ఉడుకుతున్న ఉస్మానియా

ఉడుకుతున్న ఉస్మానియా


ఓయూలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు 

ముఖ్యమంత్రి తీరుపై రాష్ట్రపతి,ప్రధానికి లేఖలు

ఇంచు భూమిని కూడా వదులుకోబోమని స్పష్టీకరణ


 

హైదరాబాద్: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఉస్మానియా యూనివర్సిటీ ఉడుకుతోంది. విద్యార్థులు భగ్గుమంటున్నారు. యూనివర్సిటీ భూ పరిరక్షణే ధ్యేయంగా విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. ఇంచుభూమిని కూడా వదులుకోమని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూలో వేర్వేరుగా ఆందోళనలు జరిగాయి.



ఓయూ భూములను కాపాడుకునేందుకు ఏర్పడిన వేదికలు, కమిటీలతోపాటు ఓయూ విద్యార్థి జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఏబీవీపీ, నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఎన్‌ఎస్‌యూఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఎంఎస్‌ఎఫ్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ,  పీడీఎస్‌యూ (తిరుగుబాటు), టీఎన్‌ఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్,  పీడీఎస్‌యూ(విజృంభణ), టీజీవీపీ నవనిర్మాణ్  తదితర విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. సీఎం కేసీఆర్‌కు ఓయూ భూముల పట్ల ఉన్న బుద్ధి మారాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని సరస్వతి దేవాలయంలో ప్రత్యేకపూజలు చేశారు.



అనంతరం తెలంగాణ  విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాణ్, ఏబీవీపీ నేతలు కడియం రాజు, వీరబాబు, ఓయూ భూముల పరిరక్షణ వేదిక కన్వీనర్ సోలంకి శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగులకు ఇప్పుడిప్పుడే వర్సిటీ విద్య అందుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఓయూ ను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. ఉస్మానియా భూములను విద్య, వైజ్ఞానిక పరిశోధనలకు తప్ప ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కేసీఆర్‌ను ఆర్ట్స్ కళాశాల కింద బొంద పెడతామని హెచ్చరించారు. హబ్సిగూడ వైపు ఓయూ భూములను ఆక్రమించి నిర్మించిన సారథి స్కూల్, స్వాగత్ గ్రాండ్ హోటల్, కల్లు కాంపౌండ్‌లను కూల్చివేస్తామన్నారు.



పూర్వవిద్యార్థులను, మాజీ వీసీలు, రిజిస్ట్రార్లను సమీకరించి ఓయూ భూముల పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ వర్సిటీల పట్ల సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న తీరును రాష్ట్రపతి, ప్రధాని, రాష్ట్ర గవర్నర్‌కు లేఖలు రాయనున్నట్లు విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. బైక్ ర్యాలీతో సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయం ముట్టడికి ఆర్ట్స్ కళాశాల నుంచి బయలుదేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎంఎస్‌ఎఫ్ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ఎదుట సీఎం చిత్రపటానికి చెప్పులదండ వేసి చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. ఓయూ భూములను స్వాధీన పర్చుకోవడానికి కేసీఆర్ చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని ఓయూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కల్యాణ్ అన్నారు. నిజాం కళాశాల ఎదుట విద్యార్థులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కల్యాణ్ మాట్లాడుతూ ఓయూ విద్యార్థులకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో కేసీఆర్‌ను గద్దెదింపుతామని హెచ్చరించారు.

 

ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులపై కేసులు

ఉస్మానియా యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని సచివాలయం ముట్టడిలో పాల్గొన్న ఓయూ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కురవ విజయ్‌కుమార్, చైర్మన్ చరణ్‌కౌశిక్‌యాదవ్, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పున్న కైలాస్‌నేతలతోపాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్థుల అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. కాగా, గవర్నర్ నరసింహన్‌ను శనివారం ఓయూ విద్యార్థులు కలవనున్నారు. సీఎం వ్యాఖ్యలతోపాటు తెలంగాణలోని వర్సిటీలకు వీసీలను నియమించాలని, మౌలిక వసతులు కల్పించాలని గవర్నర్‌ను కోరనున్నట్లు విద్యార్థి నేతలు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top