తుమ్మ(ల) ముల్లుతో సైకిల్కి పంక్చర్ !

తుమ్మ(ల) ముల్లుతో సైకిల్కి పంక్చర్ ! - Sakshi


అంతా అనుకున్నట్టే అయింది. ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైకిల్ దిగి... కారెక్కెందుకు రంగం సిద్ధమైంది. అందుకు ముహూర్తం కూడా దాదాపు ఖరారైపోయింది. బహుశా సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఆయన గులాబీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. వినాయకచవితి పర్వదినం సందర్భంగా శుక్రవారం నాడు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసి ముచ్చటించారు. దాంతో తుమ్మల పచ్చ చొక్కా విప్పేస్తారంటూ ఇన్నాళ్లుగా వచ్చిన కథనాలకు మరింత బలం  చేకూరింది.



అసలు తుమ్మల రెండు చక్రాల సైకిల్ దిగి నాలుగు చక్రాల కారు ఎందుకు ఎక్కుతున్నట్లు? ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో అన్ని జిల్లాల్లో కారు హైస్పీడ్తో దూసుకెళ్లినా, ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. అటు తెలుగుదేశం పరిస్థితీ అంతే. దాంతో ఆ జిల్లాలో 'గులాబీ' గుబాళించాలంటే ఏం చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్, ఆయన మంత్రి వర్గ సహాచరులు దృష్టి సారించారు.



ఇప్పటికే ఆ జిల్లాలో పచ్చపార్టీ అగ్రనేతలు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు వర్గాల మధ్య వైరం తారస్థాయికి చేరింది. దాంతో అక్కడ సైకిల్కు పంక్చర్ పెట్టి తుమ్మలను కారు ఎక్కిస్తే సరిపోతుందని మంత్రి వర్గ సహచరుడొకరు కేసీఆర్ చెవిలో ఊదాడు. అంతే.. చకచకా పావులు కదిలాయి. మంత్రులు కేటీఆర్,  హరీష్ రావులు రంగంలోకి దిగారు. అయినా తుమ్మల సైకిల్ దిగడానికి ససేమిరా అనడంతో.... ఇక తప్పదని కేసీఆరే రంగంలోకి దిగారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే అడగడంతో.. ఇక కాదనలేక తుమ్మల కారెక్కెందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో సైకిల్ టైర్కు తుమ్మ(ల) ముల్లు గుచ్చి కారు ఎక్కేందుకు రంగం సిద్ధమైపోయింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top