అమ్మాయిలంటే బొమ్మలా చూస్తాడు..

అమ్మాయిలంటే బొమ్మలా చూస్తాడు.. - Sakshi


లెక్చరర్ వేధింపులపై విద్యార్థిని సూసైడ్‌నోట్

ఉరివేసుకుని విద్యార్థిని బలవన్మరణం..

ఆలస్యంగా వెలుగులోకి..తల్లిదండ్రుల ఆందోళన

లెక్చరర్ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్


 

 ‘‘కాలేజీలో అమ్మాయిలంటే ఆ సార్ బొమ్మలు అనుకుంటాడు. ఆ సారు సంగతి కొంచెం చూడండి’’ అని విద్యార్థి భవాని సూసైడ్ నోట్‌లో పేర్కొనడం అతని వికృత చేష్టలకు నిదర్శనం. విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయడంతోపాటు వారికి విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఫిజిక్స్ అధ్యాపకుడు శ్రీనివాస్ వక్రబుద్ధిని అమలు చేశాడు. ఫలితంగా తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాడు.

 

 నల్లగొండ క్రైం  

 విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకుడే కామాంధుడిగా మారాడు... వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన కళాశాల తరగతి గదుల్లో...కోరిక తీర్చాలంటూ... వేధించాడు.. అవకాశం నీకే ఇస్తున్నా అంటూ మానసిక క్షోభకు గురిచేశాడు.. అధ్యాపకుడి సూటీపోటీ మాటలు భరించలేక చివరకు ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు...  పట్టణ సమీపంలోని గంధంవారి గూడేనికి చెందిన పొమ్మనబోయిన సూరయ్య - మణెమ్మలకు భవాని(16), శోభ కుమార్తెలు. వీరిద్దరు స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. కొద్ది రోజులుగా అధ్యాపకుడు శ్రీనివాస్ భవానిని మానసికంగా వేధించడంతో విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. కేసు పెడదామని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నా విద్యార్థిని అందుకు అంగీకరించలేదు. గ్రామంలో మరోలా అనుకుంటారని ఏమి అనవద్దని నచ్చజెప్పింది. ఫిజిక్స్ బోధించే అధ్యాపకుడు శ్రీనివాస్ వేధింపులు అధికం కావడంతో అమ్మాయి అవమానానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.  

 

 సూసైడ్ నోట్‌తో వెలుగులోకి ..

 బాలిక తల్లిదండ్రులు సూరయ్య - మణెమ్మలది నిరుపేద కుటుంబం. తండ్రి హమాలి పని చేస్తుండగా తల్లి మేకలు కాస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు భవాని, శోభలు ఒకే కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఈ నెల 1న భవాని ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలవకపోవడం, కుటుంబ సభ్యులు లోతుగా ఆలోచించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే దహన సంస్కరణలు నిర్వహించారు. చెల్లెలు శోభ మేకప్ బాక్సును ఓపెన్ చేయడంతో అందులో సూసైడ్ నోట్ లభించింది. దీంతో అధ్యాపకుని వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమైంది.

 

 కామాంధుడిగా మారిన అధ్యాపకుడు...

 ఫిజిక్స్ బోధిస్తున్న అధ్యాపకుడు శ్రీనివాస్ కామాంధుడిగా మారి విద్యార్థినులను వేధిస్తున్నాడు. విద్యాబుద్ధులు చెప్పకుండా నీకే అవకాశమిస్తున్నా అంటే భవానిని వేధించాడు. విద్యార్థినిపైన చేయి వేయడం, నువ్వు చాలా హుషారు గల అమ్మాయి వంటూ తన కోరిక తీర్చాలంటూ వేధించాడు.

 

 గ్రామస్తులు ధర్నా...

 సూసైడ్ నోట్ లభించడంతో గ్రామస్తులంతా బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు. అధ్యాపకుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులందరూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి ధర్నా నిర్వహించారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా గ్రామస్తులకు నచ్చజెబుతూ బాదితున్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. గ్రామస్తులకు అండగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా బాసటగా నిలిచాయి.  

 

 కేసు నమోదు..

 మృతురాలి తండ్రి సూరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధ్యాపకుడు శ్రీనివాస్‌పై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదైంది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని  పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

 

 నాన్న..చెల్లి జాగ్రత్త..

 - శ్రీనివాస్‌సార్ మంచోడు కాదు

 - ఈ లోకం తీరు మారాలి

 భవాని ఇంట్లో లభించిన సూసైడ్ నోట్

 (యథాతధంగా)

 నేను చనిపోయిన టైమ్ 1 పీఎం


 

 అమ్మ..నాన్న చెల్లి జాగ్రత్త. చెల్లిని మంచిగా చదివించండి..చెల్లికి ఏది కావాలంటే అది ఇవ్వండి..అమ్మా..నిన్ను ఏడిపిస్తున్నందుకు నన్ను క్షమించు..నాన్న శోభ జాగ్రత్త. శోభ అంటే నాకు ప్రాణం. దానికి ఏ కష్టం రాకుండా చూసుకో. శ్రీవాణి బాగా చదువుకో. మనం చదివిన క్లాస్ వాళ్లను అడిగిన అని చెప్పు. రాజన్నా..బాలన్న, నర్సింహ, వంశీ, జగదీశ్, సురేష్ రేణుక, భారతి, శ్వేత అందరూ బాగా చదువుకోండి. అలాగే నా చిట్టి చెల్లెలు అందరూ బాగా చదువుకోండి. మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీకాంత్ బావా ఐ మిస్‌యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నిన్ను వదిలి వెళ్తున్నాను. మంచి అమ్మాయిని పెండ్లి చేసుకో. నాన్నా బావ జాగ్రత్త. నేను మళ్లీరాను. అమ్మ..నాన్న, చెల్లి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.


ఈ లోకం ఆడపిల్ల బయటికి వెళ్తే, ఆడపిల్ల క్లాస్‌మేట్‌తో కానీ అన్నయ్యతోకానీ మాట్లాడితే వేరేతీరుగా అర్థం చేసుకుంటుంది. అలాంటి లోకంలో నేడు బతకడం కష్టం. ఈ లోకం మారాలి. అమ్మ..నాన్న ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నాన్న నువ్వు కూడా మాటిమాటికి అనుమానించడం మానుకో. తాగడం బంజేయ్. సరేనా. నాన్న నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. మా కాలేజీలో శ్రీనివాస్‌సార్ మంచోడు కాదు. ఆ సార్‌ను కొంచెం చూడండి. అమ్మాయి అంటే ఒక బొమ్మ అని అనుకుంటాడు. రాము అన్నయ్య ఇన్ని రోజులు నవ్వించినందుకు నీకు చాలా థ్యాంకు. ఐ లవ్ యూ అమ్మ..నాన్న.. మిమ్ముల్ని వదిలి వెళ్తున్నాను.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top