అలకలు... అసమ్మతి మొలకలు

అలకలు... అసమ్మతి మొలకలు


   కొలిక్కిరాని జైపాల్ బుజ్జగింపులు

   ‘తిరుగుబాటు’ వీడని నేతలు

   పార్టీ వీడనున్న మాజీ ఎమ్మెల్యే?

   లోపాయికారీ మద్దతుకు సిద్ధం

   ‘వలసలే’ప్రత్యర్థుల విమర్శనాస్త్రం


 

 జిల్లా రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలనుకుంటున్న కేంద్రమంత్రి జైపాల్ రెడ్డికి స్వపక్షంలోనే  వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకొని ముందుకు వెళ్లాలనుకుంటన్న ఆయనకు అసమ్మతి రాగం బెంబేలెత్తిస్తోంది. దీని ఆసరాగా చేసుకొని ప్రత్యర్థులు కూడా ఆయన జిల్లాకు ఒరగబెట్టిందేమిటో చెప్పాలని విమర్శల జడి కురిపిస్తున్నారు. వ్యూహకర్తగా పేరున్న ‘సూదిని’ వీటిని ఎలా అధిగమిస్తారన్నది వేచి చూడాల్సిందే.

 

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పదిహేనేళ్ల తర్వాత జిల్లా రాజకీయాల్లో పునఃప్రవేశించిన కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సొంత పార్టీ నేతల నుంచే సమస్యలు ఎదుర్కొంటున్నారు. నామినేషన్ల పర్వం ముగిసినా అసెంబ్లీ టికెట్ ఆశించి భంగ పడిన నేతలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు.



తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేసి బుజ్జగింపుల తర్వాత బరి నుంచి వైదొలిగారు. కానీ అలక వహించిన నేతలు ప్రచార పర్వంలో మాత్రం జైపాల్ వెంట కలిసొచ్చే సూచనలు కనిపించడం లేదు. కొడంగల్‌లో టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి రాత్రికి రాత్రే టీఆర్‌ఎస్‌లో చేరి టికెట్ సాధించుకున్నారు.

 

జైపాల్‌రెడ్డి ద్వారా టికెట్ కోసం ప్రయత్నించినా టికెట్ దక్కక పోవడంతో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.రమేశ్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు. తాజాగా మక్తల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ ఇప్పించని వ్యక్తి కోసం సర్దుకుపోయి పనిచేయడమెందుకుని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

 

ఒత్తిళ్ల మూలంగా బరి నుంచి తప్పుకున్న షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కూడా ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వీర్లపల్లి శంకర్, కడెంపల్లి శ్రీనివాస్ తదితరులు ఎవరికి మద్దతు పలుకుతారనే అంశంపై చర్చ జరుగుతోంది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించి పార్టీలో చేరిన సయ్యద్ ఇబ్రహీం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండటంతో ఓ సామాజిక వర్గం ఓట్లకు గండి పడుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.

 

 ‘వలస’పైనా విమర్శలు



 ఓ వైపు సొంతింట్లో అసమ్మతి ఎదుర్కొంటున్న జైపాల్‌రెడ్డిపై ప్రత్యర్థులు కూడా పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గతంలో మహబూబ్‌నగర్ నుంచి ప్రాతినిథ్యం వహించిన జైపాల్ రెడ్డి తర్వాతి కాలంలో మిర్యాలగూడ, చేవెళ్ల లోక్‌సభ స్థానాలకు వలస వెళ్లడాన్ని ప్రశ్నిస్తున్నారు. గెలిపించినా స్థానికంగా అందుబాటులో ఉండరనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసే యోచనలో ఉన్నారు. ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యుడిగా జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన సమయంలో జైపాల్‌రెడ్డి జిల్లాలో ఏం అభివృద్ధి చేశారంటూ విమర్శలు చేస్తున్నారు.

 

రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జైపాల్‌రెడ్డి మాత్రం వ్యక్తిగత విమర్శల జోలికెళ్లకుండా తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేనంటూ స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను పోషించిన పాత్రను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచార పర్వం ఊపందుకుంటున్న వేళ సొంత పార్టీలో అసమ్మతితో పాటు ప్రత్యర్థుల వ్యూహాలను ఎలా ఛేదిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top