రెండో రోజూ విద్యార్థుల పస్తులు

రెండో రోజూ విద్యార్థుల పస్తులు - Sakshi


♦ నిలిచిన మధ్యాహ్న భోజనం

♦ ఏజెన్సీ, గ్రామ సంఘం సభ్యుల మధ్య తెగని సమస్య

♦ ఇరువురూ కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలన్న అధికారులు

 

 దోమ : మధ్యాహ్న భోజనం ఏజెన్సీ మార్పు విషయంలో గ్రామ సంఘం సభ్యులు, వంట ఏజెన్సీ సిబ్బందికి మధ్య తలెత్తిన గొడవ కారణంగా మండల పరిధిలోని మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండో రోజూ గు రువారం మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. వివరాలిలా.. ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే వంట ఏజెన్సీని గ్రామ సంఘం తీర్మానం మేరకు ఏడాదికోసారి మార్చి కొత్తవారిని నియమించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.



ఇదే పద్ధతిలో గతే డాది ఆరంభంలో నియమించిన వంట ఏజెన్సీ సిబ్బందిని తొలగించి  కొత్త వారిని నియమించడానికి గ్రామ సంఘం ఇటీవల తీర్మానం చేసింది. అయితే గత ఏడాది వంట చేసిన సిబ్బంది గ్రామ సంఘం తీర్మానాన్ని దిక్కరించారు. ఈ సారి కూడా తామే వంట చేస్తామని, ఏజెన్సీని వదులుకునే ది లేదని చెప్పడంతో గొడవ మొదలైంది. గ్రామ సంఘం నిబంధనలకు విరుద్ధంగా గడువు ముగిశాక కూడా ఒకే ఏజెన్సీ సిబ్బంది వంట చేయడానికి వీలు లేదంటూ మహిళా సంఘాల సభ్యులు బుధవారం ఆందోళన నిర్వహించి వంట వండకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే.



అయితే గురువారం ఉదయం వరకు కూడా అధికారులెవరూ జోక్యం చేసుకోకపోవడంతో సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో గ్రామ సంఘం సభ్యులు మరోసారి పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకుని మధ్యాహ్న భోజనం వండకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో చాలా మంది విద్యార్థులు గురువారం మధ్యాహ్నమే ఇళ్లకు వెళ్లిపోయారు. విషయం తెలియడంతో జిల్లా ఉప విద్యాధికారి హరిశ్చంద్ర, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ విజయప్ప, తహసీల్దార్ జనార్దన్ తదితర అధికారులు పాఠశాలకు చేరుకుని ఇరు వర్గాల వారితో చర్చలు జరిపారు. విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇరువర్గాలూ ఓ అంగీకారానికి వచ్చి సమస్యను త్వరతగతిన పరిష్కరించుకోవాలని అధికారులు వారికి సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top