త్వరలో టీ పీసీసీ చీఫ్ పదవి ఖాళీ?

త్వరలో టీ పీసీసీ చీఫ్ పదవి ఖాళీ? - Sakshi


కాలం ... చేసిన గాయాన్ని మానిపిస్తుందంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటమి గాయం మాత్రం రోజురోజుకు పెద్దదవుతోంది. తెలంగాణ ఇస్తే ఆ రాష్టంలో తప్పక అధికారంలోకి వస్తామన్న ఆ పార్టీ నాయకుల ఆశపై ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లాయి. దాంతో తెలంగాణలో పార్టీ ఓటమికి మీరంటే మీరని ఆ పార్టీ అధ్యక్షుడు పొన్నాల... సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దాంతో ఆ పంచాయితీ కాస్తా పార్టీ అధిష్టానం వద్దకు చేర్చింది. దాంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు సీనియర్ నేతలతో అధిష్టానం చర్చించింది.



గ్రేటర్ ఎన్నికలు బూల్లెట్లా దూసుకొస్తున్నాయి... ఆ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ఢిల్లీ అధిష్టానం సదరు నాయకులకు తలంటింది. పొన్నాల పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే ఆ ఎన్నికలు కూడా హుష్ కాకీ అన్నట్లు ఎగిరిపోతాయని సీనియర్ నాయకులు వెల్లడించారు. రాష్ట్రంలో పీసీసీ చీఫ్ను తప్పిస్తేనే కానీ పార్టీ బతికి బట్టకట్టదని సదరు నేతలు అధిష్టానం వద్ద కుండ బద్దలు కొట్టారు. పీసీసీ చీఫ్ పోన్నాలను మార్చండి... గ్రేటర్ ఎన్నికల సంగతి మేం చూసుకుంటామంటూ కాంగ్రెస్ అధినాయకత్వానికి భరోసా ఇచ్చారు.



దాంతో అధిష్టానం కూడా పీసీసీ చీఫ్ పొన్నాలకు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. దాంతో తాము పీసీసీ చీఫ్ రేసులో మేమున్నాంటూ తెలంగాణ నాయకులు ఇప్పటికే హస్తిన బాట పడుతున్నారు. తనకే పీసీసీ పదవి ఇవ్వాలంటూ పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ పార్టీ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ను ఇటీవలే హస్తినలో కలసి విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top