోలెపల్లి సర్పంచ్ సుక్కమ్మ, లాలయ్య, జంగమ్మ, తిరుపతయ్య, శంకరయ్య పరామర్శించారు.



 పెబ్బేరు మండలంలో ఇద్దరు

 పెబ్బేరు: మండల కేంద్రానికి చెందిన గొల్ల రామస్వామి(56) స్థానికంగా రిక్షా లాగుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం రిక్షా లాగేందుకు బయటికి వెళ్లిన రామస్వామికి ఎండతీవ్రత వల్ల వడదెబ్బతగిలింది. అస్వస్థతకు గురై బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. అలాగే చెలిమిల్ల గ్రామానికి చెందిన ఉపాధి కూలీ బోయ పక్కిరయ్య (58) వడదెబ్బకు గురై అస్వస్థతతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఇంట్లోనే మృతిచెందాడు.

 ఇర్విన్‌లో యువకుడు

 మాడ్గుల: మండలంలోని ఇర్విన్‌కు గ్రామానికి చెందిన మాడ్గుల చెంద్రయ్య (26)రెండురోజులుగా పొలంలో వ్యసాయపనులు చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం వడదెబ్బకు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్సచేయించారు. రాత్రి పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.

 వ్యవసాయ కూలీ మృతి

 గద్వాలన్యూటౌన్ : మండలంలోని గోనుపాడు గ్రామానికి చెందిన బోయ తిమ్మప్ప(57) వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం బోయ తిమ్మప్ప వడదెబ్బకు గురికావడంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. మంగళవారం రాత్రి నిద్రలోనే మృతిచెందాడు.



 చుక్కగుట్టతండాలో వృద్ధుడు

 తలకొండపల్లి: మండలంలోని జూలపల్లి పంచాయతీ చుక్కగుట్టతండాలో వడదెబ్బకు గురై గూండ్యనాయక్(70) అనే వృద్ధుడు మృతిచెందాడు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి అస్వస్థతకు గురై మంచంపట్టాడు. పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.

 కోయిల్‌కొండలో ఇద్దరు కూలీలు

 కోయిల్‌కొండ: మండలంలోని కేశ్వాపూర్ గ్రామానికి చెందిన వడ్డెరాజు (32) రాళ్లు కొడుతూ జీవనం సాగించేవాడు. మంగళవారం పనికి వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. రాత్రి నిద్రలోనే కనుమూశాడు. అలాగే వీరంపల్లిలో గ్రామంలో రామన్నగౌడ్(60) మేకల కాపరి. పనికి వెళ్లొచ్చి అస్వస్థతకు గురై మృతిచెందాడు. ఆర్‌ఐ వెంకటరమణ, వీఆర్‌ఓ వెంకట్రాములు పంచనామా నిర్వహించారు.

 వీపనగండ్లలో ఇద్దరు

 వీపనగండ్ల: వీపనగండ్లకు చెందిన చిన్నమారూర్ ధర్మారెడ్డి (65),వడ్డె అంజమ్మ(70) రెం డురోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో చనిపోయారు.



 షాద్‌నగర్‌లో ఇద్దరు

 షాద్‌నగర్: ఫరూఖ్‌నగర్‌లోని తెలుగుగేరికి చెందిన పవ్మయాదయ్య(50) తాపీమేస్త్రీగా జీ వనం సాగిస్తున్నాడు. సోమవారం వడదెబ్బకు గురై బుధవారం ఉదయం మృతిచెందాడు. కాగా, పద్మావతి కాలనీకి చెందిన శివాజీరావు(50) తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసుకునేవాడు. వడదెబ్బకు గురై చనిపోయాడు.

 వనపర్తిలో వృద్ధుడు

 వనపర్తిటౌన్: వడదెబ్బకు గురైన ఓ వృద్ధుడు(70) వనపర్తి బస్టాండ్‌లో పడిపోయాడు. చికిత్సకోసం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వనపర్తి ప్రథమ ఎస్సై గాంధీనాయక్ తెలిపారు. మృతదేహా న్ని ఆస్పత్రిలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top