ప్రాణాలు తీస్తున్న ఎండలు


ఎండలు ప్రాణాలు తోడేస్తున్నాయి. ఉదయం 9 దాటితే ఇంటినుంచి బయటికి రానివ్వడంలేదు. కార్మికులు, కూలీలు, రైతులు, అత్యవసరంగా బయటికి వెళ్లిన వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురై ఇంటికి చేరుతున్నారు. కొందరు వైద్యం చేయించుకున్నా నిద్రలోనే ప్రాణాలు వదులుతుంటే మరికొందరు ఆస్పత్రిలో వైద్యం పొందుతూ, ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోతున్నారు. దీంతో ప్రజలు ఎండలో తిరగడానికి జంకుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే జిల్లాలో 12 మంది చనిపోయారు.- సాక్షి బృందం

 

 సుల్తాన్‌పూర్‌లో రైతు..

 దౌల్తాబాద్ : మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన వడ్డె నర్సప్ప(62) అనే రైతు శుక్రవారంఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన పొలంలో పనులు చేశాడు. మధ్యాహ్నం ఎండలో ఇంటికి వచ్చి భోజనం చేసిన అనంతరం తిరిగి పొలానికి నడుచుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యంలో పడిపోయాడు. తోటి రైతులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. ఈ విషయమై భార్య నాగమ్మ వీఆర్‌ఓకు ఫిర్యాదు.



 అయ్యవారిపల్లిలో మరో రైతు

 మిడ్జిల్ : అయ్యవారిపల్లికి చెందిన కుమ్మరి ఆంజనేయులు (42) అనే రైతు శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఉదయం నుంచి పనుల్లో నిమగ్నమైన రైతు సాయంత్రం పొలంలోనే అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపు చనిపోయాడు. మృతునికి భార్య అంజమ్మతో పాటుగా కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.



 మక్తల్‌లో ఇంకో రైతు

 మక్తల్ :  పట్టణానికి చెందిన బలిజ సంగప్ప(60) అనే రైతు కూడా ఎండ తీవ్రతను తట్టుకోలేక పొలంలో సృ్పహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తుండగా అప్పటికే చనిపోయాడు.



 జమ్మాపూర్‌లో గొర్రెలకాపరి..

 పాన్‌గల్ : మండల పరిధిలోని జమ్మాపూర్ గ్రామంలో గురువారం రాత్రి వడదెబ్బకు  గొర్రెల కాపారి పెద్ద బిచ్చన్న(65) మృతిచెందాడు. రోజులాగే గురువారం గొర్రెల వెంబడి వెళ్లిన కాపరి వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సాయంత్రం కుటుంబ సభ్యులు వనపర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనమేరకు జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మృతునికి భార్య బాలమ్మ,కుమారుడు,కుమార్తె ఉన్నారు.



 మాడ్గులలో మేకల కాపరి

 మాడ్గుల : మండలంలోని కొల్కులపల్లికి చెందిన పులెమళ్ళ బుచ్చయ్య (62) అనే మేకలకాపరి వడదెబ్బకు గురై గురువారం రాత్రి మృతి చెందాడు. బుచ్చయ్య గురువారం పొద్దస్తమానం మేకల వెంట తిరిగి వాటిని మెపుకుని సాయంత్రం చీకటి పడ్డాక ఇంటికి చేరుకున్నాడు. వచ్చిన వెంటనే దాహంగా ఉందని నీళ్లు తాగి అక్కడే పడి పోయాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నమిత్తం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు వదిలాడు.  



 నర్వలో వ్యవసాయ కూలీ..

 నర్వ : మండల కేంద్రానికి చెందిన హరిజన వెంకటన్న (40) అనే వ్యవసాయ కూలీ శుక్రవారం ఉదయం ఎండతీవ్రతను తట్టుకోలేక చనిపోయాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం పనులకు వెళ్లగా ఇంటికి వచ్చాక అస్వస్థతకు గురయ్యాడు. తోటి కూలీలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తుండగానే చనిపోయాడు. మృతుడికి భార్య చిట్టెమ్మతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.



