‘ఆమె’కు అండ కావాలి

‘ఆమె’కు అండ కావాలి - Sakshi


► ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు, హత్యలు

► తలదించుకుంటున్న సభ్యసమాజం

► నేరాల అదుపునకు షీ టీంలు

► అయినా ఆగని వేధింపులు




ఆదిలాబాద్‌ : సృష్టికి మూలమైన మహిళకు ఆత్మరక్షణ లేకుండా పోతోంది. మూడుముళ్లు.. ఏడడుగులు... వేదమంత్రాలు.. అగ్నిసాక్షిగా మనువాడిన భర్త అయినా.  తోటి ఉద్యోగి అయినా.. విద్యాబుద్ధులు చెప్పే గురువైనా.. ప్రేమ పేరిట నయవంచనకు గురిచేసే మగాలై్లనా బలయ్యేది మాత్రం అబలనే. మనకు జన్మనిచ్చిన అమ్మ.. తోడబుట్టిన చెల్లి.. కట్టుకున్న భార్య ఆడదే అయినా.. వారి పట్ల వేధింపులు ఆగడం లేదు. ఇంటా..బయట ఎక్కడ చూసినా మహిళలపై వేధింపులే ఎక్కువయ్యాయి. వారి కోసం న్యాయస్థానాలు, చట్టాలు ఎన్ని తెచ్చినా తుడుచుపెట్టుకు పోతున్నాయి.



తెగిపోతున్న బంధాలు

ఆటవిక ప్రపంచంలో అనుబంధాలు తెగిపోతున్నాయి. పెళ్లి చేసుకొని నిండునూరేళ్లు ఒకరికొకరు తోడునీడగా ఉండాల్సిన వారు బంధాన్ని మరిచిపోయి అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నచిన్న కారణాలతో బంధాలను తెంచుకుంటున్నారు. దీంతో మహిళలు క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వరకట్న వేధింపులు, కుటుంబ తగాదాలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. పేదరికం, నిరక్షరాస్యత, చుట్టుముట్టిన సమస్యలను పరిష్కరించుకోలేకపోవడం.. తమకు ఎవరూ లేరనే భావన మహిళలను ఆత్మహత్యల వైపు పురిగొల్పుతోంది. మద్యపానమూ కాపురాల్లో చిచ్చుపెడుతోంది. చాలామంది దంపతులు పోలీసుస్టేషన్ల గుమ్మం తొక్కుతున్నారు. న్యాయస్థానాల తలుపుతడుతున్నారు.  



స్వేచ్ఛకు దూరమేనా..?

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రస్తుతం తరుణంలో మహిళ అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు దూసుకెళ్తోంది. కానీ ఇప్పటికీ వారిపై వివక్షత కొనసాగుతుంది. మహిళ ఎంత విద్యావంతురాలైన.. తోటి మగవారిని మించి అన్ని రంగాల్లో అభివద్ధి చెందుతున్న వారిని చిన్నచూపేచూస్తున్నారు. అంతరిక్షంలో మగవారికి ధీటుగా రోజురోజుకు మహిళలు పోటీపడుతున్నారు. కానీ ఎక్కడో కొంత అసహనం. ఎంత చేసినా.. ఎక్కడికి వెళ్లిన ఆడవారే కాదా అనే చులకన భావం కనిపిస్తోంది. పుట్టుక మొదలు తనువుచాలించే వారకు ఆడది ఆత్మరక్షణ కోసం అల్లాడుతోంది.



ఉమ్మడి జిల్లాలో 23 షీ టీంలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌ల నిరోధానికి షీటీంలు పనిచేస్తున్నాయి. 23 షీటీం బృందాలు ఉండగా, ఒక్కో టీంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 223 మంది యువకులకు కౌన్సిలింగ్‌ నిర్వహించగా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారిపై 15 కేసులు నమోదు చేశారు. షీటీంలు నియమించిన తర్వాత కళాశాలలు, పాఠశాలలు విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. అయితే ఈ షీటీంలను విద్యార్థులు, యువతులు మాత్రమే సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంట్లో మహిళల వేధింపులు, బయట ప్రాంతాల్లో ర్యాగింగ్‌లు వంటి వాటిపై ఇంకా పట్టుసాధించలేదని తెలుస్తోంది. కుటుంబాల్లో సైతం పోలీసులు కౌన్సిలింగ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తే ప్రయోజనం

మహిళలపై జరుగుతున్న దాడులను ఆపే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మహిళలను వేధించిన వారిని శిక్షించేందుకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. వాటిని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా మహిళలపై అఘాయిత్యాలను నిర్మూలించే అవకాశం ఉంటుంది. 498–ఏ చట్టం ద్వారా పెళ్లైన తర్వాత భర్త వేధిస్తే ఆమెకు రక్షణగా ఉంటుంది. ఒకవేళ భర్త హింసించి చంపేస్తే  304–బి చట్టప్రకారం శిక్ష పడే అవకాశం ఉంటుంది. సమాజంలో చైతన్యం వచ్చినప్పుడే మహిళలై దాడులు ఆగుతాయి.  – సంగెం సుధీర్‌కుమార్, న్యాయవాది

                  



మానసిక ఒత్తిడి వల్లే

 భార్యాభర్తల మధ్య సర్దుబాటు ఉండాలి. వారి మధ్యే గొడవలు జరిగి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు సమస్యలు పెరిగిపోతే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకు వస్తారు. సమస్య తీవ్రతను బట్టి బలవన్మరణం చేసుకునే విధానం ఆధారపడి ఉంటుంది. కుటుంబ గొడవలు ఉంటే మానసిక వైద్యులతో కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. ఆత్మహత్య ఆలోచన వచ్చినప్పుడు మనకు ఇష్టమైన వాటి గురించి ఆలోచించడం, స్నేహితులతో మాట్లాడడం చేయాలి.  


                                                         – డాక్టర్‌ ఓంప్రకాశ్, మానసిక వైద్య నిపుణులు



మహిళా చట్టాలు

    

► మహిళలను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తే ఐపీసీ 306 సెక్షన్ కింద సదరు వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తారు.

►మహిళలపై అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడితే సెక్షన్ 354 ప్రకారం ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది.

►మహిళలను అపహరించి బలవంతంగా వివాహం చేసుకుంటే 366 ప్రకారం పదేళ్ల జైలుశిక్ష పడుతుంది.

►వివాహితను వేధింపులకు గురిచేస్తే ఐపీసీ సెక్షన్ 498–ఏ చట్టం ప్రకారం మూడేళ్లు జైలుశిక్ష విధిస్తారు.

►భార్య బతికి ఉండగా మరోవివాహం చేసుకుంటే 494 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఏడేళ్లు జైలుశిక్ష విధిస్తారు.

►వరకట్నం కోసం భార్యను వేధించి గాయపరిస్తే 304–బి సెక్షన్ కింద భర్తకు ఏడేళ్లు జైలుశిక్ష విధిస్తారు.

►వీటితో పాటు మహిళలపై అత్యాచారం చేసి, దాడిచేసినా నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు.

    రెండున్నరేళ్లలో నమోదైన కేసులు




కేసులు                 2015      2016        2017



వరకట్న హత్యలు        4           19            02

వరకట్న వేధింపులు    14           26          150

వేధింపులు               405         689         220

హత్యలు                    17           13          08

కిడ్నాప్‌లు                  25           31         20

మానభంగాలు              64            69       11

నిర్భయ                  223           296       50(జూన్ వరకు)  


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top