విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం


  • నర్సింగ్ హాస్టల్‌లో కలుషిత నీరు

  •  సురక్షితం కాదంటూ ఇప్పటికే అందిన నివేదిక

  • ఎంజీఎం : అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల ధనార్జన వెరసి నర్సింగ్ విద్యార్థుల ప్రాణానికి ముప్పు తెస్తున్నాయి. ఎంజీఎం ఆస్పత్రి పరి పాలనాధికారులు వ్యవహారశైలితో వరంగల్‌లోని నర్సింగ్ స్కూల్, అన్‌మ్యారీడ్ హాస్టల్ నిర్వహణపై నిత్యం వివాదాలు చుట్టుముడుతున్నాయి. గత ఆరు నెలల క్రితం ఆహారం కలుషితం కావడంతో సుమారు 50 మంది నర్సింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురికాగా... తూతూ మంత్రం చర్యలతో అధికారులు సరి పెట్టారు. అంతేకాకుండా ఆ ఘటనకు సంబంధించి ఎవరిపై చర్యలు తీసుకోకుండానే విద్యార్థులే మెస్ నిర్వహించుకున్నారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కొత్త కాంట్రాక్టర్‌కు మెస్ నిర్వహణ ను అప్పగించారు. తాజాగా కలుషిత నీరు సరఫరా చేస్తున్నారంటూ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

     

    దుర్వాసన.. కలుషితం



    నర్సింగ్ స్కూల్ ప్రాంగణంలోని బోరు ద్వారా ఆర్‌ఓఆర్ ప్లాంట్‌కు అక్కడి నుంచి విద్యార్థుల కు తాగునీరు అందిస్తున్నారు. అయితే, గతం లో ఓసారి బోరు మోటార్ మరమ్మతుకు రాగా.. బోర్‌ను తెరవడంతో అందులో పంది కొక్కు పడి మృతి చెందిందని విద్యార్థులు చెబుతున్నారు. అనంతరం మోటర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నీరు అందించినా... వాసన వస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి విద్యార్థులు తీసుకువెళ్లారు. దీంతో ఈ నీటిని ఇటీవల ప్రయోగశాలకు పంపించగా.. సురక్షితం కాదని తేలింది. అయితే, మరోసారి ప్రయోగశాల అధికారులు స్వయంగా నర్సింగ్ స్కూల్ కు వచ్చి పరీక్షల కోసం నీటిని తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన రిపోర్టు శనివారం అందుతుందని సమాచారం. ఈ మేరకు విద్యార్థుల కు ప్రస్తుతం మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్న అధికారులు.. రిపోర్టు వస్తే ఏం చర్యలు తీసుకోనున్నారో తెలుస్తుంది.

     

    చెత్తాచెదారంతో హాస్టల్ ప్రాంగణం



    నర్సింగ్ హాస్టల్ ప్రాంగణం చెత్తాచెదారంతో నిండిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశుభ్రత పాటించి పలువురికి ఆదర్శంగా నిలవాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఎంజీఎం పరిపాలనాధికారులు పట్టించుకోవడం లేదు. స్కూల్ ప్రాంగణం మొత్తం పనికి రాని మంచాలు, పాడైన కూలర్లు ఇత్యాది దర్శనమిస్తాయి. ఎక్కడెక్కడో విరిగిన ఫర్నీచర్‌ను సైతం తెచ్చి ఇక్కడ పడేస్తున్నారు.

     

    అన్‌మ్యారీడ్ హాస్టల్‌లో కాంట్రాక్టర్



    నర్సింగ్ విద్యనభ్యసించే విద్యార్థుల కోసం నర్సింగ్ స్కూల్ ప్రాంగణంలోనే హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. ఈ హాస్టల్‌లో అన్‌మ్యారీడ్ విద్యార్థులు తప్ప ఎవరు ఉండకూడదనేది నిబంధన. కానీ పరిపాలనాధికారులు తమకు అనుమతి ఇచ్చారంటూ కొందరు స్టాఫ్‌నర్సులతో పాటు ఏకంగా కాంట్రాక్టర్ హాస్టల్‌లోనే నివాసముంటున్నారు. అయితే స్కూల్ విద్యార్థులకు కాంట్రాక్టర్ పద్ధతిన ఆహారం అందించే వ్యక్తికి హాస్టల్‌లో స్థానం కల్పించడమేమిటని పలువురు వైద్యులతో పాటు సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. సైతం చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎం జీఎం పరిపాలనపై దృష్టి సారించడంతో పా టు హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top