 పింఛన్‌కోసం వెళ్లి..

 బల్మూర్ : మండల కేంద్రానికి చెందిన పంజుగుల బాలయ్య (68) అనే వృద్ధుడు పింఛన్‌కోసం వెళ్లి వడదెబ్బ బారిన పడ్డాడు. గురువారం ఉదయం స్థానిక గ్రామ పంచాయతీకి వెళ్లి కాసేపు ఎండలో నిలుచొని పింఛన్ తీసుకొని ఇంటికి వచ్చాడు. కాసేపటికే అస్వస్థతకు గరికావడంతో సాయంత్రం ప్రాథమిక చికిత్సలు చేయించుకొని నిద్రపోయాడు. శుక్రవారం ఉదయం నిద్రలోనే చనిపోయినట్టు కుటుంబసభ్యులు గుర్తించారు.



 తిమ్మాయిపల్లిలో మరో వృద్ధురాలు

 కోస్గి : మండలంలోని తిమ్మాయపల్లికి చెందిన హన్మమ్మ (85) మూడు రోజుల కిందట సొంత పనిమీద మధ్యాహ్నం వేళ బస్సులో కోస్గికి వచ్చింది. తిరుగుప్రయాణంలో గ్రామ స్టేజీ దగ్గర చాలాసేపటి వరకు నిలబడగా ఆటోలు లేకపోవడంతో రెండు కి.మీ నడుచుకుంటూ వెళ్లింది. సాయంత్రం నుంచే అస్వస్థతకు గురై  విరేచనాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి చనిపోయింది.



 లింగాలలో వృద్ధురాలు

 లింగాల: పట్టణానికి చెందిన కావేటీ సీతమ్మ(60) అనే వృద్ధురాలు రోజులాగే గురువారం పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఎండ తీవ్రత అధికంగా ఉండటం, పొద్దస్తమానం పొలం పనులు చేయడంతో అస్వస్థతకు గురైంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు వైద్యునివద్ద ప్రాథమిక చికిత్సలు చేయించుకొని నిద్రపోయింది. శుక్రవారం తెల్లవారుజామున సీతమ్మ ఉలుకూ పలుకు లేకపోవడంతో చనిపోయినట్టు కుటుంబసభ్యులు గుర్తించారు. ఈ సంఘటనపై వీఆర్‌ఓ విచారణ చేశారు.



 బుక్కాపురంలో యువకుడు

 అలంపూర్  : మండల పరిధిలోని బుక్కాపురం గ్రామంలో రాముడు(34) అనే యువకుడు వడదెబ్బ బారిన పడ్డాడు. దినసరి వ్యవసాయ కూలీగా పనిచేసే రాముడు గురువారం మధ్యాహ్నం పొలం పనులకు వెళ్లి తిరిగివచ్చి అస్వస్థతకు గురయ్యాడు. రాత్రి కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. మృతునికి భార్య లక్ష్మిదేవి, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.



 పుల్లూరులో ఉపాధి కూలీ..

 మానవపాడు : మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో వెంకట్రాములు (58) రోజులాగే గురువారం భార్యతో కలిసి ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లాడు. పనులు చేస్తున్నచోట సొమ్మసిల్లి కింద పడిపోవడంతో తోటి కూలీలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున చనిపోయాడు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు.



 చంద్రాస్‌పల్లిలో వృద్ధుడు

 కోయిల్‌కొండ : మండల పరిధిలోని చంద్రాస్‌పల్లి గ్రామానికి చెందిన పెద్ద కుర్వ ఎల్లప్ప (65)  శుక్రవారం మధ్యాహ్నం ఎండతీవ్రతను తట్టుకోలోక ఇంట్లో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులకు చెప్పి నిద్రపోగా కాసేపటికే ప్రాణాలు వదిలాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top